జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన పురంధేశ్వరి.. మాజీ ఎంపీకి లైన్ క్లియర్
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టడానికి నానా కష్టాలు పడుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకు జగన్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలామంది నేతలు మాత్రం జగన్ నాయకత్వంపై నమ్మకం లేకనో, లేదంటే కూటమి ప్రభుత్వానికి భయపడో .. ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో చాలామంది నాయకులు జగన్ నుంచి దూరం జరుగుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం తమను పట్టించుకోని అధినేతను.. ఇప్పుడు తాము కూడా పట్టించుకునే అవసరం లేదనే భావనలో ఉన్నారు చాలామంది నాయకులు.
ఇందులో విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆర్థికంగా సత్యనారాయణ బానే వెనకేసుకున్నారు. విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయనది మంచి చేయి. రాజ్యసభ ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి సహకారంతో అప్పట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఉత్తరాంధ్ర మొత్తం విస్తరించే ప్రయత్నం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనపై పెద్ద ఎత్తున టిడిపి ఆరోపణలు చేసింది. ఇక ఎంపీగా అయితే ఆయన గెలిచే అవకాశం లేదని జగన్ ఎమ్మెల్యే సీటు ఇచ్చారు.
అయితే వెలగపూడి రామకృష్ణ చేతిలో ఆయన ఘోర ఓటమి పాలయ్యారు. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కావడంతో రాజకీయ భవిష్యత్తు ఉంటుందని నమ్మి ఇప్పుడు తన దారి తాను వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే బిజెపిలో జాయిన్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో బిజెపికి బలమైన నాయకత్వం లేదు. దీనితో ఆ ఖాళీని భర్తీ చేసేందుకు సత్యనారాయణ సిద్ధమవుతున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.
ఉత్తరాంధ్రలో జనసేన కూడా ఈ మధ్యకాలంలో కాస్త బలపడే ప్రయత్నం చేస్తుంది. కానీ బిజెపి నుంచి మాత్రం.. సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీ అధిష్టానం కూడా ఉత్తరాంధ్ర విషయంలో పెద్దగా ఫోకస్ చేయలేకపోతోంది. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు కాబట్టి పార్టీలో చేర్చుకుంటే తమ కూడా ప్రయోజనం ఉంటుందని బిజెపి నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన చేరికను బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో టిడిపి నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. నాయకుడిగా మంచి పేరు ఉన్న సరే ఆయన చేసిన కొన్ని వ్యవహారాలపై విమర్శలు అప్పట్లో టిడిపి నేతలు గట్టిగానే చేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన పార్టీలోకి వస్తే మూడు పార్టీలతో కలిపి పని చేయాలి కాబట్టి టిడిపి ఏ విధంగా సత్యనారాయణ ను రిసీవ్ చేసుకుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ సత్యనారాయణ పార్టీ మారితే ఉత్తరాంధ్రలో వైసీపీకి కచ్చితంగా గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లే.