కాసేపుంటే నా గుండె ఆగిపోయేది, ఇలా టెన్షన్ పెట్టొద్దన్న పాంటింగ్

ఐపీఎల్ లో ఇదీ కదా మ్యాచ్ అంటే.. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ.. ఊహించని మలుపులు..గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ కూ, డగౌట్ లో ఉన్న కోచ్ లకే కాదు మ్యాచ్ ను చూస్తున్న అభిమానులందరికీ బంతి బంతికీ బీపీ పెరిగిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 04:59 PMLast Updated on: Apr 16, 2025 | 4:59 PM

Ponting Says Dont Be Tense

ఐపీఎల్ లో ఇదీ కదా మ్యాచ్ అంటే.. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠ.. ఊహించని మలుపులు..గ్రౌండ్ లో ఉన్న ప్లేయర్స్ కూ, డగౌట్ లో ఉన్న కోచ్ లకే కాదు మ్యాచ్ ను చూస్తున్న అభిమానులందరికీ బంతి బంతికీ బీపీ పెరిగిపోయింది. పంజాబ్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. ఈ మ్యాచ్ ఐపీఎల్ లవర్స్ కి మాంచి కిక్ ఇచ్చింది. లో స్కోర్ మ్యాచ్ అయినా కావాల్సినంత మజా దొరికింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కేకేఆర్ పై పంజాబ్ సంచలన విజయం నమోదు చేసింది. 110 పరుగుల స్కోరును కాపాడుకుని కోల్ కత్తాను 95 రన్స్ కే ఆలౌట్ చేసింది. ఈ విజ‌యం పై పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్ గా తాను సాధించిన అత్యుత్త‌మ విజయం ఇదేనన్నాడు.

అయితే ఇలాంటి హైటెన్షన్ మ్యాచ్ లతో తనకు ఇబ్బందేనంటూ వ్యాఖ్యానించాడు. ఎందుకంటే మ్యాచ్ చూస్తున్నంత సేపు తన హార్ట్ బీట్ పెరిగిపోయిందని గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం తనకు 50 ఏళ్లనీ, ఈ వ‌య‌సులో ఇలాంటి ఉత్కంఠ మ్యాచ్‌లు చూడాల్సిన అవ‌స‌రం లేదంటూ చెప్పుకొచ్చాడు. ఇలాంటి మ్యాచ్‌ల్లో కొన్నిసార్లు స‌గం ఇన్నింగ్స్ అయ్యాక ఛేజింగ్ అంత ఈజీ కాదన్నాడు. ఇదే విష‌యాన్ని జ‌ట్టు స‌భ్యుల‌కు చెప్పిన‌ట్లు పేర్కొన్నాడు. చాహల్ కు గత మ్యాచ్ లో గాయమైనా పూర్తి ఫిట్ నెస్ సాధించాడని, మ్యాచ్ ను మలుపు తిప్పేశాడని ప్రశంసించాడు. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో తమ ఆట‌గాళ్ల ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల గ‌ర్వ ప‌డేవాడ‌నంటూ పాంటింగ్ వ్యాఖ్యానించాడు.

మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో కేకేఆర్ ఈజీగా గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. బంతితో మ్యాజిక్ చేసి కోల్ కత్తాను 15.1 ఓవర్లలోనే 95 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ సంచలన విజయంతో ఐపీఎల్ లో పంజాబ్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ హిస్టరీలో అతి తక్కువ స్కోర్ ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా పంజాబ్ కింగ్స్ ఘనత సాధించింది. కాగా ఈ సీజన్ లో పంజాబ్ కి ఇది నాలుగో విజయం. ఇప్పటివరకు ఆరు మ్యాచులు ఆడిన పంజాబ్ పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగబాకింది.