కళ్ళు నెత్తికెక్కితే కెరీర్ ఖతమ్, వైభవ్ కు సెహ్వాగ్ అడ్వైజ్

ఐపీఎల్ లో ఈ సారి పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుతంగా ఆడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2025 | 05:24 PMLast Updated on: Apr 25, 2025 | 5:24 PM

Sehwags Advice To Vaibhav

ఐపీఎల్ లో ఈ సారి పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. ఫ్రాంచైజీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అద్భుతంగా ఆడుతున్నారు. మెగావేలంలో 14 ఏళ్ళకే అమ్ముడై చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ కూడా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అరంగేట్రంలోనే అదిరిపోయే బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ కొట్టి తడాఖా చూపించాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన పద్నాలుగేళ్ల వైభవ్‌ సూర్యవంశీని ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి మరీ రాజస్తాన్‌ రాయల్స్‌ 1.10 కోట్లకు అతడిని దక్కించుకుంది. ఇటీవల లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం కూడా ఇచ్చింది.

కెప్టెన్‌ సంజూ శాంసన్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో అతడి స్థానంలో వైభవ్‌ వచ్చాడు. అత్యంత పిన్నవయసులోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన క్రికెటర్‌గా చరిత్రకెక్కిన ఈ బిహార్‌ కుర్రాడు.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 20 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 34 పరుగులు సాధించాడు. ఇ ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ వైభవ్‌ దూకుడుగానే ఆడాడు. దీంతో వైభవ్ సూర్యవంశీపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. కానీ భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం వైభవ్ కు కీలక సూచనలు చేశాడు. చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులు పొందిన చాలా మంది ఆటగాళ్లు.. అంతే త్వరగా కనుమరుగైపోయిన ఉదాహరణలు చాలానే ఉన్నాయన్నాడు. కాబట్టి వైభవ్‌ ఆచితూచి అడుగేస్తూ కెరీర్‌ ప్లాన్‌ చేసుకోవాలని వీరూ సూచించాడు.

చాలా మంది ఆటగాళ్లు.. ఒకటీ- రెండు మ్యాచ్‌ల ద్వారా ఫేమస్‌ అయిన వెంటనే దారి తప్పుతారని గుర్తు చేశాడు.. తాము స్టార్‌ ప్లేయర్‌ అయిపోయామనే భ్రమలో ఆ తర్వాత కనీస ప్రదర్శన కూడా చేయలేకపోతారన్నాడు. సూర్యవంశీ మరో 20 ఏళ్ల పాటు ఐపీఎల్‌ ఆడాలనే లక్ష్యంతో ఉండాలని సూచించాడు. అతను కోహ్లీని స్ఫూర్తిగా తీసుకోవాలని అడ్వైజ్ చేశాడు.ఈ ఐపీఎల్‌ సీజన్‌లో సాధించిన దానితో సంతోషపడితే మాత్రం వచ్చే ఏడాది మనం అతడిని చూసే అవకాశం ఉండకపోవచ్చని హెచ్చరించాడు.