Spl story: సజ్జలను టార్గెట్ చేసిన పవన్.. ఎన్ని ఎకరాలు మింగేసాడంటే
రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.. అధికారం అనేది అసలు శాశ్వతం కాదు. దశాబ్దాల తరబడి ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు.. అధికారం అనేది అసలు శాశ్వతం కాదు. దశాబ్దాల తరబడి ఉన్న ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నియంతల మాదిరిగా తిరుగులేని రాజ్యాధికారం చలాయించిన నాయకులు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. తమను ఎవరు ఏమీ చేయలేరు అనుకుని విర్రవీగిన నాయకులను ప్రజలు నడ్డి విరిచి మూలను కూర్చోబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వైసిపి ఏపీలో అధికారంలో ఉన్న సమయంలో అప్పట్లో ప్రధానంగా రెచ్చిపోయిన వారిలో ఆ పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరు.
తనను ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నారో ఏమోగానీ ఆయన మాత్రం ఆడిందే ఆట పాడిందే పాటగా రాజ్యాన్ని ఏలారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఉన్నా సరే అధికారులతో, మంత్రులతో సమీక్ష సమావేశాలు నిర్వహించేవారు సజ్జల రామకృష్ణారెడ్డి. అందుకే ఆయనకు అప్పట్లో టిడిపి సకల శాఖ మంత్రిగా నామకరణం కూడా చేసింది. ఒక సలహాదారు పదేపదే మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలను విమర్శించిన సందర్భం అదే. ఇక పార్టీలో నాయకులు కూడా తన మాటే వినే విధంగా ఆయన అప్పట్లో.. రూట్ క్లియర్ చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడానికి బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేశారని కారణంతో జగన్ ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు..
కానీ 2024లో వైసీపీ అధికారం కోల్పోవడానికి ఆయనే కారణమనేది చాలామంది వైసిపి నాయకుల్లో కార్యకర్తల్లో ఉన్నటువంటి భావన.ఇక ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరిస్తారు. సజ్జల.. అవినీతి, అక్రమాలపై అన్ని శాఖల్లో స్పష్టమైన నివేదికలు ఉండటంతో ఆయనకు ఉచ్చు బిగించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్లుగానే కనబడుతున్నారు.
సజ్జల అక్రమాలను సీరియస్ గా తీసుకున్న పవన్ కళ్యాణ్.. అటవీ శాఖ భూములను ఆక్రమించారని ఆరోపణ రావడంతో కడప జిల్లాలో ఆయనపై విచారణ చేయించారు. ఈ విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కడప జిల్లాలో 63 ఎకరాలు సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం కబ్జా చేసిందని.. అందులో 55 ఎకరాల్లో ఏకంగా అడవిని దున్నేసారని.. చదును చేసి వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకున్నారని తేల్చారు . అటవీ భూములో ఉన్న ప్రాంతంలో పొలాలు ఉండటం చూసి రెవిన్యూ శాఖ అధికారులు కూడా కాస్త షాక్ అయ్యారు.
అప్పట్లో సజ్జలకు సహకరించిన అధికారులు.. కీలక నాయకులు అందరి బాగోతాన్ని బయటకు తీసేందుకు పవన్ పక్కాగా సర్వే చేయించినట్లు తెలుస్తోంది. రెవిన్యూ శాఖ కూడా పాల్గొన్న ఈ సర్వేలో.. సజ్జల కుటుంబం 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించినట్లు గుర్తించింది.. వీటిపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ వద్దకు నివేదిక కూడా వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయడం పెద్ద విషయం కాదు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న మాట. ఇప్పటికే సైలెంట్ అయిపోయిన సజ్జల ఈ విషయంలో ఏవిధంగా బయటపడతారో మరి.