చెన్నైపై విజయంతో మళ్ళీ జోష్, సన్ రైజర్స్ కు ప్లే ఆఫ్ ఛాన్సుందా ?
ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. అంచనాలకు మించిన రిజల్ట్ వస్తున్నాయి. అయితే గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ కథ మాత్రం ఈ సారి రివర్స్ అయింది.

ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతోంది. అంచనాలకు మించిన రిజల్ట్ వస్తున్నాయి. అయితే గత సీజన్ రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ కథ మాత్రం ఈ సారి రివర్స్ అయింది. 2024లో ధనాధన్ బ్యాటింగ్ తో రికార్డులు తిరగరాసిన సన్ రైజర్స్.. ఈ సీజన్ లో అదే బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో బొక్కబోర్లా పడింది. ఈ సీజన్ లో ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరేందుకు అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ ల్లో 3 గెలిచింది. ఆరు మ్యాచ్ ల్లో ఓడింది. సీఎస్కేపై విజయంతో ఆ టీమ్ ఖాతాలో పాయింట్లు ఆరుకు చేరాయి. కేకేఆర్ కూడా ఆరు పాయింట్లతోనే ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ లో వెనుకబడ్డ సన్ రైజర్స్ టేబుల్ లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరే ఆశలు నిలవాలంటే ముందుగా ఆ టీమ్ ఆడబోయే 5 మ్యాచ్ లూ గెలిస్తే పాయింట్లు 16 అవుతాయి. అప్పుడు కూడా నెట్ రన్ రేట్ కీలకంగా మారే అవకాశముంది. టీమ్స్ కనీసం 14 పాయింట్లు సాధిస్తే ముందంజ వేసే అవకాశముంటుంది. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ ఆరేసి విజయాలతో 12 పాయింట్లతో టాప్-3లో ఉన్నాయి. ఈ టీమ్స్ ప్లేఆఫ్స్ చేరడం దాదాపు ఖాయమే.ఇక ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్ల చొప్పున సాధించాయి. ఈ మూడు జట్ల మధ్య ఓ ప్లేఆఫ్స్ చోటు కోసం పోరు రసవత్తరంగా సాగే అవకాశముంది.
బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో సాగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలు సాధిస్తుందన్న అంచనాలు లేవు. ఒకవేళ అద్భుతం చేసినా నెట్ రన్ రేట్ లో వెనుకబడే అవకాశం ఉంది. ఇలా ఏ రకంగా చూసినా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ చేరేందుకు ఛాన్స్ లు గొప్పగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఈ సీజన్ లో ఆ టీమ్ జర్నీ లీగ్ దశలోనే ముగుస్తుందని చెప్పొచ్చు.