Spl Story:సింధూ నదిని ఆపితే సరిహద్దుల్లో జల ప్రళయమేనా..?
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనబడుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తున్నాయి.

జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం కనబడుతోంది. ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న నిర్ణయాలు పాకిస్తాన్ కు చెమటలు పట్టిస్తున్నాయి. అందులో ప్రధానంగా సింధు నది జలాలను పాకిస్థాన్ వెళ్లకుండా అడ్డుకుంటామని, ఒప్పందాన్ని రద్దు చేస్తామని భారత్ ప్రకటన చేస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం చేసిన ఆ ప్రకటన నిజంగా అమలు సాధ్యమేనా..? అంటే భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి.
1960లో సింధూ నది జలాలపై పాకిస్తాన్ తో ఒప్పందం జరిగిన సమయంలో.. 20% జలాలను భారత్ వాడుకునే విధంగా.. మరో 80% పాకిస్తాన్ వాడుకునే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఒప్పందాన్ని పలుమార్లు పున సమీక్షించే దిశగా అడుగులు వేశారు. కానీ కొన్ని కీలక కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. సింధు నది జలాల కారణంగా భారత్ కంటే పాకిస్థాన్ కు ఎక్కువగా ప్రయోజనం. పాకిస్థాన్లో 80 శాతం వ్యవసాయం సింధూ నది పరివాహక ప్రాంతంలోనే పండుతోంది. జల విద్యుత్ ప్రాజెక్టులు కూడా సింధు నదిపైనే ఎక్కువగా ఉన్నాయి.
ఒకవేళ భారత్ గనుక నదీ జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్ మరింత సంక్షోభంలో కూరుకుపోతుంది. ఇప్పటికే ఆ దేశ విద్యుత్ ఉత్పత్తికి జల వనరులు సరిపడక భారీగా బొగ్గు దిగుమతి చేసుకుంటుంది. ఆ దేశంలో బొగ్గు నిల్వలు లేకపోవడంతో విదేశాలనుంచి బొగ్గు రవాణా జరుగుతోంది. అక్కడి వరకు బాగానే ఉన్నా.. భారత్ గనుక సింధూ నది జలాలను అడ్డుకుంటే పాకిస్తాన్ కంటే భారత్ లోనే ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుందనేది నిపుణులు చెప్పే మాట. వాస్తవానికి 20 శాతం భారత్ కు కేటాయింపులు జరిగినా.. ఆ 20 శాతం నీటిని వాడుకునే సదుపాయాలు భారత్ లో లేవు.
2016లో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక దాడి తర్వాత.. సింధు నదితో పాటుగా మరో ఐదు నదులపై ఆనకట్టలు, రిజర్వాయర్లు కట్టేందుకు భారత ప్రభుత్వం ఆసక్తి చూపించింది. కానీ హిమాలయాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితులు కారణంగా.. అక్కడి స్థానికుల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల కారణంగా.. ప్రాజెక్టుల నిర్మాణాలు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. దానికి తోడు జూన్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఉండే వర్షాకాలంలో పెద్ద ఎత్తున ప్రవాహాలు ఉంటాయి. దానికి తోడు హిమాలయాల్లో కరిగిన మంచు కూడా ఎక్కువగా సింధు నదిలో కలుస్తుంది.
చిన్నచిన్న జలపాతాలు కూడా వచ్చే సింధు నదిలోనే కలుస్తాయి. దానికి తోడు హిమాలయాల్లో ఉండే పెద్ద ఎత్తున బురద కూడా వచ్చి నదిలోనే కలవడంతో దిగువ ప్రాంతానికి నీటితో పాటుగా భారీగా బురద కూడా వెళుతుంది. ఒకవేళ భారత్ ఒప్పందాన్ని రద్దు చేసి నిజంగా నీటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం.. ప్రస్తుతం ఉన్న డ్యాములకు పాకిస్తాన్ సరిహద్దులు దూరంగా ఉన్నాయి కాబట్టి భారత్ లో ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కుండపోత వర్షాలు కురిసిన సమయంలో నీటిని భారీగా దిగువకు విడుదల చేస్తే.. పాకిస్తాన్ కంటే భారత్లో ఎక్కువగా ప్రజలు ప్రభావితమయ్యే అవకాశాలుంటాయి. మరి ఈ విషయంలో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.