Top story:హఫీజ్ కోసం రంగంలోకి అజ్ఞాత వ్యక్తులు, నరరూప రాక్షసుడి అంతం దగ్గర్లోనే ఉందా?
హఫీజ్ సయీద్.. లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై మారణహోమం వెనుక మాస్టర్ మైండ్. పహల్గామ్ రక్తపాతం వెనుకకూడా అసలు సూత్రధారి ఈ రాక్షసుడే అని తేలింది.

హఫీజ్ సయీద్.. లష్కరే తోయిబా చీఫ్, 26/11 ముంబై మారణహోమం వెనుక మాస్టర్ మైండ్. పహల్గామ్ రక్తపాతం వెనుకకూడా అసలు సూత్రధారి ఈ రాక్షసుడే అని తేలింది. దీంతో ఈనరరూప రాక్షసుడి ఆట కట్టించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రధాని మోడీ సైతం ఉగ్రవాదులను గుర్తించి, ఎక్కడున్నారో తెలుసుకుని శిక్షించి తీరతానని హెచ్చరించారు. పహల్గామ్ బాధితులకి న్యాయం జరగాలన్నా, 140కోట్ల మంది భారతీయుల ఆగ్రహం చల్లారాలన్నా వాడి కథ ముగించాల్సిందే. కానీ, హఫీజ్ సయీద్ ఇస్లామాబాద్‌లో ISI నీడలో కట్టుదిట్టమైన భద్రత మధ్య చాలా సేఫ్‌గా ఉన్నాడు. ISI భద్రతా వలయాన్ని దాటుకుని వెళితే తప్ప నరరూప రాక్షసుడిని అంతం చేయడం కుదరదు. ఇద్దరు తలచుకుంటే మాత్రం హఫీజ్ కథ ముగిసిపోతుంది. ఇంతకూ, పహల్గామ్ ఉగ్రదాడి వెనుక లష్కర్ చీఫ్ పాత్ర ఏంటి? ISI నీడలో ఉన్న నరరూప రాక్షసుడిని ఎలా వేటాడబోతున్నారు? టాప్ స్టోరీలో చూద్దాం..
జస్ట్ 15 సెకన్ల మోడీ ప్రకటనలో చాలా లోతైన అర్ధముంది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి, ట్రాక్ చేసి, శిక్షిస్తామన్నారు. ఇక్కడ ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్.. అంటే టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా వేటాడతామనేది మోడీ మాట. ఈ మాటల్ని డీకోడ్ చేస్తే పాకిస్తాన్‌లో ఉగ్ర వేట మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఆ మాటకొస్తే గడిచిన మూడేళ్లుగా పాక్‌లో అదే జరుగుతోంది. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు దారుణంగా వేటాడుతున్నారు. సింపుల్‌గా టూ వీలర్‌పై వచ్చి బుల్లెట్లు దించి టార్గెట్‌ను ఫినిష్ చేసి వెళ్లిపోవడం వాళ్ల స్టైల్. ఈ పని ఎవరు చేస్తున్నారో అర్ధంకాక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నాయి. ఇదంతా సరే.. మరి ఇప్పుడు వేటాడబోతోంది ఎవరిని? ఇంకెవరు.. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీ ద్. ఈ నరరూప రాక్షసుడిని అంతం చేస్తేనే పహల్గామ్ బాధితులకు న్యాయం జరిగేది. ఎందుకంటే ఈ మారణకాండ వెనుక ఉన్నది ఈ రాక్షసుడే.
