జగదేకవీరుడు అతిలోకసుందరి 3D వర్కౌట్ అవుతుందా.. రిస్క్ తీసుకుంటున్నారా..?
చిరంజీవి కెరీర్ లో ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి మాత్రం అత్యంత ప్రత్యేకం. కేవలం మెగాస్టార్ కెరీర్ లో మాత్రమే కాదు..

చిరంజీవి కెరీర్ లో ఎన్ని సినిమాలైనా ఉండొచ్చు కానీ జగదేకవీరుడు అతిలోకసుందరి మాత్రం అత్యంత ప్రత్యేకం. కేవలం మెగాస్టార్ కెరీర్ లో మాత్రమే కాదు.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ మరపురాని మరవలేని చిత్ర రాజం. ఎన్నో ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించింది జగదేకవీరుడు అతిలోకసుందరి. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాను కె.రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. 1990 మే 9న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసింది. చిరంజీవి సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం పెద్ద విశేషం కాదు.. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితులను అన్నిటిని దాటుకొని ఈ సినిమా సృష్టించిన సంచలనం గురించి తరాలు తరాలు చెప్పుకుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్న సమయంలో.. కనీసం జనం అడుగు కూడా బయటకు పెట్టలేని దారుణమైన పరిస్థితుల్లో విడుదలైంది జగదేకవీరుడు అతిలోకసుందరి. ఈ సినిమా కోసం తన ఆస్తులు మొత్తం అమ్మేశాడు నిర్మాత అశ్విని దత్. ఇది గాని ఆడకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరొక శరణ్యం లేదు అని భయం లోకి వెళ్ళిపోయాడు అశ్వినీ దత్.
అలాంటి పరిస్థితుల్లో విడుదలైన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను మోకాళ్ళ లోతు నీళ్లలో కూర్చుని మరీ చూశారు ఆడియన్స్. సినిమా హాల్స్ లోకి నీళ్లు వస్తున్నా కూడా.. చిరంజీవి ప్రభంజనం ముందు వర్షాలు అస్సలు కనిపించలేదు. రోజురోజుకు వసూళ్ళు పెరుగుతూ అప్పుడున్న ఒక రికార్డును కూడా వదిలిపెట్టలేదు జగదేకవీరుడు. చిరంజీవి ఇమేజ్ రెండింతలు చేసింది ఈ సినిమా. జగదేకవీరుడు అతిలోకసుందరి రూపొందడం వెనుక చాల కథలు ఉన్నాయి. అప్పటికి రాఘవేంద్రరావు వరస ఫ్లాపుల్లో ఉన్నాడు.. అలాంటి సమయంలో అశ్వినీదత్ తనకు ఓ సినిమా చేసి పెట్టాలని రాఘవేంద్రరావును అడగడం.. ఆయన ఓకే అనటం జరిగిపోయాయి. కానీ ఆయనకు మామూలు సినిమా కాదు.. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే సినిమా కావాలి అని దర్శకేంద్రుడిని అడిగాడు అశ్వినీదత్. దాని కోసం ముగ్గురు రచయితలు పోటీపడి ఒక అద్భుతమైన కథను సిద్ధం చేశారు. దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఉంగరం చేజార్చుకొని అది హీరో దొరకడం అనే లైన్ సిద్ధం చేశారు.
సోషియో ఫాంటసీలో అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడనటువంటి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్.. భారీ సెట్ లతో జగదేకవీరుడు అతిలోకసుందరి తెరకెక్కించాడు రాఘవేంద్రరావు. అతిలోకసుందరి పాత్రకు శ్రీదేవి ప్రాణం పోసింది. ఇక రాజు పాత్రలో చిరంజీవి ఎప్పటికీ మరిచిపోలేని పర్ఫార్మెన్స్ చేశాడు. తీరా అంతా సిద్ధం అయిపోయి సినిమా విడుదలైన తర్వాత భారీ వర్షాలు ఆంధ్రదేశమంతా కురుస్తున్నాయి. దాంతో పడిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని దర్శక నిర్మాతలు కంగారు పడుతున్న వేళ.. మంచి సినిమా వస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా చూస్తామని తెలుగు ప్రేక్షకులకు మరోసారి భరోసా ఇచ్చారు. దాని ఫలితమే జగదేకవీరుడు అతిలోకసుందరి థియేటర్లలో ఏడాది ప్రయాణం. మెగాస్టార్ చిరంజీవి దెబ్బకు అన్ని రికార్డులు కదిలిపోయాయి. సినిమా వచ్చి 35 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకు అదే క్రేజ్ వుంది. ఈ సినిమాను మే 9న మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అది కూడా 3d లో విడుదల చేయబోతున్నారు. మరి ఈ జనరేషన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బ్రహ్మరథం పడతారెమో చూడాలి.