బూమ్ బూమ్ బుమ్రా మలింగ రికార్డు గల్లంతు
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనదైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్ లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైన బుమ్రా పూర్తి ఫామ్ అందుకున్నాడు.

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తనదైన కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుత ఐపీఎల్ లో గాయం కారణంగా కొన్ని మ్యాచ్ లకు దూరమైన బుమ్రా పూర్తి ఫామ్ అందుకున్నాడు. గత కొన్ని మ్యాచ్ లలో మంచి ఎకానమీతో బౌలింగ్ చేసిన ఈ స్టార్ పేసర్ లక్నోపై మాత్రం బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ తరహాలో అదరగొట్టేశాడు. నాలుగు వికెట్లతో లక్నోను చావుదెబ్బకొట్టాడు. నిజానికి బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. వరల్డ్ క్రికెట్ లో టాప్ బ్యాటర్లుగా ఉన్న కోహ్లీ, వార్నర్, గేల్ వంటి ఆటగాళ్ళు సైతం దీనిని చాలా సార్లు అంగీకరించారు. తన బౌలింగ్ తో అంతలా ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తుంటాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచులో బుమ్రా అదిరే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
216 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో బ్యాటర్లను ముంబై బౌలర్లు బానే కట్టడి చేశారు. ముఖ్యంగా బుమ్ బుమ్ బుమ్రా ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఈ క్రమంలోనే అయిడెన్ మరక్రమ్ వికెట్ తీసిన బుమ్రా.. అదిరే ఘనత సాధించాడు.ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు బుమ్రా. అలానే దిగ్గజ క్రికెటర్ లసిత్ మలింగ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకుముందు 170 వికెట్లతో మలింగతో సమంగా ఉన్న బుమ్రా.. తాజా మ్యాచులో 171 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. మలింగ 170 వికెట్లను 122 మ్యాచుల్లో19.79 సగటుతో, 7.14 ఎకానమీతో తీశాడు. బుమ్రా 139 మ్యాచుల్లో 7.31 ఎకానమీ రేటు, 9.79 సగటుతో 171 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో ముంబై తరఫున బుమ్రా బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 10 రన్స్ కే 5 వికెట్లు తీశాడు. 2022లో కేకేఆర్ పై ఈ ప్రదర్శన చేశాడు. కానీ ఈ మ్యాచులో ముంబై 52 పరుగులు తేడాతో ఓడింది.
ఇదిలా ఉంటే లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో బుమ్రా అదరగొట్టేశాడు. ఈ ఓవర్‌లో బుమ్రా ఏకంగా ముగ్గురు బ్యాటర్లను అవుట్ చేశాడు. రెండో బంతికి డేవిడ్ మిల్లర్‌ను ఐదో బంతికి అబ్దుల్ సమద్‌ను , చివరి బంతికి ఆవేశ్ ఖాన్ వికెట్ తీశాడు. విశేషమేమిటంటే, బుమ్రా అబ్దుల్ సమద్, ఆవేశ్ ఖాన్‌లను బౌల్డ్ చేశాడు. అతను ఐపీఎల్‌లో ఇప్పటివరకు 41 మంది బ్యాటర్లను బౌల్డ్ చేశాడు. ఈ జాబితాలో అతను రెండో స్థానంలో ఉండగా.. 63 బౌల్డ్‌లతో లసిత్ మలింగ మాత్రమే అతని కంటే ముందున్నాడు. ఇక బుమ్రా తన ఐపీఎల్ కెరీర్‌లో 24వ సారి ఒక మ్యాచ్‌లో 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ జాబితాలో కూడా అతనే అగ్రస్థానంలో ఉన్నాడు.