అమెరికా పవర్‌ఫుల్ ఆయుధాలు రెడీ…చేతులు కలిపిన తాలిబన్లు, బలూచీలు పాకిస్తాన్‌ను అల్లా కూడా కాపాడలేడు…!

ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత తాలిబన్ల కంటే ఎక్కువ సంబరపడింది పాకిస్తానే. తమ మద్దతుతోనే కాబూల్‌లో తాలిబన్ జెండా ఎరిగిందనీ, ఇక తాలిబన్లు భారత్‌పై ఫోకస్ చేస్తారంటూ భారత్‌నే బెదిరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 05:30 PMLast Updated on: Apr 16, 2025 | 5:30 PM

America Has Powerful Weapons Ready Taliban And Baloch Join Hands Even Allah Cannot Save Pakistan

ఆఫ్ఘాన్‌లో ప్రజా ప్రభుత్వం కూలిన తర్వాత తాలిబన్ల కంటే ఎక్కువ సంబరపడింది పాకిస్తానే. తమ మద్దతుతోనే కాబూల్‌లో తాలిబన్ జెండా ఎరిగిందనీ, ఇక తాలిబన్లు భారత్‌పై ఫోకస్ చేస్తారంటూ భారత్‌నే బెదిరించింది. కానీ, అదే తాలిబన్లు ఇప్పుడు పాకిస్తాన్‌పైనే గురి పెట్టారు. వేర్పాటువాదులకు అండగా నిలుస్తూ పాకిస్తాన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. 2021లో అమెరికా వదిలి వెళ్లిన పవర్‌ ఫుల్ వెపన్స్‌ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఇచ్చారు. ఈ షాకింగ్ నిజాన్ని వాషింగ్టన్ పోస్టు బయట పెట్టింది. ఇక్కడే పాకిస్తాన్ పాలకుల వెన్నులో వణుకు మొదలైంది. ఎందుకంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా వదిలిపెట్టింది సాధారణమైన ఆయుధాలు కావు.. వాటితో దాడికి దిగితే పాకిస్తాన్ చేయగలిగేది కూడా ఏదీ ఉండదు. ఇంతకూ, ఆఫ్ఘాన్ తాలిబన్లు అమెరికా ఆయుధాలని BLAకు ఎందుకిచ్చారు? ఆ ఆయుధాలతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏం చేయబోతోంది? టాప్ స్టోరీలో చూద్దాం..

బలూచ్ లిబరేషన్ ఆర్మీ.. పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న వన్ అండ్ ఓన్లీ నేమ్ ఇదే. దశాబ్దాలుగా ఇస్లామాబాద్‌ నుంచి తమ ప్రాంతానికి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న గ్రూప్ ఇది. ఆ పోరాటంలో ఇటీవల దూకుడు పెంచింది. ఆ దూకుడే పాక్‌కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గత నెలలో ఏకంగా రైలునే హైజాక్ చేయడం పాకిస్తాన్‌లో ప్రకంపనలు పుట్టించింది. ఆ తర్వాతా బీఎల్ఏ దూకుడు ఆపలేదు. పాకిస్తాన్ సైన్యమే లక్ష్యంగా దాడులు చేస్తూ వందల మంది సైనికుల్ని అంతం చేస్తోంది. తాజాగా మరోసారి భద్రతా బలగాలను తీసుకెళుతున్న వాహనమే లక్ష్యంగా దాడి జరిగింది. ఈ ఘటనలో భారీగా భద్రతాధికారులు మరణించగా.. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని మస్టంగ్‌ ప్రాంతంలో భద్రతా సిబ్బంది వాహనంపై తొలిసారి దాడి జరిగిందని ప్రభుత్వ ప్రతినిధి షహిద్‌ వెల్లడించారు. దీనిలో ది బలూచిస్తాన్‌ కానిస్టేబుళ్ల బృందం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ బృందం కలాత్‌ నుంచి తిరిగి వస్తుండగా వేర్పాటువాదులు గురి పెట్టినట్లు వెల్లడించారు. ఈ దాడికి ఐఈడీని వాడినట్లు అనుమానిస్తున్నారు. కానీ, ఒక వేర్పాటువాద గ్రూపు దగ్గర ఇన్ని ఆయుధాలు ఎలా ఉన్నాయి? ఒక దేశ సైన్యాన్నే ఉక్కిరి బిక్కిరి చేసేంత శక్తి BLAకు ఎలా వచ్చింది? ఈ ప్రశ్నకే అమెరికన్ మీడియా వాషింగ్టన్ పోస్టు సమాధానమిచ్చింది. ఆ సమాధానమే పాక్ వెన్నులో వణుకు పుట్టిస్తోందిప్పుడు.

