మారుతున్న ప్లే ఆఫ్ లెక్కలు ఆ నాలుగు జట్లకు కష్టమేనా ?

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు వారాలు అంచనాలు తప్పిన జట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకూ టాప్ 5లో ఉన్న జట్ల స్థానాలు కూడా మారుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 06:30 PMLast Updated on: Apr 16, 2025 | 6:30 PM

Are The Changing Playoff Numbers Difficult For Those Four Teams

ఐపీఎల్ 18వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మొదటి రెండు వారాలు అంచనాలు తప్పిన జట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. మొన్నటి వరకూ టాప్ 5లో ఉన్న జట్ల స్థానాలు కూడా మారుతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి ప్రదర్శన చేసినా..ఇక నుంచి మాత్రం ప్రతి మ్యాచ్ లోనూ అదరగొట్టాల్సి ఉంటుంది. చిన్నతప్పు చేసినా అది ప్లే ఆఫ్స్ రేసుపై ప్రభావాన్ని చూపుతుంది.ఐపీఎల్ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్స్ గా ముంబై, చెన్నై, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లను అనుకున్నారు.కానీ, సీజన్ మొదలయ్యాక ఈ మూడు జట్లు కూడా వరుసగా ఓడిపోయి లీగ్ టేబుల్లో ఆఖరి స్థానాలకు పరిమితం అయ్యాయి.

ఇక ఏ మాత్రం అంచనాలు లేని ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ జట్లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్ 4లో కొనసాగుతున్నాయి.అయితే సీజన్ మధ్యలోకి చేరగానే సన్ రైజర్స్, ముంబై, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు విజయాలు అందుకున్నాయి. దాంతో మరోసారి ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారిపోయింది. ప్రస్తుతం ఐదు జట్లు గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ, పంజాబ్, లక్నో తలా 8 పాయింట్లతో ఉన్నాయి. ఇక కేకేఆర్ 6 పాయింట్లతో ఉంది. ఇక రాజస్తాన్, ముంబై, చెన్నై, సన్ రైజర్స్ 4 పాయింట్లతో ఉన్నాయి. ఈ 10 జట్లకు కూడా ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

గుజరాత్ మరో 8 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. అందులో 4 గెలిస్తే ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఇక ఢిల్లీ 9 మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. 4 గెలిస్తే చాలు.. ఆర్సీబీ 8 మ్యాచ్ ల్లో 4 గెలిస్తే చాలు.. పంజాబ్ కింగ్స్ కూడా 8 మ్యాచ్ ల్లో 4 గెలిస్తే చాలు. ఈ జట్లకు మిగిలి ఉన్న మ్యాచ్ ల్లో సగం ఓడి సగం గెలిచినా ప్లే ఆఫ్స్ కు చేరతాయి. కానీ, సన్ రైజర్స్, చెన్నై, ముంబై పరిస్థితి అలా లేదు. ముంబై, సన్ రైజర్స్, రాజస్తాన్ జట్లు తమకు మిగిలి ఉన్న 8 మ్యాచ్ ల్లో 6 మ్యాచ్ ల్లో నెగ్గాలి. ఇక చెన్నై 7 మ్యాచ్ ల్లో 6 నెగ్గాలి. మొత్తం మీద టాప్ 5లో ఉన్న జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉంటే… పాయింట్ల పట్టికలో కింది నుంచి ఐదు స్థానాల్లో ఉన్న జట్లకు కాస్త టెన్షన్ నెలకొంది. కానీ టీ ట్వంటీ ఫార్మాట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. దీంతో ఏ జట్టును ప్రస్తుతానికి ప్లే ఆఫ్ రేసు నుంచి తీసిపారేయలేం. కాకుంటే టాప్ 5కి కింద ఉన్న జట్లకు మాత్రం ప్రతీ మ్యాచ్ కీలకంగా మారింది.