2 గంటల్లో ముంబై టూ దుబాయ్, సముద్రం లోపలి నుంచి ట్రైన్
ముంబై నుంచి దుబాయ్‌కి రెండే రెండు గంటల్లో వెళ్లే వీలు ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే చాలా బాగుంది కదా. త్వరలోనే ఈ ఊహ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముంబై నుంచి దుబాయ్‌కి రెండే రెండు గంటల్లో వెళ్లే వీలు ఉంటే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే చాలా బాగుంది కదా. త్వరలోనే ఈ ఊహ నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముంబై నుంచి దుబాయ్‌కి హై స్పీడ్ ట్రైన్ ప్రాజెక్ట్ సిద్ధం అవుతోంది. అదెలా కుదురుతుంది ? రెండు నగరాల మధ్య భూ మార్గం లేదు కదా, మధ్యలో అరేబియా సముద్రం ఉంది కదా అన్న డౌట్ వచ్చిందా ? మీరు సరిగ్గానే ఆలోచించారు. భూ మార్గం లేకపోయినప్పటికీ రైలు ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు నీటి అడుగున, అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది అంటే అండర్ వాటర్ హై స్పీడ్ ట్రైన్ అన్నమాట. ముంబైలో బయలు దేరి అరేబియా సముద్రంలో దిగి, నీటి అడుగున నడిచే ఈ హై స్పీడ్ రైలు మళ్లీ దుబాయ్‌లో రోడ్డు ఎక్కుతుంది.
తద్వారా, ముంబై – దుబాయ్ మధ్య ప్రయాణ సమయాన్ని చాలా ఆదా చేస్తుంది. ఈ కొత్త రైలు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే అధిగమించవచ్చు. UAE నేషనల్ అడ్వైజర్ బ్యూరో ప్రణాళిక ప్రకారం, దుబాయ్-ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది. ఈ హై స్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళితేనే, ముంబై – దుబాయ్ మధ్య ఉన్న దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుతుంది. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కొత్తదేమీ కాదు, ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందడంలో పురోగతి లేక ఆ ప్రతిపాదన కోల్డ్ స్టోరేజీలోకి చేరింది. ఈ ప్రతిపాదిత రైలు నెట్‌వర్క్ విమాన ప్రయాణికులకు మరొక జర్నీ ఆప్షన్‌ను అందిస్తుంది.
ఎయిర్ రష్‌ను తగ్గిస్తుంది. రద్దీ తగ్గితే డిమాండ్ కూడా తగ్గుతుంది. ఆటోమేటిక్‌గా టిక్కెట్ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. మరోవైపు ఇది ఇండియా దుబాయ్ మధ్య ముడి చమురు, వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది. అండర్ వాటర్ రైల్ నెట్‌వర్క్ ద్వారా ప్రయాణీకులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో బిలియన్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాజెక్టులోకి ప్రవహిస్తాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ముంబై – దుబాయ్ అండర్ వాటర్ ట్రైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు.