రన్స్ తక్కువ..ఫైన్స్ ఎక్కువ రిషబ్ పంత్ ఫ్లాప్ షో
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్ గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ తనపై అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. విధ్వంసకర బ్యాటర్ గా పేరున్న పంత్ ప్రస్తుత ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ప్లేయర్ గా రికార్డు సృష్టించిన రిషబ్ పంత్ తనపై అంచనాలను నిలబెట్టుకోలేకపోతున్నాడు. విధ్వంసకర బ్యాటర్ గా పేరున్న పంత్ ప్రస్తుత ఐపీఎల్ లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 8 ఇన్నింగ్స్‌ల్లో రిషబ్ పంత్ 110 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కాలంలో రిషబ్ పంత్ ఒకే ఒక అర్థ సెంచరీ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇంత చెత్త ప్రదర్శనను చూడలేదంటూ నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా? అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మెగా వేలంలో 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ ధరక తగ్గ న్యాయం పంత్ చేయలేకపోతున్నాడు. లక్నో ఓనర్ సంజీవ్ గోయెంకా పంత్ కోసం వెచ్చించిన 27 కోట్లు వృథా అయినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
పంత్ ఇప్పటి వరకూ చేసిన 110 పరుగులు అతనిపై వెచ్చించిన 27 కోట్లను పరిగణలోకి తీసుకుంటే పరుగుకు 24.5 లక్షలు తీసుకున్నట్టు ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. అటు బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గానూ పంత్ విఫలమవుతున్నాడు. కీలక సమయంలో కెప్టెన్సీని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. లక్నో ఓటముల్లో కొన్నింటికి పంత్ పేలవ కెప్టెన్సీనే కారణమన్న అభిప్రాయమూ ఉంది. అసలే పేలవ బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొంటున్న పంత్ కు బీసీసీఐ కూడా షాకిచ్చింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రెండోసారి జరిమానా విధించింది. ముంబైతో మ్యాచ్‌లో లక్నో జట్టు స్లో ఓవర్‌ను నమోదు చేసింది.
నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడంతో ఐపీఎల్ రూల్స్ ప్రకారం కెప్టెన్ రిషబ్ పంత్‌కు 24 లక్షల జరిమానా, ఇంపాక్ట్ ప్లేయర్ సహా ప్లేయింగ్ ఎలెవన్‌లోని మిగిలిన ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 25 శాతం లేదా 6లక్షలు రెండింటిలో ఏదీ తక్కువ అయితే అది ఫైన్‌గా పడింది. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ స్లో ఓవర్ రేటును నమోదు చేయడం ఇది రెండో సారి. తొలిసారి ఈ తప్పిదానికి పంత్‌కు 12 లక్షల జరిమానా పడింది. ముంబై ఇండియన్స్ చేతిలో 54 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ఆడిన పది మ్యాచ్‌లలో ఐదింట్లో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో గెలవాల్సిందే.