ఉగ్రవాదులు పెహల్గామ్‌ నే ఎందుకు టార్గెట్ చేసారు? వాళ్ళ హిట్ లిస్ట్ లో ఉన్నది ఎవరు?

కాశ్మీర్" ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు... ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 23, 2025 | 07:00 PMLast Updated on: Apr 23, 2025 | 7:00 PM

Why Did Terrorists Target Pahalgam Who Is On Their Hit List

కాశ్మీర్” ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు… ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం. 2014 తర్వాత కాశ్మీర్లో పర్యాటకుల సందడి పెరిగింది. కేంద్ర ప్రభుత్వం.. కాశ్మీర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించడంతో పర్యాటకులు ధైర్యంగా వెళుతున్నారు. అటు భద్రత బలగాలు కూడా పర్యాటకుల భద్రత విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

అయితే తాజాగా జరిగిన ఓ ఘటన సంచలనమైంది. పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్లే పెహల్గాం ప్రాంతంలో జరిగిన అత్యంత దారుణ ఘటన.. 27 మంది ప్రాణాలను తీసింది. దీనితో కాశ్మీర్ వెళ్లాలి అనుకునే పర్యాటకల్లో ఆందోళన మొదలైంది. అయితే కాశ్మీర్ లో.. పెహల్గాం ప్రాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూమతంలో అత్యంత క్లిష్టమైన తీర్థయాత్రలలో ఒకటిగా చెప్పే.. అమర్నాథ్ యాత్రకు పెహల్గాం ప్రధాన మార్గం. అమర్నాథ్ గుహను చేరుకునే మార్గాల్లో ఇదే అత్యంత ప్రధానమైనది.

గుహకు ఒకవైపు సోనామార్గ్ , బాల్తాల్ వైపు నుంచి మార్గం ఉన్నప్పటికీ.. నిట్ట నిలువుగా ట్రెక్కింగ్ చేయాల్సిన క్లిష్టతరమైన మార్గం కావడంతో.. యాత్రికులు చాలామంది పెహల్గాం నుంచే వెళుతూ ఉంటారు. అక్కడి నుంచి యాత్రను ప్రారంభించి.. రెండు రోజులు పాటు ట్రెక్కింగ్ చేసుకుంటూ అమర్నాథ్ వెళతారు. అందుకే దేశంలో అందరికీ పరిచయం అవసరం లేని ప్రాంతంగా నిలిచింది. ఇటు సాధారణ పర్యాటకులతో పాటుగా అటు తీర్థయాత్రకులను సైతం ఆకట్టుకునే ప్రత్యేక లక్షణం ఈ ప్రాంతం సొంతం.

ప్రస్తుతం అమర్నాథ్ యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. అయితే దేశమంతా వేసవి వేడితో సతమతమవుతున్న సమయంలో.. చల్లని కాశ్మీర్ లోయ.. పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అందులో స్విట్జర్లాండ్ ను తలపించే ఈ ప్రాంతాలు బిజీ బిజీగా ఉంటున్నాయి. కాశ్మీర్ లో నివసించే స్థానికులకు ఎక్కువగా ఆదాయం పర్యాటకుల ద్వారానే వస్తుంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పర్యాటకుల ద్వారానే ఆదాయం ఎక్కువగా చేకూరుతోంది. సాధారణంగా ఉగ్రవాదులు పర్యాటకులను టార్గెట్ చేసే అవకాశం ఉండదు.

దీనికి ప్రధాన కారణం అక్కడ స్థానికుల ఆదాయ వనరులకు దెబ్బ పడితే.. తమకు ఇబ్బంది కలుగుతుందనే భావనలో ఉంటారు. ఇక్కడ వారి టార్గెట్ ఎక్కువగా భారత సైనిక బలగాలు. అలాగే భద్రత దళాలు. వారి హిట్ లిస్టులో ఇండియన్ ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్.. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, వంటి కేంద్ర పారా మిలిటరీ బలగాలు వారి లక్ష్యంగా ఉంటాయి. సైనికులనే ఎక్కువగా హతమారుస్తూ ఉంటారు. ఇక ఎన్కౌంటర్లలో వందలాది మంది ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు కాల్చి చంపుతున్నాయి.

అయితే అప్పుడప్పుడు ఉగ్రవాదులు కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఏదో ఒక రూపంలో దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడ్డారు. పర్యాటకుల ఐడెంటిటీ గుర్తించి మరీ కాల్చి చంపినట్టు అక్కడి బాధితులు చెప్తున్నారు. ఇదంతా కూడా పక్క పథకం ప్రకారం జరిగిందని నిఘ వర్గాలు.. అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఉగ్రవాదుల నెట్వర్క్ పర్యాటక ప్రదేశాల్లో రిక్కీ నిర్వహిస్తూ ఉంటుంది. శ్రీనగర్ తో పాటుగా గుల్మార్గ్.. సోనా మార్గ్.. పెహల్గాం.. ప్రాంతాల్లో రిసార్ట్ లు, హోటల్స్, సమ్మర్ క్యాంపులను గమనిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో యాత్రికుల రద్దీ ఏ మేరకు ఉందో తెలుసుకుని.. సరిగ్గా అదును చూసి దాడికి పాల్పడ్డారు. అమెరికా ఉపాధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్న సమయం, భారత ప్రధాని సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లిన సమయం చూసి ఈ దుర్మార్గానికి వడిగట్టారు. తద్వారా కాశ్మీర్ అంశంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చించాలన్నదే ఉగ్రవాదుల పన్నాగంగా భావిస్తున్నారు అయితే అమెరికా, రష్యా సహా అగ్రరాజ్యాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వానికి మద్దతును ప్రకటిస్తూ వస్తున్నాయి.