Top story:సౌత్ రాష్ట్రాలపై టెర్రరిస్టులు ఫోకస్ చేశారా ? ఐసిస్ మాడ్యూల్స్‌ను ప్రోత్సహించడమే లక్ష్యమా ?
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉగ్రదాడికి అన్ని వేళ్లు పాక్ వైపే చూపిస్తున్నాయి.

పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ – పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉగ్రదాడికి అన్ని వేళ్లు పాక్ వైపే చూపిస్తున్నాయి. పహల్గాం దాడి తర్వాత ఉగ్ర కార్యకలాపాలు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచారాన్ని నిఘా సంస్థలు సేకరిస్తున్నాయి. ఇందులో ఉత్తరాదిలోనే కాదు…దక్షిణాది రాష్ట్రాలకు టెర్రర్ గ్రూపులు విస్తరించినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. సిరియాలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు…దేశంలోకి చొరబడుతున్నట్లు తెలుస్తోంది.
భారత్‌పై పాకిస్తాన్ ఉగ్రసంస్థలను ఎగదోస్తూనే ఉంది. విచ్చిన్న శక్తులను ఇండియాపైకి ప్రయోగిస్తూనే ఉంది. పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా సంస్థలు అనేక వివరాలు సేకరించాయి. ఇప్పటి వరకు ఉత్తరాదిలోనే ఎక్కువ పేలుళ్లకు పాల్పడిన టెర్రరిస్టులు దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. జమ్ముకశ్మీరు మీదుగా భారత్‌లోకి చొరబడిన టెర్రరిస్టుల్లో కొందరు..తమ స్థావరాలను భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. సురక్షితంగా ఉండేందుకు…ఉగ్ర కార్యకలాపాలను విస్తరించేందుకు దక్షిణాది రాష్ట్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సౌత్‌పై టెర్రర్ సంస్థలు ఫోకస్ పెట్టారన్న సమాచారం భద్రతా సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఏటా పెద్దసంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. భారతీయ భద్రతా సంస్థలకు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. భారత్‌లోకి చొరబడుతున్న చాలామంది ఉగ్రవాదులు గతంలో సిరియాలోని ఐసిస్ శిబిరాల్లో ఉగ్రవాద శిక్షణ పొందారు. అరెస్టయిన కొంతమంది విదేశీ ఉగ్రవాదులను విచారించగా, వారు భద్రతా సంస్థలకు ఈవిషయాన్ని చెప్పారు. 2023 నవంబరు నాటికి భారత్‌లో ఉన్న విదేశీ ఉగ్రవాదుల సంఖ్య 71. గత ఏడాదిన్నర వ్యవధిలో జమ్ముకశ్మీర్ మీదుగా 51 మంది విదేశీ ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడినట్లు భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 122కు పెరిగిందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఒకేసారి 122 మంది ఉగ్రవాదులు సరిహద్దు దాటి భారతదేశంలోకి చొరబడ్డారు. వారంతా జమ్మూకశ్మీర్ అంతటా వ్యాపించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి.
దేశంలో వెలుగుచూసిన అనేక ఐసిస్ మాడ్యూల్ కేసులను ఎన్‌ఐఏ విశ్లేషిస్తోంది. ఐసిస్ మాడ్యూల్ టెర్రర్ నుంచి ప్రేరణ పొందిన ఉగ్రవాదులకు…టెర్రరిస్టు సంస్థల నుంచి నిధులు వస్తున్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. విదేశాల నుంచి వచ్చే నిధులతోనే బాంబు పేలుళ్లకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీ-పద్ఘా ఐసిస్ టెర్రర్ మాడ్యూల్ కేసులో…ఐసిస్ కార్యకర్తపై ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీకి చెందిన ఉగ్రవాది రిజ్వాన్ అలీపై ఐపీసీ అండ్ యూఏ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎన్ఐఏ అభియోగాలను మోపింది. ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాల తయారీకి సంబంధించిన డిజిటల్ ఫైళ్లను ఇతర నిందితులతో పంచుకున్నట్లు తేలింది.
మరోవైపు పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ – పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉగ్రదాడికి కారణంగా అన్ని వేళ్లు పాక్ వైపే చూపిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై భారత్ ఆంక్షల పరంపరను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో పాక్ దేశస్థులకు వీసాలను నిలిపివేసినట్లు మోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వచ్చిన కొద్దిసేపటికే పాకిస్థాన్ కూడా భారతీయులకు సార్క్ వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు భారత దౌత్యవేత్తలు, వాణిజ్యంపై కూడా దాయాది దేశం ఆంక్షలు విధించింది.