పహల్గామ్‌లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని అష్కర్ అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించుకుంది. కానీ దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా.. చేయించింది మాత్రం లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమాని స్తున్నాయి. అతడే ఈ దాడికి కర్త, కర్మ, క్రియ అని విశ్వసిస్తున్నాయి. అందుకు కొన్ని బలమైన కారణా లున్నాయి. ఈ తరహా దాడులకి తెగబడ్డ తర్వాత లష్కరే ముష్కరులు అడవుల్లోకి పరారవుతుంటారు. పాక్‌లోని తమ పైస్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంతవరకూ వాటిలోనే దాక్కుంటుంటారు. గతేడాది సోనామార్గ్, బూటాపథ్రి, గండేర్బల్‌లో ఉగ్రదాడుల తర్వాత అలాగే చేశారు. తాజా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాతా ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారు. కాబట్టి వారి దాడి ప్రణాళిక వెనుక హఫీజ్ సయీద్ ఉండొచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఈ తరహా దాడులకు తెగబడేవారికి హఫీజ్, లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లాల నుంచి ఆదేశాలు అందుతుంటాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్‌లో స్థానికులను లష్కరే వాడుకుంటుంటుంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తుంటుంది. పాక్‌లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి.. వారిని కశ్మీర్‌లోని పలు ప్రాంతాలకు పంపుతుంటుంది. వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి, ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతుంది. దాదాపుగా నిరుడు లష్కరే చేయించిన ప్రతి దాడిలోనూ ఎక్కువ మంది పాకిస్తానీలు, కొంతమంది కశ్మీరీ యువత భాగస్వాములుగా ఉంది. పహల్గామ్ దాడిలోనే అదే జరిగింది. అన్నింటికీమించి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కూడా లష్కరే అనుబంధ సంస్థే. మరోవైపు.. సోనామార్గ్, బూటా పథ్రి, గండేర్బల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పహల్గామ్‌లో లష్కరే దాడి చేయించి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. 2024 అక్టోబరులో సోనామార్గ్‌లో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న ఆరుగురు కార్మికుల తోపాటు ఒక వైద్యుడిని ఉగ్రవాదులు చంపారు. ఆ దాడికి తెగబడిన ముష్కరుల్లో ఒకడైన హాషిం మూసా పహల్గాం దాడిలోనూ భాగస్వామిగా ఉన్నట్లు అనుమానాలున్నాయి. సో.. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కథ మొత్తం నడిపించింది హఫీజ్ సయీదే అనడానికి ఇంతకంటే ఆధారాలు అవసరంలేదు. కాబట్టి ఈ నరరూప రాక్షసుడి కథ ముగిస్తేనే ప్రతీకారం తీర్చుకున్నట్టు. కానీ, ఈ రాక్షసుడు ఐఎస్ఐ నీడలో భద్రంగా ఉన్నాడు.
నిజానికి.. మార్చి నెలలోనే అజ్ఞాత వ్యక్తులు హఫీజ్ సయీద్‌కు స్పాట్ పెట్టారు. మార్చి 15వ తేదీ సాయంత్రం పాకిస్తాన్ ఆర్మీ కార్ప్స్ కమాండర్‌ను కలవడానికి హఫీజ్ సయీద్ వెళ్లాడు. జీలంలో కార్ప్స్ కమాండ్ మంగ్లాతో సమావేశమైన అనంతరం తిరిగి వస్తోండగా మార్గ మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు అతని కారుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో హఫీజ్‌తో పాటు ప్రయాణిస్తున్న అతని మూనల్లుడు అబు ఖతల్ తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న వారిద్దరినీ రావల్పిండిలోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ మృతిచెందారని వార్తలు వైరల్ అయ్యాయి. కాసేపటికే సయీద్ ప్రాణాలతోనే ఉన్నాడనీ, అబు ఖతల్ మాత్రం మరణించినట్టు కథనాలు చెప్పాయి. మార్చి 15న జరిగిన వేటలో సయీద్ ఎలాగో ఎస్కేప్ అయ్యాడు. ఇది జరిగి రెండు నెలలు పూర్తికాకముందే పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది.
హఫీజ్ సయీద్‌తో భారత్ తేల్చుకోవాల్సిన లెక్కలు పహల్గామ్ ఉగ్రదాడి ఒక్కటే కాదు. ఇంకా చాలానే ఉన్నాయి. వాటిలో 26/11 ముంబై మారణహోమం కూడా ఉంది. ఇటీవలే ఆ దాడికి సంబంధించి మాస్టర్‌మైండ్‌గాఉన్న తహవూర్ రాణాను అమెరికా నుంచి భారత్‌కు రప్పించారు. అతడి విచారణ కొనసాగుతుండగానే పహల్గామ్ ఘటన జరిగింది. ఇవన్నీ చూస్తుంటే హఫీజ్ సయీద్ ఒక్కడే అనేక దారుణాల వెనుక మాస్టర్‌మైండ్‌గా కనిపిస్తున్నాడు. ఈ రాక్షసుడి కథ ముగిస్తే చాలా వరకూ భారత్‌కు పట్టిన పీడ విరగడవుతుంది. మోడీ చెప్పిన దాని ప్రకారం పాకిస్తాన్‌లో ఉగ్రవేట మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అజ్ఞాత వ్యక్తులు మళ్లీ యాక్షన్‌లోకి దిగాల్సిన సమయం కూడా ఇదే. ప్రధాని మోడీ చెప్పిన ఐడెంటిఫై, ట్రాక్ అండ్ పనిష్.. మాటల వెనుక మర్మం అదే అయితే కనుక హఫీస్ సయీద్ అనే నరరూప రాక్షసుడి కథ ముగియడానికి ఎంతో సమయం లేనట్టే. ఐఎస్ఐ నీడలో ఉన్నా పాక్ ఆర్మీ రక్షణలో ఉన్నా.. ఆఖరికి అంతరిక్షంలో దాక్కొన్నా దారుణంగా చావడం ఖాయం.