Top story:భారత్ దెబ్బకు వణుకుతున్న పాకిస్తాన్, రెండు దేశాల మధ్య ఎనీటైం యాక్షన్

యుద్ధానికంటే నిశ్శబ్దమే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రత్యర్ధి ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తాడో తెలియక శత్రువు ఉక్కిరి బిక్కిరి అవుతాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 09:00 PMLast Updated on: Apr 24, 2025 | 9:00 PM

Pakistan Trembles Under Indias Attack Anytime Action Between The Two Countries

యుద్ధానికంటే నిశ్శబ్దమే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రత్యర్ధి ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేస్తాడో తెలియక శత్రువు ఉక్కిరి బిక్కిరి అవుతాడు. కంటినిండా నిద్ర ఉండదు, నోటికి తిండి ఎక్కదు, ప్రశాంతత అన్న మాట దరిదాపుల్లో కూడా ఉండదు. ఉండేదల్లా భయం ఒక్కటే. ప్రస్తుతం పాకిస్తాన్ ఇలాంటి సిట్యువేషన్‌లోనే ఉంది. దౌత్యపరంగా ఐదు నిర్ణయాలతో పాకిస్తాన్ ఉలిక్కిపడేలా చేసిన మోడీ సర్కార్.. మిలిటరీ యాక్షన్‌లో ఇంకెంత వయలెంట్‌గా రియాక్ట్ అవుతుందో అర్ధం కాక ఇస్లామాబాద్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మోడీ సంచలన ప్రకటన చేశారు. ఆ ప్రకటనే పాకిస్తాన్ భయాన్ని రెట్టింపు చేసింది. ఇంతకూ, సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. మోడీ చేసిన ప్రకటన ఏంటి? ఆ ప్రకటనతో ప్రపంచానికి ప్రధాని ఎలాంటి సందేశం ఇచ్చారు? టాప్ స్టోరీలో చూద్దాం..

ప్రధాని మోడీ సాధారణమంగా ఇంగ్లీష్‌లో చాలా తక్కువ సందర్భాల్లోనే మాట్లాడతారు. అది కూడా అంతర్జాతీయ వేదికల్లో అయితేనే. కానీ, బిహార్‌లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో మాత్రం ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఎందుకంటే, తన మాటలు దేశానికే కాదు శత్రువుకు, ప్రపంచం మొత్తానికీ అర్ధం కావాలి కాబట్టి. అందుకే బిహార్ గడ్డపై నిల్చుని ప్రపంచం మొత్తానికీ చెబుతున్నా అంటూ శత్రువుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి వెనక ఉన్నవారు.. కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్షిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, ట్రాక్‌ చేసి, శిక్షిస్తామని యావత్‌ భారతీయులకు హామీ ఇస్తున్నా. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రమూకల వెన్నెముకను 140 కోట్ల మంది విరిచేస్తారు’’ అని ప్రధాని గట్టిగా హెచ్చరించారు.

ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైందన్న మోడీ మాటే పాకిస్తాన్‌ భయాన్ని రెట్టింపు చేసింది. నిజానికి.. మోడీ ఈ హెచ్చరికలు చేయకముందే పాక్ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లలో మునిగిపోయింది. పహల్గామ్ దాడికి భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్‌‌కి అర్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ ఉగ్రదాడితో అలర్ట్ అయిన పాకిస్తాన్.. సైన్యాన్ని అప్రమత్తం చేసింది. భారత సరిహద్దుల్లోకి పాక్ యుద్ధ విమానాలను మోహరిస్తోంది. పాకిస్తాన్ మిలిటరీ.. తమ యుద్ధ విమానాలను కరాచీ నుంచి ఉత్తరాన ఉన్న వైమానిక స్థావరాలకు పంపించినట్లు వార్తలు వస్తున్నాయి. విమానాల ట్రాకింగ్‌కు సంబంధించి నెటిజన్లు ఎక్స్‌లో స్క్రీన్‌ షాట్లు షేర్‌ చేస్తున్నారు. ఆ స్క్రీన్‌ షాట్లలో వివరాల ప్రకారం.. కరాచీలోని దక్షిణ ఎయిర్‌ కమాండ్ నుంచి ఉత్తరం వైపున ఉన్న లాహోర్, రావల్పిండి నగరాలకు సమీపంలో ఉన్న ఎయిర్‌బేస్‌ల వైపు పాక్‌ యుద్ధ విమానాలు బయల్దేరుతున్నాయి. పాకిస్తాన్‌కు అత్యంత కీలకమైన నూర్‌ఖాన్ బేస్ రావల్పిండిలో ఉంది. ఇది మన దేశ సరిహద్దు సమీపంలోనే ఉంటుంది. ఇక ఆ స్క్రీన్ షాట్లలో రవాణా విమానమైన లాక్‌హీడ్ సీ-130 హెర్క్యూలస్, నిఘా కోసం, వీఐపీల తరలింపునకు వాడే ఎంబ్రారర్ ఫోనమ్ 100 జెట్ విమానం కనిపించాయి.

