రేపటికి లక్ష…!
బంగారం.. జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. మధ్యతరగతికి అందనంటోంది.. కొండెక్కి కూర్చుంది. కొనడం కాదు కదా.. కొనాలన్న ఆలోచన రావాలన్నా.. ధైర్యం చేయాల్సి వస్తోంది.

బంగారం.. జెట్ స్పీడ్‌లో పరుగులు తీస్తోంది. మధ్యతరగతికి అందనంటోంది.. కొండెక్కి కూర్చుంది. కొనడం కాదు కదా.. కొనాలన్న ఆలోచన రావాలన్నా.. ధైర్యం చేయాల్సి వస్తోంది. పెరగడం తప్ప.. తగ్గడం స్పెల్లింగ్ కూడా తెలియదు అన్నట్లు.. పసిడి ధరలు కనిపిస్తున్నాయ్. గోల్డ్, సిల్వర్ ధరలు మరోసారి షాక్ ఇచ్చాయ్. గత రెండు రోజులు స్వల్పంగా తగ్గి ఉరటనిచ్చిన ధరలు.. ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయ్. లక్ష చేరుకోవడానికి.. లక్ష దాటడానికి.. పెద్దగా సమయం పట్టే అవకాశం కనిపించడం లేదు. మరికొన్ని గంటల్లో లక్ష దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర 990 రూపాయలు పెరిగి.. 96వేల 170 దగ్గరకు చేరింది. వెండి ధరలు కూడా బంగారాన్ని ఫాలో అవుతున్నాయ్. కిలో వెండి లక్ష దాటేసింది. కొన్ని నగరాల్లో లక్షా పదివేలకు మించి పలుకుతోంది. అక్షయ తృతీయకు ముందు.. ఈ రేంజ్‌లో ధరలు పెరగడంతో.. జనాలు గోల్డ్ వైపు చూడడం కూడా మానేశారు.
ఓ వైపు పెళ్లిళ్ల సీజన్.. మరోవైపు ట్రంప్ టారిఫ్ వార్.. అన్నీ కలిసి బంగారాన్ని అందనంత ఎత్తుకు చేరుస్తున్నాయ్. వారం రోజుల కింద.. గోల్డ్ రేటు కొంచెం తగ్గుముఖం పట్టినా.. మళ్లీ ఒక్కసారిగా పెరగటం కొనుగోలుదారులను టెన్షన్ పెడుతోంది. పసిడి ధర పెరగడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయ్. అందులో ఒకటి.. డాలర్ విలువలో తగ్గుదల కనిపించడం. రెండోది అమెరికా, చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య యుద్ధం.. పెట్టుబడిదారులందరినీ సురక్షితమైన, భరోసానిచ్చే బంగారం కొనుగోలుకు ఆసక్తి చూపడం కనబడుతోంది. మూడోది.. వారంలో భారీగా అమెరికా బాండ్ అమ్మకాలు పెరగడం. ఇక అటు అమెరికా, చైనా మధ్య సుంకాల యుద్ధం తీవ్రంగా మారుతోంది. 245 శాతం వరకు చైనా వస్తువులపై.. 125 శాతం వరకు అమెరికా వస్తువులపై సుంకాలు విధించారు. ఈ ట్రేడ్ వార్‌తో అంతర్జాతీయ మార్కెట్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. మిడిల్ ఈస్ట్ రాజకీయ పరిణామాలు.. యూరప్‌లో లో నాయకత్వ మార్పులు కూడా బంగారం విలువ పెరగడానికి కారణం అవుతున్నాయ్.
ప్రస్తుత ధరలే టెన్షన్ పెడుతున్నాయంటే.. ఈ ఏడాది చివరికి 24 క్యారెట్ బంగారం ధర లక్షా 25వేలకు చేరవచ్చని అమెరికాకు చెందిన గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా వేసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ డిసెంబర్ నాటికి ఔన్స్ బంగారం 4వేల 5వందల డాలర్లు పలకొచ్చని ఆ సంస్థ చెప్తోంది. అదే జరిగితే దేశీయంగా తులం లక్షా పాతిక వేలకు చేరడం ఖాయం. వాణిజ్య యుద్ధం ముదిరితే.. బంగారం ధరలు దూసుకుపోవచ్చన్న అభిప్రాయాలు ఎప్పట్నుంచో వినిపిస్తున్నాయ్. గోల్డ్‌మన్ సాచ్స్ కూడా ఇప్పుడిదే చెప్తోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు తెరతీయడంతో భారత్‌సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు అంతకంతకూ పతనమైపోయాయ్. దీంతో మదుపరులు తమ పెట్టుబడులను సేఫ్‌గా ఉంచుకునేందుకు.. బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
దీంతో మార్కెట్‌లో ధరలు పరుగులు పెడుతున్నాయ్. ఇక అటు ఆర్థిక మాంద్యం భయాల మధ్య.. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు.. బంగారం నిల్వలను పెంచుతున్నాయ్. ఇది కూడా గోల్డ్ ధరల్ని పెంచేస్తోంది. ఐతే బంగారం విషయంలో కొద్దిరోజులు వేచి చూసే ధోరణి ఫాలో అయితే బెటర్ అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. సుంకాల యుద్ధ వాతావరణం తొలగిపోయిన తర్వాత.. గోల్డ్ ధరలు నిలదొక్కుకునే చాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ప్రస్తుత పరిణామాల్లో.. బంగారం ధరలో పెద్దగా తేడా ఉండకపోవచ్చని.. అవసరమైనవారు మాత్రమే బంగారం కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఐతే పెట్టుబడిగా బంగారాన్ని చూడడం.. ఈ టైమ్‌లో చాలా రిస్క్ అని వార్నింగ్ ఇస్తున్నారు.