జగన్ చెప్పాడు.. నేను చేసా.. రాజ్ కసిరెడ్డి సంచలన స్టేట్మెంట్

ఏపీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌ సంచలనం రేపుతోంది. విచారణలో కసిరెడ్డి చెప్పిన విషయాలతో డిటేల్డ్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ను రెడీ చేశారు అధికారులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 11:15 AMLast Updated on: Apr 23, 2025 | 11:15 AM

Raj Kasiredy Sensational Comments

ఏపీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో అరెస్టైన కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి రిమాండ్‌ రిపోర్ట్‌ సంచలనం రేపుతోంది. విచారణలో కసిరెడ్డి చెప్పిన విషయాలతో డిటేల్డ్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ను రెడీ చేశారు అధికారులు. లిక్కర్‌ వ్యవహారం మొత్తం జగన్‌ కనుసన్నల్లోనే నడిచిందని.. జగన్‌ చెప్తేనే తాను ఈ విషయంలో పాత్రధారిగా ఉన్నానంటూ బాంబు పేల్చాడు కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి. “జగన్‌ ఆదేశించారు. నేను ఆచరించాను. మిథున్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించాం. జగన్‌ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డితోపాటు చాలా మందికి ఇందులో పాత్ర ఉంది. లిక్కర్‌ స్కామ్‌ సూత్రధారి రాజ్‌ కసిరెడ్డి అలియాస్‌ కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి ‘సిట్‌’కు తెలిపిన వివరాలు ఇవి. లిక్కర్‌ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న రాజ్‌ కసిరెడ్డిని దుబాయ్‌ నుంచి వచ్చీ రాగానే అరెస్ట్‌ చేశారు సిట్‌ అధికారులు. వెనువెంటనే విచారణ కూడా చేపట్టారు. ఈ విచారణలో కసిరెడ్డి నుంచి కీలక విషయాలు రాబట్టి రిమాండ్‌ రిపోర్ట్‌ తయారు చేశారు.

ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో రాజశేఖర్‌ను ప్రశ్నించామని.. నేరం, దాని వెనుక ఉన్న కుట్ర, కసిరెడ్డి పాత్ర, ఇతరుల భాగస్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్‌ కసిరెడ్డి, చివరికి నేరాంగీకరపత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని ‘సిట్‌’ పేర్కొంది. ప్రభుత్వానికి, పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కౌట్‌ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్‌ తనకు అప్పటించినట్టు కసిరెడ్డి ఒప్పుకున్నాడు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్‌ రావాలని, పథకాల అమలుకూ ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో.. బేవరేజెస్‌ కార్పొరేషనే లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించారు. ఐఆర్‌టీఎస్‌ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి.. తొలుత బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీగా, ఆ తర్వాత బేవరేజెస్‌, డిస్టిలరీస్‌ కమిషనర్‌గా నియమించారు. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, లేబుల్‌ రిజిస్ట్రేషన్‌లు తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఆయనకే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్‌ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్‌ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్‌కు అప్పగించారు.

2023లో ఆయనకు సివిల్‌ సర్వీసు కోటాలో ఐఏఎస్‌ హోదా ఇప్పిస్తామన్న అగ్రిమెంట్‌తో సత్యప్రసాద్‌ను మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించారు. మద్యం ముడుపుల కుట్రకు హైదరాబాద్‌లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్‌ చేసినట్టు కసిరెడ్డి ఒప్పుకున్నాడని చెప్తున్నారు పోలీసులు. 2019 అక్టోబరు 13న విజయసాయి ఇంట్లోనే కీలక భేటీ జరిగింది. విజయ సాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల శ్రీధర్‌రెడ్డి, మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్‌ భేటీ అయ్యారు. మద్యం ఉత్పత్తి దారులు, డిస్టిలరీస్‌ నుంచి నెలకు కనీసం 50-60 కోట్లు ముడుపులు వచ్చేలా స్కీమ్‌ రూపొందించారు. ఇందుకోసం తొలుత అబ్కారీ శాఖలో కీలకమైన సీ-టెల్‌ సాఫ్ట్‌వేర్‌ను తొలగించాలనుకున్నారు. సీ-టెల్‌ సాఫ్ట్‌వేర్‌లో మద్యం అమ్మకాలు, సరఫరా వివరాలన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి.

ఆయా బ్రాండ్ల మూడు నెలల అమ్మకాలు, దానిపై పది శాతం పెరుగుదలను కలిపి స్టాక్‌ ఇచ్చేలా ఆ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇది అమల్లో ఉంటే వీళ్ల పథకం ఫలించదు. వీళ్ల ప్లాన్‌ ప్రకారం మద్యం సరఫరాను కంప్యూటర్‌లు, ఆన్‌లైన్‌ డిసైడ్‌ చేయకూడదు. ఏ బ్రాండ్‌ను ఎంత మేరకు సరఫరా చేయాలో, రిటైల్‌ షాపులో ఏవి విక్రయించాలో వాళ్లే నిర్ణయించాలి. అందువల్ల… సరఫరాను ఆన్‌ లైన్‌కు బదులు ఆఫ్‌లైన్‌లో సాగేలా నిర్ణయించారు. మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలను పూర్తిగా వీళ్ల నియంత్రణలోకి తెచ్చుకున్నారు. 2019 డిసెంబరులో హైదరాబాద్‌లో శరత్‌చంద్రారెడ్డి ఆస్పత్రి వీధిలోని ఓ ప్రైవేటు బంగ్లాలో కసిరెడ్డి, మిథున్‌ రెడ్డి, సజ్జల శ్రీధర్‌ రెడ్డి, బేవరేజెస్‌ ఎండీ వాసుదేవరెడ్డి సమావేశమయ్యారు.

మద్యం సీసా బేసిక్‌ ధర ఆధారంగానే తమకు ఉత్పత్తిదారుల నుంచి ముడుపులు వచ్చేలా ఫిక్స్‌ చేసుకున్నారు. వీళ్లు నిర్ణయించిన మద్యం ముడుపుల ప్రకారం ప్రతి నెలా కనీసం 50 నుంచి 60 కోట్లు వచ్చేవి. మద్యం బ్రాండ్ల సరఫరా, ప్రభుత్వ షాపుల్లో లిక్కర్‌ అమ్మకాలపై ప్రతినెలా వీళ్లకు డేటా వచ్చేది. ఇదుకోసం పలువురు ఉద్యోగులను కూడా వాడుకున్నట్టు చెప్పాడు కసిరెడ్డి. ప్రతినెలా ఐదో తేదీన కమీషన్ల లెక్కలు వేసి వీళ్లిచ్చే డేటాను బట్టి ఆయా కంపెనీలకు ఫోన్లు చేసేవాళ్లు. ఫోన్‌కాల్స్‌ కోసం వీపీఎన్‌ ఉపయోగించేవారు. కంపెనీలు ముడుపుల సొమ్ము ఇచ్చాక.. అవి కసిరెడ్డి దగ్గరకు చేరేవి. కసిరెడ్డి ఆ డబ్బును తిరిగి ఓఎస్డీ కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీకి పంపించే వాడు. ఇది మొత్తంగా లిక్కర్‌ వ్యవహారంలో కసిరెడ్డి పాత్ర. మొత్తం 29 మంది నిందితులు ఉన్న ఈ కేసులో కసిరెడ్డి ఏ1గా ఉన్నాడు. ఏ4గా ఎంపీ మిథున్‌ రెడ్డి, ఏ5గా విజయ్‌సాయి రెడ్డి ఉన్నారు.