అరంగేట్రంలోనే అదుర్స్ ఎవరీ ఆయుష్ మాత్రే ?
ఐపీఎల్ 18వ సీజన్ లో పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. అరంగేట్రంలోనే తమ సత్తా చూపిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూఛర్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఐపీఎల్ 18వ సీజన్ లో పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. అరంగేట్రంలోనే తమ సత్తా చూపిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూఛర్ స్టార్స్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మరో చిచ్చర పిడుగు ఎంట్రీ ఇచ్చాడు. సీఎస్కే తరఫున ముంబైకి చెందిన 17 ఏళ్ల ఆయుశ్ మాత్రే అరంగేట్రం చేశాడు. రాహుల్ త్రిపాఠి స్థానంలో ఆయుశ్‌ను తుది జట్టులోకి తీసుకున్నాడు ధోనీ…ఇలా 20 ఏళ్లలోపు ప్లేయర్లకు సీఎస్కే ఛాన్స్ ఇవ్వడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాల్గవసారి. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో 20 ఏళ్ల షేక్ రషీద్ ఐపీఎల్ అరంగేట్రం చేయగా, ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఆయుష్ మాత్రేను రంగంలోకి దించింది. తొలి మ్యాచ్‌లోనే తన బ్యాటింగ్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు.
చెన్నై సూపర్ కింగ్స్ తరపున అతి పిన్న వయస్సులో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఆటగాడిగా ఆయుష్ మాత్రే నిలిచాడు. 17 ఏళ్ల వయసులోనే ఈ ఘనత సాధించాడు. అంతకుముందు షేక్ రషీద్ 20 ఏళ్ల వయసులో చెన్నై తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు 17 ఏళ్ల 278 రోజుల్లో ఆయుష్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అతిపెద్ద క్రికెట్ లీగ్‌లోకి అడుగుపెట్టాడు. కేవలం అడుగుపెట్టడమే కాదు, తన బ్యాటింగ్‌తో భారతీయ అభిమానులకు కొత్త స్టేట్‌మెంట్ ఇచ్చాడు, ఆయుష్ మ్హాత్రే ఐపీఎల్ తన ఇన్నింగ్స్ మూడో బంతికే సిక్సర్ బాదాడు. యంగ్ బౌలర్ అశ్విని కుమార్ వేసిన ఓవర్ మూడో బంతికి ఫోర్ కొట్టి, ఆ తర్వాత నాలుగో, ఐదో బంతులకు వరుసగా రెండు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. తన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే వరుసగా మూడు బౌండరీలు కొట్టి భారత జట్టులోకి వచ్చే మరో భవిష్యత్తు స్టార్ ను అంటూ సంకేతాలు పంపాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేశాడు.
దీంతో ఎవరీ మాత్రే అంటూ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. 17 ఏళ్ల మాత్రేకు దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున మంచి రికార్డు ఉంది. అతడు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచులలో 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో కలిపి 504 రన్స్ చేశాడు. ఇప్పటికే 7 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో 2 సెంచరీలతో 458 పరుగులు చేశాడు. గత అక్టోబర్‌లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 17 ఏళ్ల ప్లేయర్.. తాజాగా క్యాష్‌రిచ్ లీగ్ అయిన ఐపీఎల్‌లోనూ అడుగుపెట్టాడు.
ఆయుష్‌ను మెగా వేలంలో ఎవరూ కొనలేదు, కానీ సీఎస్కే నిర్వహించిన మిడ్-సీజన్ ట్రయల్స్‌లో అతను ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. దీంతో ఆయుష్ కు సీఎస్కే 30 లక్షల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చింది. బీసీసీఐ నిర్వహించిన అండర్-19 జోనల్ క్యాంప్‌లో తన ప్రతిభను చూపిన ఆయూష్.. దేశవాళీ క్రికెట్ లో అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీ మొత్తానికి దూరమవడంతో అతని ప్లేసులో ఆయుశ్‌ను తీసుకుంది.