ఉగ్రవాదుల టాప్ కమాండర్‌ను లేపేసిన ఇండియన్ ఆర్మీ
పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలను వెంటాడి వేటాడి మరీ చంపుతోంది.

పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటోంది. 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలను వెంటాడి వేటాడి మరీ చంపుతోంది. ఈ క్రమంలోనే పహల్గాం ఉగ్రదాడితో ప్రమేయమున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
బందిపోరాలో జరిగిన ఎన్ కౌంటర్లో అల్తాఫ్ లల్లీని అంతమొందించారు జవాన్లు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కుల్నార్, బందిపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు..
బందిపోరాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జవాన్ల రాకను గమనించిన ఉగ్రమూకలు ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది. భద్రతా దళాల కాల్పుల్లో ఎల్ఈటీ టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం వారిని వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు.