Top story:సింధు ఒప్పందం సస్పెన్షన్ ఆరంభమే, పాక్‌కు అసలు సినిమా ముందే ఉంది..

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్. కానీ, ఎక్కడపడితే అక్కడ తగ్గాల్సిన అవసరంలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 07:45 PMLast Updated on: Apr 24, 2025 | 7:45 PM

The Suspension Of The Indus Treaty Is Just The Beginning Pakistan Has The Real Movie Ahead Of It

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు అనే డైలాగ్ చాలా పాపులర్. కానీ, ఎక్కడపడితే అక్కడ తగ్గాల్సిన అవసరంలేదు. పోనీలే అని జాలిపడితే మనల్నే ముంచేసే రోజులివి. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి ఉగ్ర దేశంపై అస్సలు జాలి చూపించకూడదు. తగ్గడం గురించి అసలు ఆలోచించకూడదు. ఇది మోడీ సర్కార్‌కు పక్కాగా తెలుసు. కశ్మీర్ ఉగ్రదాడికి ప్రతీకారంలో కూడా అదే చేసింది. మిలిటరీ యాక్షన్‌కు ముందే పాకిస్తాన్ ఊపిరి ఆగిపోయే నిర్ణయాలు తీసుకుంది. 5 నిర్ణయాల ద్వారా పాకిస్తాన్‌ ఎన్నటికీ కోలుకోలేని పవర్ స్ట్రోక్స్ ఇచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంలో దౌత్య పరంగా తీసుకున్న నిర్ణయాలు ఆరంభం మాత్రమే. ఎందుకంటే, ఈ ప్రతీకారం ముగిసేది మిలిటరీ యాక్షన్‌తోనే. ఇంతకూ, దౌత్యపరంగా పాక్ బెండు తీసే ఆ ఐదు నిర్ణయాలేంటి? టాప్ స్టోరీలో చూద్దాం..

సార్క్‌ వీసా మినహాయింపు పథకం కింద పాక్‌ జాతీయులకు భారత వీసాల జారీ నిలిపివేత మొదటి నిర్ణయం. ఇప్పటికే జారీ చేయబడిన వీసాలను రద్దు చేశారు. వాటిపై ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్తానీలు 48 గంటల్లో దేశం వీడాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఒకరకంగా పాక్‌తో పూర్తి తెగదెంపులు చేసుకున్నట్టే. ఇక రెండోది భారత్-పాకిస్తాన్ మధ్య రాకపోకలు జరుగుతున్న పంజా బ్‌లోని అటారీ సరిహద్దు మూసివేత. ఈ మార్గం గుండా వెళ్లినవారు తిరిగి వచ్చేందుకు మే 1వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. మూడో నిర్ణయం ఢిల్లీలోని పాక్ హై కమిషన్ నుంచి రక్షణ, త్రివిధ దళాల సలహాదారు, వారి ఐదుగురు సహాయక సిబ్బంది బహిష్కరణ. వీరంతా వారం రోజుల్లో భారత్‌ను వీడి వెళ్లిపోవాలి. అలాగే, ఇస్లామాబాద్‌లోని మన దేశ హై కమిషన్‌ నుంచి భారత రక్షణ, త్రివిధ దళాల సలహాదారులను ఉపసంహరించుకున్నారు. నాలుగో నిర్ణయం ఇరుదేశాల హై కమిషన్లలో సిబ్బంది సంఖ్య 55 నుంచి 30కి తగ్గించడం. చివరిదైన ఐదో నిర్ణయం పాకిస్తాన్‌ను కలలో కూడా ఉలిక్కిపడే లా చేయబోతోంది. ఆ దేశాన్ని ఎడారిగానూ మార్చబోతోంది. అదే ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్.

జస్ట్ 12 సెకన్ల ఈ ప్రకటనే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఎందుకో తెలియాలంటే 64 సంవత్సరాల నాటి సింధు జలాల ఒప్పందం గురించి తెలుసుకోవాలి. సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబర్‌లో నాటి ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్‌ నదులపై భారత్‌కు హక్కులు లభించాయి. ఏడాదికి వీటి సగటు ప్రవాహం 33 మిలియన్‌ ఎకరాల అడుగులుగా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై హక్కులు పాకిస్తాన్‌కు దక్కాయి. వీటి సామర్థ్యం 135 మిలియన్‌ ఎకరాల అడుగులుగా ఉంది. ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు.
సింధు, దాని ఉపనదుల జలాలను భారత్, పాక్‌లు పరస్పర స్నేహ, సహకార, సుహృద్భావాలతో పంచుకోవాలని ఒప్పందం చెబుతోంది. పశ్చిమ నదుల జలాల్లో భారత్‌‌కు వచ్చే వాటాను సేద్యానికి పరిమితంగా.. విద్యుత్‌ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేటకు గరిష్ఠంగా వాడుకోవచ్చు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్‌‌ను ఏర్పాటు చేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలుకు సంబంధించి ఏటా సమావేశాలు జరుగుతాయి. వివరంగా చెప్పాలంటే ఇదే సింధు జలాల ఒప్పందం.

