ఇదీ పాకిస్తాన్ చెత్త చరిత్ర.. దెబ్బలు తిని మళ్లీ యుద్ధమా…
పహల్‌గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయ్. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయ్.

పహల్‌గామ్ ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయ్. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించడంతో.. ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయ్. సింధు జలాల నుంచి చుక్క నీరు కూడా పాక్ భూభాగానికి వెళ్లకూడదని.. మోదీ సర్కార్ నిర్ణయించింది. పాక్ కూడా భారత్‌పై కవ్వింపు చర్యలకు దిగుతోంది. పాక్ ఆర్మీ చీఫ్‌తో పాటు.. ప్రధాని కూడా కశ్మీర్ జీవనాడి అంటూ.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం మొదలయ్యే పరిస్థితి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. కావాలని రెచ్చగొడుతున్న పాక్‌ను నెటిజన్లు ఆడుకుంటున్నారు. గతంలో తగిలిన దెబ్బలకు బొప్పి కట్టి.. ఇంకా తగ్గనే లేదు.. అప్పుడే మళ్లీ తోక జాడిస్తారా.. ఇంత ఓవరాక్షన్ అవసరమా అంటూ.. పాకిస్తాన్‌కు సూచిస్తున్నారు. 1947 నుంచి భారత్, పాక్ మధ్య మధ్య నాలుగు సార్లు యుద్ధాలు జరిగాయ్. 1947, 48 మధ్య మొదటి యుద్ధం జరిగింది.
స్వాతంత్ర్య రాగానే.. కశ్మీర్ ప్రాంతం కోసం రెండు దేశాలు తలపడ్డాయ్. ఈ యుద్ధం 1947 అక్టోబర్ 21 నుంచి 1948 డిసెంబర్ 31 వరకు జరిగింది. ఐక్యరాజ్యసమితి కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చింది. రెండో యుద్ధం 1965లో జరిగింది.. కాశ్మీర్‌లోకి పాక్ చొరబడటానికి ప్రయత్నించింది. ఆ సమయంలో పాక్ దళాలు భారత్ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించి తిరుగుబాటును ప్రేరేపించడానికి ప్రయత్నించాయ్. దీంతో భారతదేశం పశ్చిమ పాకిస్థాన్‌పై పూర్తిస్థాయి సైనిక చర్యను ప్రారంభించింది. 17రోజుల పాటు యుద్ధం జరిగింది. సోవియట్ యూనియన్, అమెరికా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో కాల్పుల విరమణ ప్రకటించారు. పాకిస్థాన్ తిరుగుబాటుతో కారణమైన ఈ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించింది. ఇక మూడోది.. 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్, పాక్ తలపడ్డాయ్. 13రోజుల్లో ముగిసిన ఆ యుద్ధంలో… భారత సైన్యం సాధించిన విజయాన్ని… 93వేల మంది పాకిస్థానీ సైనికులు భారత ఆర్మీ ముందు మోకరిల్లిన విధానాన్ని ఇప్పటికీ ప్రపంచం గుర్తుచేసుకుంటుంది. 1971 డిసెంబర్ 3న మనదేశంలోని వైమానిక స్థావరాలపై.. పాకిస్తాన్ ఆకస్మిక వైమానిక దాడులు చేసింది. దీంతో పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించింది.
తూర్పు, పశ్చిమ సరిహద్దులలో ఏకకాలంలో భారత సైన్యం దాడికి దిగింది. భారత నావికాదళం కరాచీ నౌకాశ్రయంపై మెరుపుదాడి చేసి.. భారీ నష్టాన్ని కలిగించింది. ఆ తర్వాత దూకుడు చూపించిన ఇండియన్ ఆర్మీ.. 1971 డిసెంబర్ 16న ఢాకాను స్వాధీనం చేసుకున్నాయ్. ఆ సమయంలో భారత సైన్యం దాదాపు 15వేల చదరపు కిలోమీటర్ల వరకు పాకిస్థాన్ భూభాగాన్ని ఆక్రమించింది. ఐతే సిమ్లా ఒప్పందంలో భాగంగా ఆ భూమిని పాకిస్తాన్‌కు తిరిగి ఇచ్చింది. ఇక 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. పాకిస్థాన్ దళాలు కార్గిల్ జిల్లాలో భారత భూభాగంలోకి చొరబడ్డాయ్. సైనిక చర్యతోపాటు.. పాకిస్థాన్‌ను దౌత్యపరంగా కూడా భారత్ ఎదుర్కొంది. చొరబాటు జరిగిన రెండు నెలల్లోనే వారు ఆక్రమించిన భూభాగాన్ని తిరిగి భారత్ సైన్యం స్వాధీనం చేసుకుంది. అమెరికా సహా అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచడంలో భారత్ సక్సెస్ అయింది. ఈ యుద్ధంలో పాకిస్థాన్ 4వేల మంది సైనికులను కోల్పోయింది. ఇలా ఏ యుద్ధంలోనూ భారత్ వెంట్రుక కూడా పీకలేకపోయిన పాక్.. ఇప్పుడు మళ్లీ యుద్దోన్మాతంతో రగిలిపోతోంది. మింగడానికి మెతుకు లేని పాక్‌కు.. ఇంత అవసరమా అంటూ నెటిజన్లు ఆటాడేసుకుంటున్నారు.