Top Story: ఏబీవీ టార్గెట్ లో ఎవరెవరు?

మీరు వదిలేసినా.. నేను వదిలిపెట్టను. మళ్లీ ఆ మనిషి అధికారంలోకి వస్తే పరిస్ధితి ఏంటి? మీకు అర్ధం కావడం లేదో.. నాకు అర్ధం అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 07:30 PMLast Updated on: Apr 21, 2025 | 7:30 PM

Who Is In Abv Target

మీరు వదిలేసినా.. నేను వదిలిపెట్టను. మళ్లీ ఆ మనిషి అధికారంలోకి వస్తే పరిస్ధితి ఏంటి? మీకు అర్ధం కావడం లేదో.. నాకు అర్ధం అవుతుంది. అందుకే నేనే రంగంలోకి దిగుతా.. సంగతి చూస్తా అంటూ మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు ఓపెన్ ఫైట్ లోకి దిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలపై పోరాడతానని.. దాని కోసం తాను రాజకీయాల్లోకి దిగుతున్నానని ప్రకటించారు. ఆయన టీడీపీ మనిషి అనే ప్రచారం ఫుల్లుగా ఉంది.. ఆయనే వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగే పని చేశాడని.. అందుకే జగన్ పగబట్టాడని అంటారు. అందుకే ఎక్కువమంది రెస్పాండ కాలేదు ఏబీవీ ప్రకటనపై. కాని రోజురోజుకు ఏబీవీ యాక్షన్ ప్లాన్ చూస్తుంటే.. వ్యవహారం సీరియస్ గానే ఉంది. లోకేష్ అసైన్ మెంట్ ఇఛ్చి రంగంలోకి దింపారా.. లేక ఏబీవీ సొంత ప్లానా అనే డిస్కషన్ నడుస్తోంది. ఎందుకంటే చంద్రబాబు నిర్ణయాలు, వ్యూహాలు చాలా సైలెంటుగా ఉంటాయి. కాని ఆ సైలెన్స్ ను లోకేష్ భరించలేకపోతున్నారనేది టాక్. అందుకే జగన్ హయాంలో జరిగిన వ్యవహారాలపై కేస్ టు కేస్ అంతు తేల్చాలంటే ఏవీబీ లాంటోడు ఉండాలని అనుకున్నారా? లేక వెంకటేశ్వరరావుగారే చూస్తూ చూస్తూ ఊరుకోలేక దిగిపోయారా? అనేది తేలాల్సి ఉంది.

ఇక ఆయన ముందు కోడికత్తి కేసు పట్టుకున్నారు. నిందితుడు శ్రీనును కలిశారు. న్యాయం అందించే బాధ్యత తనదే అన్నారు. ఇప్పుడు లేటెస్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు మర్డర్ చేసిన డ్రైవర్ సుబ్రమణ్యం ఫ్యామిలీని కలిసి.. వారిని తీసుకుని కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్లారు. కలెక్టర్ కు కేసంతా ఎక్స్ ప్లెయిన్ చేశారు. అంటే కోర్టులు డేట్లు మార్చినా.. పోలీసులు పట్టించుకోకపోయినా.. ప్రభుత్వం ఆరా తీయకపోయినా.. ఇలాంటి అరాచాక కేసులన్నిటి సంగతి తాను చూస్తానని ఏబీ వెంకటేశ్వరరావు చెప్పకనే చెప్పినట్లయింది. ఇది కొంచెం వైసీపీ నేతలకు టెన్షన్ విషయమే. ఎందుకంటే ఏవీబీకి చట్టం, న్యాయం, సెక్షన్లు అన్నీ తెలుసు. పైగా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన అనుభవంలో ఎవరు ఏంటో.. ఎవరి లూప్ హోల్స్ ఏంటో అన్నీ ఆన్ ఫింగర్స్ ఉంటాయి. అందుకే బాస్ దిగాడంటే.. మామూలుగా ఉండదు.. అదే ఇప్పుడు వైసీపీ వాళ్లకు టెన్షన్.

ఇంకెలాంటి కేసులు ఏబీ వెంకటేశ్వరరావు టేకప్ చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పల్నాడులో ఓ లాలుడిని సజీవదహనం చేసిన కేసు అలాగే ఉంది. ఇక డాక్టర్ సుధాకర్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టారో.. చివరకు ఆయన మరణానికి ఎలా కారణమయ్యారో అందరికీ తెలిసిన వ్యవహారమే. రాజమండ్రిలో ఆవ భూముల వ్యవహారం పెద్ద కేసు. రాజమండ్రిలోనే అమరావతి రైతులపై జరిగిన దాడి కేసు మరోటి. అమరావతి రైతులను తప్పుడు కేసులపై అరెస్ట్ చేసి సంకెళ్లు వేసిమరీ తీసుకెళ్లిన వ్యవహారం ఉంది. వైజాగ్ లో భూముల వ్యవహారాలు చాలా ఉన్నాయి. విజయసాయిరెడ్డిపై ఆరోపణలు కొన్ని, అలాగే మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నడిపించిన వ్యవహారం కూడా ఉంది. రుషికొండ నిర్మాణం ఎటూ ఉంది. అసలు లిస్టు రాసుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. మరి ఏబీ వెంకటేశ్వరరావు ఏ రేంజులో యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారో.. ఎన్ని కేసులు టచ్ చేస్తారో.. ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తారోనని ఇఫ్పుడు టీడీపీ, జనసేన శ్రేణులు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నాయి.

ఎటూ ఏబీ వెంకటేశ్వరరావు గత ఐదేళ్లలో డ్యూటీ చేయడం కుదరలేదు. చేద్దామనుకున్నా జగన్ చేయనివ్వలేదు. ఇప్పుడు ఆ సర్వీస్ పీరియడ్ అంతా ఈ రూపంలో తీర్చేసుకుని.. జగన్ అండ్ కో కు ఇచ్చిపడేస్తారేమో అనే డైలాగ్స్ వినపడుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అప్పట్లో జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన కొందరు జర్నలిస్టులు ఏబీ వెంకటేశ్వరరావుపై ఓ రేంజులో అటాక్ చేశారు తమ స్టోరీలతో. వాళ్లు కూడా టార్గెట్ లో ఉన్నారో లేదో మరి చూడాలి.