వాస్తవానికి.. ఇన్నేళ్లలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగినా, ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవీ అడ్డురాలేదు. కానీ, ఇటీవల డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చినాబ్‌లపై జమ్మూకశ్మీర్‌లో నిర్మితమవుతున్న పవర్ ప్రాజెక్టులపై ఇస్లామాబాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సింధు జలాల పంపిణీ ఒప్పందంపై పునఃసమీక్ష జరపాల్సి ఉందని మోడీ సర్కార్ డిమాండ్‌ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికీ, ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో, తాగు, సాగునీటి అవసరాలలో చాలా మార్పులు వచ్చాయనీ, పర్యావరణ, భౌగోళిక, రాజకీయపరంగా మార్పులు చోటుచేసుకున్నాయని.. వాటిని పరిగణనలోకి తీసుకొని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని స్పష్టంచేసింది. అయితే, దీనిపై పాక్‌ మాత్రం వ్యతిరేకత వ్యక్తంచేస్తూ వస్తోంది. ఈలోగా పహల్గామ్ ఉగ్రదాడి జరగడంతో ఈ ఒప్పందం అమలును భారత్‌ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. 64 ఏళ్ల నాటి ఒప్పందం రద్దుకు తాజా సస్పెన్షన్ ఆరంభంగా నిపుణులు చెబుతున్నారు. అయితే, సింధు జలాల విషయంలో పాక్‌కు అసలు స్ట్రోక్ ఏడాది క్రితమే ఇచ్చింది మోడీ సర్కార్.

గతేడాది జనవరిలో చీనాబ్ జలాలను మళ్లించి ఫస్ట్ షాక్ ఇచ్చింది భారత్. జనవరి చివర్లో పాకిస్తాన్‌కి వెళ్ళే చినాబ్ నది ప్రవాహాన్ని సైలెంట్‌గా మళ్లించేశారు. ఊహించిన దానికంటే ముందే పాకిస్తాన్‌లోకి నీటిప్రవాహాన్ని అరికట్టే యాక్షన్ ప్లాన్ రియాలిటీలోకి తీసుకువచ్చారు. కశ్మీర్‌లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ వద్ద 2024 జనవరి 27న కిష్‌త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షాల్లా వద్ద సొరంగాల ద్వారా చీనాబ్ నదిని మళ్లించారు. పాక్‌లోకి నీటిప్రవాహాన్ని ఆపడమేకాకుండా, రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దాదాపు 4వేల మంది వ్యక్తులకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 40 సంవత్సరాల జీవితకాలంలో 5వేల 289 కోట్ల విలువైన ఉచిత విద్యుత్, 9వేల 581 కోట్ల నీటి వినియోగ ఛార్జీల నుండి ప్రయోజనం పొందుతుంది. ఈ చర్య ద్వారా పదే పదే మనమీదకు రాళ్లు దువ్వి, అంతులేని విషాన్ని దేశంలోకి ప్రవహింపజేసే పాకిస్తాన్‌కు రక్తం, నీళ్ళు కలిసి పారలేవని తేల్చి చెప్పినట్టు అయింది. అక్కడితో అయిపోలేదు.. చీనాబ్ జలాలు మళ్లించిన తర్వాతి నెలలోనే ఇస్లామాబాద్‌కు మరో షాక్ ఇచ్చింది భారత్. ఈ సారి రావి నదీ జలాలను నిలిపేసి చావుదెబ్బకొట్టింది.

సింధు దాని ఉపనదుల జలాలను సమర్థవంతంగా వాడుకోవాలని భారత్ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. షాపూర్ కంది బ్యారేజ్‌తో ఆ అవకాశం దొరికింది. ఈ బ్యారేజ్ పూర్తికానంత వరకూ పాకిస్తాన్‌కు రావి నది నుంచి 1150 క్యూసెక్కుల నీరు ప్రవహించేంది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి కావడంతో పాకిస్తాన్‌కు వెళ్లే నీటిని జమ్మూకశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32వేల హెక్టార్ల భూమికి సాగు నీరుగా మళ్లిస్తున్నారు. షాపూర్ కంది బ్యారేజీ ద్వారా 1150 క్యూసెక్కుల నీటిని పాక్‌కు వెళ్లకుండా అడ్డుకోవడమే కాదు. ఈ చర్యతో రావి, సట్లెజ్, బియాస్ నదులపై మన దేశానికి ప్రత్యేక నియంత్రణ దొరుకుతుంది. ప్రపంచంలో అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. ఉగ్ర దేశానికి సింధు నదీ జలాలే ప్రధాన వనరు. వ్యవసాయంపై ఆధారపడిన పాకిస్తాన్‌లో ఈ నదీ జలాలు అత్యంత కీలకం. అయితే, ఈ నదీ జలాలను కేవలం పాకిస్తాన్ పంజాబ్ మాత్రమే సమర్థంగా వినియోగించుకుంటోంది. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి. ఒక వేళ భారత్ నుంచి వెళ్లే ఈ నదీ జలాల విషయంలో మన ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటే, పాకిస్తాన్ ఏడారిగా మారడం ఖాయం. ఒక్క ముక్కలో చెప్పాలంటే పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంలో తాజా నిర్ణయం మరో సర్జికల్ స్ట్రైక్‌తో సమానం. కానీ, ఇక్కడితో అంతా అయిపోయినట్టు కాదు.. అసలు దెబ్బ ముందే ఉంది.