ఆర్మీకి సెలవులు రద్దు…. నెక్స్ట్ ఇక యుద్దమేనా?
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులుఆందోళన కలిగిస్తున్నాయి. భారత్.. పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడంతో సరిహద్దుల్లో ఏం జరగబోతుంది

జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులుఆందోళన కలిగిస్తున్నాయి. భారత్.. పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడంతో సరిహద్దుల్లో ఏం జరగబోతుంది అనేది ఆసక్తిని రేపుతోంది.. కీలకమైన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రద్దు చేయాలని భారత్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయంగా సైతం భారత్కు మద్దతు పెరుగుతోంది.
దీంతో పాకిస్తాన్ పై యుద్ధానికి భారత్ సిద్ధమైనట్లుగానే సంకేతాలు వస్తున్నాయి. దీనికి తోడు భారత యుద్ధ విమానాలు విన్యాసాలు కూడా మొదలు పెట్టడం ఆసక్తిని రేపుతోంది.. తీర ప్రాంతాల్లో కూడా గస్తీని పెద్ద ఎత్తున పెంచాయి భద్రత బలగాలు. యుద్ధనౌకలను కూడా సముద్ర తీరాల్లో సిద్ధం చేస్తున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్ జలాంతరగామి పాకిస్తాన్ వైపుగా కదిలినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రాఫెల్ యుద్ధ విమానాలను సైతం భారత్ పాక్ సరిహద్దుల్లో మోహరించారు.
అటు పాకిస్తాన్ కూడా తమ సైన్యానికి సెలవులను రద్దు చేసింది. సెలవుల్లో ఉన్న ఉన్నతాధికారులు వెంటనే విధుల్లో చేరాలని పాకిస్తాన్ ఆర్మీ ఆదేశాలు ఇచ్చింది. ఇక తాజాగా భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. సెలవుల్లో ఉన్న పారా మిలిటరీ బలగాలు విధుల్లో చేరాలని.. వ్యక్తిగత కారణాలతో వెళ్లిన వారు కూడా పరిస్థితి తీవ్రత దృష్ట్యా సర్దుబాటు చేసుకుని తిరిగి విధుల్లో చేరాలని తెలిపింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఏ విధంగా రెచ్చగొట్టినా సరే తోక ముడిచే విధంగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.
పాకిస్తాన్ సైన్యంతో పాటుగా ఉగ్రవాదులతో కూడా భారత ఆర్మీ పోరాటం చేయాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో స్థానిక పోలీసుల సహకారం కూడా తీసుకుని.. ఉగ్రవాదులకు సహకరించే వారిని గుర్తించాలని స్పష్టం చేసింది. ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ కు భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చేరుకున్నారు. ఉన్నతాధికారులు అందరూ సమీక్ష సమావేశంలో పాల్గొనాలని ఆయన ఆదేశించారు. ఆర్మీ కమాండర్ లందరూ అందుబాటులో ఉండాలని ఉపేంద్ర తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆర్మీ చీఫ్ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శ్రీనగర్ తో పాటుగా ఉదంపూర్.. బందిపోరా.. పహల్గాం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక శుక్రవారం ఉదయం లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద కాల్పులు జరగగా భారత్ ఆర్మీ అదే రేంజ్ లో బదులిచ్చింది. సింధు నది జలాలను పాకిస్థాన్లోకి వెళ్లకుండా భారత్ అడ్డుకోవడంతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఇరుదేశాలు పంజాబ్ లోని అటారి – వాగా బోర్డర్ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.