పంత్ కు ప్రమోషన్ ఇషాన్, శ్రేయాస్ రీఎంట్రీ

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదలైంది. ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. పలువురు యువ ఆటగాళ్ళు సైతం కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 21, 2025 | 08:00 PMLast Updated on: Apr 21, 2025 | 8:00 PM

Pant Gets Promotion Ishan Shreyas Re Enters

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదలైంది. ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. పలువురు యువ ఆటగాళ్ళు సైతం కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. దీనిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ కూడా ఉన్నారు. ఈ సారి 34 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టుల్లో చోటు దక్కగా..టీమిండియా లెజెండ్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మూడు ఫార్మాట్లలో ఆడకపోయినప్పటికీ వారిని గౌరవిస్తూ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో వారి పేర్లను జోడించారు. ఏ+, ఏ, బీ, సీ ఇలా నాలుగు గ్రేడ్‌లుగా టీమిండియా ప్లేయర్లను విభజించి ఈ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేర్చారు.

బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కేవలం నలుగురు మాత్రమే ఏ+ గ్రేడ్‌లో ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజాలను బీసీసీఐ ఈ ఏ + గ్రేడ్‌లో ఉంచింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఏ ప్లస్ గ్రేడ్ రిటైన్ చేసుకున్నారు. కోహ్లీ, రోహిత్, జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికినా.. వారికి ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. రెగ్యూలర్‌గా మూడు ఫార్మాట్లు ఆడే ఆటగాళ్లకు మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో అశ్విన్‌ ను పరిగణలోకి తీసుకోలేదు.

గత సంవత్సరం బీసీసీఐ ఆగ్రహానికి గురై కాంట్రాక్ట్‌ను కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌కు మళ్లీ చోటు దక్కింది.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్‌కు గ్రేడ్ బీ కాంట్రాక్ట్ దక్కగా.. ఇషాన్ కిషన్‌కు గ్రేడ్ సీ కాంట్రాక్ట్ లభించింది. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి గ్రేడ్ సీ కాంట్రాక్ట్ వరించింది. టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌ తన గ్రేడ్ ఏ కాంట్రాక్ట్‌ను నిలబెట్టుకున్నాడు. మహమ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభమన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ షమీ, రిషబ్ పంత్‌ గ్రేడ్ ఏలో ఉన్నారు. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు గ్రేడ్ బీ బీసీసీఐ చోటు కల్పించింది. గ్రేడ్ బీలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.

యువ క్రికెటర్లకు ఎక్కువగా గ్రేడ్ సి జాబితాలోనే చోటు దక్కింది. టీ20ల్లో కీలకంగా మారిన వారిని ఎక్కువగా ఎంపిక చేసింది. రింకు సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్‌ గైక్వాడ్, శివమ్‌ దూబె, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేశ్‌ కుమార్, సంజుశాంసన్, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్‌ ఖాన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్‌ దీప్‌, వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణాకు అవకాశం లభించింది. తెలుగు తేజం కేఎస్ భరత్, జితేశ్ శర్మ కాంట్రాక్ట్‌ల్లో చోటు కోల్పోయారు. నిర్దేశిత సమయంలో మూడు టెస్ట్‌లు లేదా 8 వన్డేలు లేదా 10 టీ20లు ఆడిన ఆటగాళ్లకు అటోమెటిక్‌గా గ్రేడ్ సీ కాంట్రాక్ట్ దక్కుతుందని గతేడాది బీసీసీఐ ప్రకటించింది.గ్రేడ్ ఏ ప్లస్ ఆటగాళ్ల 7 కోట్ల వార్షిక వేతనం అందనుండగా.. గ్రేడ్ ఏ ఆటగాళ్లకు 5 కోట్లు, గ్రేడ్ బీ ప్లేయర్లకు 3 కోట్లు, గ్రేడ్ సీ ఆటగాళ్లకు కోటి రూపాయలు ఇస్తారు. ఈ వార్షిక వేతనం మ్యాచ్ ఫీజులు, అలవెన్స్‌లకు అదనంగా ఉంటుంది.