Top story: రాజకీయ పార్టీలకు వంతపాడుతున్న బ్యూరోక్రాట్లు ,కేసుల్లో అడ్డంగా బుక్కవుతున్న ఏపీ ఐపీఎస్‌లు

ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారిపోతోంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ చేతిలోకి అధికారం వస్తుంది. అధికారం తాత్కాలికం. ఉద్యోగం శాశ్వతం...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 24, 2025 | 06:50 PMLast Updated on: Apr 24, 2025 | 6:50 PM

Bureaucrats Are Being Patronized By Political Parties And Ap Ips Officers Are Being Booked In Cases

ప్రతి ఐదేళ్లకోసారి అధికారం మారిపోతోంది. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ చేతిలోకి అధికారం వస్తుంది. అధికారం తాత్కాలికం. ఉద్యోగం శాశ్వతం…ఈ చిన్న లాజిక్‌ను బ్యూరోక్రాట్లు మిస్సవుతున్నారు. రాజకీయ పార్టీలకు వంతపాడుతున్నారు. అడ్డంగా బుక్కయిపోతున్నారు. జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. కళ్ల ముందే సహచరులు కేసుల్లో ఇరుక్కుంటున్నా…ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మాత్రం మారడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌లో బ్యూరోక్రాట్లు మారడం లేదు. ఏరికోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఐపీఎస్‌లు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ప్రభుత్వాలు మారుతున్నాయి తప్పా…బ్యూరోక్రాట్లు జైళ్లకు వెళ్లడం మాత్రం ఆగడం లేదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు…రాజకీయ పార్టీలతో అంటకాగడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే…ఆ పార్టీకి కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు వంతపాడటం అలవాటుగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎల్వీ సుబ్రమణ్యం, శ్రీలక్ష్మి, బీపీ ఆచార్య వంటి వారిపై కేసులు నమోదయ్యారు. కోర్టులు చుట్టూ చక్కర్లు కొట్టారు. కొందరు ఐఏఎస్‌లు జైళ్లకు వెళ్లి వచ్చారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కేసులు చూసయినా ఏపీలోని బ్యూరోక్రాట్లు నేర్చుకోవడం లేదు. తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అధికార శాశ్వతం అనుకొని…తమకు నచ్చిన రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారు. ఆ పార్టీ అగ్రనేతలు చెప్పినట్లు ఇష్జారాజ్యంగా అడ్డదారులు తొక్కుతున్నారు. నేతల అడుగులకు మడుగులొత్తుతూ…కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. ఏ పార్టీ ఎల్లకాలం ఉండదనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. కాలానికి అతీతులు అన్నట్లు…ఆకాశం నుంచి ఊడి పడ్డామన్న రేంజ్‌లో రెచ్చిపోయారు. పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌ వంటి సీనియర్ ఐపీఎస్‌లు..వైసీపీ హయాంలో టీడీపీ నేతలను దారుణంగా వేధించారు. కేసులు పెట్టి జైళ్లకు పంపారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం…వెంటనే కేసులు పెట్టి జైళ్లకు పంపారు. ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో మాత్రం ఊహించలేకపోయారు.

అప్పటి ఇంటిలిజెన్స్ డిజి సీతారామాంజనేయులు, క్రాంతిరాణా తాతా, విశాల్ గున్ని వైసీపీ హయాంలో రెచ్చిపోయారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు. కూటమి సర్కార్‌ అధికారంలోకి రావడంతో… జెత్వాని కేసులో ఇప్పటికే పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు జైలుకు వెళ్లాడు. నెక్స్ట్‌ జాబితాలో కాంతిరాణా తాతా, విశాల్‌ గున్ని ఉన్నారు. ఎక్కడ అరెస్టు చేస్తారన్న భయంతో…ఇప్పటికే ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. పీఎస్‌ఆర్‌ అరెస్టుతో వీళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది. కాంతిరాణా, విశాల్‌ గున్ని అరెస్టు లేట్‌ కావచ్చేమో కానీ…జైలుకు పంపడం మాత్రం పక్కా అని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.

చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన ఇంటిలిజెన్స్ మాజీ డిజి ఏబి వెంకటేశ్వరరావు…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. ఆయన్ను ఏడిపించి…ఏడు చెరువుల నీళ్లు తాగించారు అప్పటి సీఎం జగన్‌. ఏళ్ల తరబడి కోర్టులు చుట్టూ తిరిగినా…పోస్టింగ్‌ ఇవ్వడం సంగతి అటుంచితే…కనీసం జీతం కూడా ఇవ్వని పరిస్థితి. చివరికి రిటైర్‌మెంట్‌ అయ్యే రోజు…అలా పోస్టింగ్‌ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు జగన్‌. 2014 నుంచి 2019 వరకు ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ కార్యకర్తలాగే పని చేశాడు. చంద్రబాబు అధికారంలోకి రావడంతో పోలీస్‌ వేర్‌ హౌసింగ్‌ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు చంద్రబాబు.

ప్రస్తుతం కూటమి సర్కార్‌ హయాంలో కొందరు బ్యూరోక్రాట్లు చెలరేగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు ఏం చెబితే అది చేసి పెడుతున్నారు. అధికార పార్టీ దృష్టిల్లో హీరోల్లా…ప్రతిపక్ష నేతల దృష్టిలో విలన్లుగా చలామణి అవుతున్నారు. అందులో చిత్తూరు ఎస్పీగా పని చేసిన సుబ్బరాయుడు…తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా చెలరేగిపోతున్నారు. ఏకంగా మాజీ సీఎం జగన్‌కు కౌంటర్లు ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగా జగన్మోహన్‌రెడ్డి సైతం అధికారంలోకి వచ్చాక సుబ్బరాయుడును వదిలిపెట్టేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. 2014లోనే మాజీ సీఎం జగన్‌…ఇలాగే అప్పటి పోలీసు అధికారులపై రెచ్చిపోయారు. అధికారంలోకి వచ్చాక…చెప్పినట్లే కొందర్ని ముప్పుతిప్పలు పెట్టారు.