మరోవైపు.. ఐఎస్ఐ హెచ్చరికలతోసరిహద్దు గ్రామాలను పాక్ ఆర్మీ ఖాళీ చేయిస్తోంది. పాక్ఆక్రమిత కశ్మీర్‌లో 42 లాంచ్ ప్యాడ్లను పాకిస్తాన్ సిద్ధం చేసినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. 130 మంది ఉగ్రవాదులు పై నుంచి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. భారత్‌లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తోయిబా నుంచి 60 మంది, స్థానిక టెర్రరిస్టులు 17 మంది ఉన్నట్టు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. ఇవన్నీ భారత్ దాడి చేస్తుందన్న భయంతో పాకిస్తాన్ చేసుకుంటున్న ఏర్పాట్లే. కానీ, భారత్ దాడికి దిగితే శత్రువులు ఒక్కరు కూడా ప్రాణాలతో తప్పించుకునే అవకాశమే లేదు. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్స్‌తోనే భారత్ సత్తా ఏంటో శత్రు దేశానికి తెలుసు. ఈ క్రమంలోనే భారత్ దాడి చేస్తే ఎలా తిప్పికొట్టాలన్న విషయంలో కసరత్తులు ప్రారంభించింది. క్షిపణి పరీక్షలు సైతం నిర్వహిస్తూ భారత్‌ను భయపెట్టాలనుకుంటోంది. కానీ, అవేవీ వర్క్‌ఔట్ కావు. ఎందుకంటే, ఇక్కడ యాక్షన్‌లో ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ ఉన్నారు.

నిజానికి దౌత్యపరంగా భారత్ తీసుకున్న 5 నిర్ణయాలే ఇస్లామాబాద్‌ను వణికించాయి. ఈ క్రమంలోనే అత్యవసర సమావేశం నిర్వహించి షరీఫ్ సర్కార్ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. తమ దేశంలో ఉన్న భారత పౌరుల్ని వీడాలని ఆదేశించింది. భారత్‌తో వ్యాపార సంబంధాలు తెంచు కుంటున్నట్టు ప్రకటించింది. ఇండస్ వాటర్ ట్రీటీ సస్పెన్షన్‌ యుద్ధం ప్రకటించడమే అని పేర్కొంది.
భారత విమానాలకు పాకిస్తాన్ గగనతలం మూసివేస్తున్నట్టు ప్రకటించిన షరీఫ్ సర్కార్.. భారత్ దాడి చేస్తే తిప్పికొట్టాలని సైన్యాన్ని ఆదేశించింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో తమ దేశ సైనికులకు సెలవులు రద్దు చేస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం ఒక్కటి చాలు.. భారత్ ప్రతీకారానికి ఆ దేశం ఎంతగా భయ పడుతుందో చెప్పడానికి. ఇప్పుడు భారత్ చేయాల్సిందల్లా ఆ భయాన్ని నిజం చేయడం ఒక్కటే. ఆ పనిలోనే ఇండియన్ జేమ్స్‌బాండ్ అజిత్ దోవల్ నిమగ్నమై ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క టి మాత్రం నిజం.. భారత్, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎడ్జ్‌లో ఉన్నాయి. ఈ పరిణామాలు మరో యుద్ధం దిశగా తీసుకెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.