జమ్మూకశ్మీర్‌లో పేట్రేగిపోయిన ఉగ్రవాదులు, కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు...ఐడీ కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 11:01 AMLast Updated on: Apr 23, 2025 | 11:01 AM

26 Tourists Killed In Militant Attack Firing In Jammu And Kashmir

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు…ఐడీ కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు. ఈ ఉగ్రవాదిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. పహల్గాంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి.

మంచుకొండల్లో రోప్‌వే ప్రయాణం, ఎతైన కొండలు, పచ్చని పర్వతాలు. తో జమ్మూ కశ్మీర్‌ భూతల స్వర్గాన్ని తలపిస్తుంది. ఒక్కసారైనా కశ్మీర్​ అందాలు చూడాలని కోరుకుంటారు. అలాంటి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాదళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి.

అమర్​నాథ్ యాత్రకు ముందు ఉగ్రదాడిఅమర్‌నాథ్‌ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి. 38రోజులపాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్‌నాథ్‌ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పొడవైన పచ్చికబయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గామ్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కశ్మీర్‌లో కొంతకాలం నుంచి పర్యాటకుల తాకిడి పెరిగిన నేపథ్యంలో ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు భద్రతాదళాలు భావిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాద సంస్థ స్థానిక శాఖ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి తెగబడినట్లు ప్రకటించుకుంది.

ఐడీ కార్డులు చూసి…పాయింట్ బ్లాంక్ లో కాల్పులు కుటుంబ సభ్యులను మాత్రం వదిలిపెట్టి ఆయన ఐడీ కార్డు చూసి మరీ కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ముస్లింలు కాని వారిపైనే కాల్పులు జరిపినట్లు బాధితులు వాపోతున్నారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడినవారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకుంటారు. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మృతుల్లో కర్ణాటక వ్యాపారి, ఎస్ఐబీ ఉద్యోగి హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఐబీ కార్యాలయంలో సెక్షన్‌ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీశ్‌రంజన్‌ కుటుంబ సభ్యులతో కలిసి కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. భార్య, ఇద్దరు పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు కాల్చిచంపారు. బిహార్‌కు చెందిన మనీశ్‌…ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. కర్ణాటక చెందిన వ్యాపారవేత్త మంజునాథ్ ను చంపేశారు. ఆ సమయంలో మంజునాథ్ భార్య…తనతో పాటు తన బిడ్డను కూడా చంపేయాలని టెర్రరిస్టులను ప్రాధేయ పడింది. కొత్తగా పెళ్లయిన జంటను ఉగ్రవాదులు వదిలిపెట్టలేదు. కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు. భార్య కళ్ల ముందే భర్తను…పాయింట్ బ్లాంక్ కాల్చేశారు.

సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఘటన స్థలానికి వెళ్లారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించనున్నారు. జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రాంబన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా  హెచ్చరించారు.