బలూచ్ లిబరేషన్ ఆర్మీ దగ్గర అమెరికన్ పవర్‌ఫుల్ వెపన్స్ ఉన్నాయి. ఆ ఆయుధాలతోనే గత నెలలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. అంతేకాదు, పాకిస్తాన్ సైన్యంపై పదే పదే చేస్తున్న దాడులకు అగ్రరాజ్యం ఆయుధాలనే వాడుతున్నారు BLA ఫైటర్లు. ది వాషింగ్టన్ పోస్టు నివేదికలో తెలిపిన షాకింగ్ నిజం ఇదే. ఇస్లామాబాద్ వెన్నులో వణుకుపుట్టిస్తున్న నిజం కూడా ఇప్పుడు ఇదే. కానీ, ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల చేతుల్లో ఉండాల్సిన అమెరికా ఆయుధాలు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఎలా వచ్చాయి? అసలు ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా ఎలాంటి ఆయుధాలను విడిచిపెట్టింది?

2003-16 మధ్యలో అమెరికా భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాల్ని ఆఫ్ఘనిస్తాన్‌కు తరలించింది. ఆఫ్ఘాన్‌లో అమెరికా ఆయుధాల విలువ దాదాపు 60 వేల కోట్లు ఉంటుందని అంచనా. వీటిల్లో హెలికాప్టర్లు, విమానలు కూడా ఉన్నాయి. 3లక్షల 58వేల 530 వివిధ రకాల తుపాకులు, 64వేల మెషిన్‌ గన్లు, 25వేల 327 గ్రనేడ్‌ లాంచర్లు, 22వేల 174 హమ్వి వాహనాలు ఉన్నాయి. 2014లో నాటో దళాలు ఆఫ్ఘాన్ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పజెప్పాయి. ఈ క్రమంలో మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చింది. 2017-21 మధ్యలో 20వేల ఎం16 రైఫిల్స్‌, ఆ తర్వాత 3వేల 598 ఎం4 రైఫిల్స్‌ వీటిలో ఉన్నాయి. మరో 3వేల 12 హమ్విలను తరలించింది. తాలిబన్లు తయారు చేసిన మోస్ట్ పవర్‌ఫుల్ దళం పేరు బద్రి 313 ఫోర్స్‌. అమెరికా నుంచి చేజిక్కించుకొన్న ఆయుధాలు, ఇతర రక్షణ కవచాలు వీరి వద్దే ఉన్నాయి. కానీ, ఈ ఆయుధాలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేతికి ఎలా వెళ్లాయన్నది అసలు ప్రశ్న.

ఆఫ్ఘనిస్తాన్‌లోని అమెరకన్ వెపన్స్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతిలోకి వెళ్లడం పాకిస్తాన్ కర్మ ఫలితమే. ఎందుకంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడటానికి రీజన్ పాకిస్తానే. “ఆఫ్ఘాన్‌లో తిష్టవేసిన సోవియట్లను తరిమేందుకు తాలిబన్లను తయారు చేశాం.. వాళ్లే అమెరికాను, నాటోను కూడా ఓడించారంటూ పాక్ లీడర్లు అప్పట్లో మీసాలు మెలేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారం దక్కించుకొనే వరకు అక్కడి తాలిబన్లు పాక్ కనుసన్నల్లోనే ఉండేవారు. అమెరికా నుంచి అధికారం దక్కించుకొన్నాక.. పాకిస్తాన్ ఐఎస్‌ఐ నాటి చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కాబూల్‌ వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు తాలిబన్లకు మార్గదర్శకత్వంచేసి మరీవచ్చాడు. ఆ తర్వాతే సీన్ మారింది. పాకిస్తాన్‌తో ఉన్న సరిహద్దు వివాదంపై తాలిబన్లు దృష్టిపెట్టారు. అక్కడే రెండు దేశాల మధ్య మంటలు రాజుకున్నాయి. ఇటీవల రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. లక్షల మంది ఆఫ్ఘాన్ పౌరులను పాకిస్తాన్ నుంచి బలవంతంగా గెంటేయడం తాలిబన్లకు చిర్రెత్తేలా చేసింది. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న బలూచ్ లిబరేషన్ ఆర్మీకి అండగా నిలవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే BLAకు అమెరికా ఆయుధాలను ఇచ్చి పాక్‌పై పోరులో మద్దతు తెలిపింది. ఆ ఆయుధాలతోనే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేశారు. పాక్ సైన్యానికి కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. సో.. పాకిస్తాన్‌కు అసలు సినిమా ముందే ఉంది.