సారంగపాణి జాతకం రివ్యూ.. ప్రియదర్శి నీ జాతకం నిజంగా బాగుంది.. మళ్ళీ కొట్టావ్..!
బలగం, కోర్ట్ లాంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నుంచి సినిమా వస్తుంది అంటే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో వచ్చేసింది.

బలగం, కోర్ట్ లాంటి సినిమాల తర్వాత ప్రియదర్శి నుంచి సినిమా వస్తుంది అంటే అంచనాలు బాగా పెరిగిపోయాయి. ఖచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకం కూడా ప్రేక్షకుల్లో వచ్చేసింది. తాజాగా ఈయన హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కించిన సినిమా సారంగపాణి జాతకం. మరి ఇది ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ విషయానికి వస్తే.. ప్రియదర్శికి చిన్నప్పటి నుంచి జాతకాలు అంటే మహా పిచ్చి. పొద్దున్నే లేవగానే రోజు జాతకం చూసుకుంటూ ఉంటాడు. ఒక కార్ షోరూమ్ లో సేల్స్ మెన్ గా పని చేస్తుంటాడు దర్శి. అదే కంపెనీలో మేనేజర్ గా ఉండే రూప కొడవయూర్ రెండేళ్లుగా ప్రియదర్శిని ప్రేమిస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. అంతా సాఫీగా సాగిపోతున్న దర్శి జీవితంలోకి అనుకోకుండా అవసరాల శ్రీనివాస్ అనే ఆస్ట్రాలజర్ ఎంట్రీ ఇస్తాడు. జాతకం చూసి నువ్వు ఒక హత్య చేస్తావు అంటూ దర్శికి చెప్తాడు. మామూలుగానే జాతకాలు అంటే పిచ్చి ఉండే ప్రియదర్శి.. తాను ఎవరిని హత్య చేస్తానో తెలియక పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటాడు. ఎవరో ఒకరిని చంపేద్దాం అని స్నేహితుడు వెన్నెల కిషోర్ తో కలిసి వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా తనికెళ్ల భరణి, వైవా హర్ష ఇద్దరూ ప్రియదర్శి జీవితంలోకి వస్తారు. మరోవైపు వింతగా ప్రవర్తిస్తున్న ప్రియదర్శని చూసి పెళ్లి క్యాన్సిల్ చేస్తారు రూప తల్లిదండ్రులు. ఆ తర్వాత ఏం జరిగింది.. నిజంగానే దర్శి జాతకంలో మర్డర్ ఉంటుందా లేదా అనేది మిగిలిన కథ..
కథనం విషయానికి వస్తే.. ఈరోజుల్లో ఒక ఎమోషనల్ సినిమా చేసి ప్రేక్షకులను కంటతడి పెట్టించడం కాస్త సులువే. రెండు మూడు ఎమోషనల్ సీన్స్ బలంగా పడితే చాలు కనెక్ట్ అయిపోతారు. కానీ ఆడియన్స్ ను కడుపు పట్టుకొని నవ్వేలా చేయడం చాలా కష్టం. దానికి చాలా బలమైన కథ, కథనాలు ఉండాలి. రొటీన్ స్టోరీ తీసుకున్న కూడా స్క్రీన్ ప్లే పరుగులు పెట్టాలి. సారంగపాణి జాతకం విషయంలో ఇదే జరిగింది. జాతకాలు నమ్మే ఒక అబ్బాయి.. నువ్వు హత్య చేస్తావని ఒక ఆస్ట్రాలజర్ చెప్తే ముందు వెనుక ఆలోచించకుండా పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేసే ఒక కథ ఇది. సింపుల్ స్టోరీ తీసుకున్న కూడా స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా హీలేరియస్ గా వర్కౌట్ అయింది సారంగపాణి జాతకం.
తొలి అరగంట కాస్త నెమ్మదిగా సాగుతుంది. ఎప్పుడైతే అవసరాల శ్రీనివాస్ కథలోకి వచ్చాడు అక్కడి నుంచి అసలు ఆగలేదు ఈ సినిమా. ఫస్టాఫ్ రెండు మూడు సన్నివేశాలు బాగా పేలాయి. ఇక సెకండ్ హాఫ్ వైవా హర్ష వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ డోస్ మరింత పెరిగింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, హర్ష కాంబోలో వచ్చే సీన్స్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాయి. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే చాలా సన్నివేశాలు బాగా వర్కవుట్ అయ్యాయి. సినిమా ఇండస్ట్రీ మీద వేసే జోకులు కూడా భలే ముచ్చటగా ఉన్నాయి. ఇప్పుడు నీకు వేణు స్వామి వచ్చి జాతకం చెప్పాలా.., ఇప్పుడు ఫుల్ నేరేషన్ ఇస్తావ్ ఏంట్రా స్టార్ హీరోకు చెప్పినట్టు లైన్ చెప్పు చాలు, సంక్రాంతికి అన్ని సినిమాలు వచ్చి ఒకే థియేటర్ మీద పడ్డట్టు అందరూ ఇక్కడే ఉన్నారు ఏంట్రా.. ఇలా సినిమా వాళ్లపై వేసిన జోకులు బాగా పేలాయి. క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నాడు ఇంద్రగంటి.
నటీనటుల విషయానికి వస్తే.. ప్రియదర్శి మరోసారి అద్భుతంగా నటించాడు. ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చినా కూడా ఈజీగా అందులోకి దూరిపోతాడు దర్శి. తెలుగమ్మాయి రూపా కూడా చాలా బాగా నటించింది. తనవరకు అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అవసరాల శ్రీనివాస్ కనిపించింది కాసేపైనా కథను మలుపు తిప్పాడు. వెన్నెల కిషోర్ ఈ సినిమాకు మరొక హీరో. వన్ లైనర్స్ తో బాగా నవ్వించాడు. వైవా హర్ష సెకండాఫ్ చాలా బాగా నవ్వించాడు. తనికెళ్ల భరణి సహా ఇంకా చాలామంది నటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి. ఇక దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ చాలా రోజుల తర్వాత తనదైన శైలిలో కడుపులు చెక్కలయ్యేలా నవ్వించాడు. కథ పాతదే అయిన కథనం మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది.
ఓవరాల్ గా సారంగపాణి జాతకం.. హాట్ సమ్మర్ లో కూల్ ఎంటర్టైనర్..