బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సామాన్యుడి లేఖ,విమర్శలేనా…? ఆత్మవిమర్శ చేసుకునేది ఏమైనా ఉందా?

మీ పార్టీ టిఆర్ఎస్ గా పుట్టి ,బి ఆర్ ఎస్ గా మారి... రజతోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మీకు, మీ కార్యకర్తలకు అభినందనలు. మీ హడావుడి చూస్తుంటే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2025 | 09:00 PMLast Updated on: Apr 28, 2025 | 12:33 PM

Is A Common Mans Letter To Brs Working President Ktr A Criticism Is There Anything To Criticize

మీ పార్టీ టిఆర్ఎస్ గా పుట్టి ,బి ఆర్ ఎస్ గా మారి… రజతోత్సవం చేసుకుంటున్న సందర్భంగా మీకు, మీ కార్యకర్తలకు అభినందనలు. మీ హడావుడి చూస్తుంటే…. రేపో మాపో పవర్ లోకి వచ్చేయాలి అన్నంత కంగారు కనిపిస్తోంది. ఈ సందర్భంగా సామాన్యుడిగా నేను కొన్ని వాస్తవాలను, నిర్భయంగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను.తెలంగాణను పదేళ్లు పరిపాలించి… అధికారం కోల్పోయిన తర్వాత ఆరు నెలలు తిరగకుండానే మీరు కాంగ్రెస్ సర్కారు పై విమర్శల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. రేవంత్ సర్కార్ చేసిన పొరపాట్లు మీకు వరం అయ్యాయి. ఇక ప్రతిరోజు మీరు, మీ సొంత మీడియా……, కాంగ్రెస్ ని, రేవంత్ సర్కార్ ని ఆడుకుంటున్న తీరు చూస్తే మీరు విమర్శలే తప్ప… ఆత్మ విమర్శ చేసుకోరు అనే విషయం రూడీ అయిపోయింది. అందుకే మీరు ఎందుకు అధికారం కోల్పోయారో గుర్తు చేస్తున్నాను.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, ప్రత్యేక తెలంగాణ సాధించిన ఘనత కచ్చితంగా కెసిఆర్ కే దక్కుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలంగాణను సాధించడానికి కెసిఆర్ రాజకీయంగా ఎత్తులు, జిత్తులు …. పిల్లి మొగ్గలు ఎన్ని వేసినప్పటికీ అదంతా తెలంగాణ కోసమేనని జనం నమ్మారు. కానీ మీ 10 ఏళ్ల పాలన, ఉద్యమ స్ఫూర్తిని దెబ్బ తీసిందన్నది నిజం కాదా ? రాష్ట్ర విభజన తర్వాత కూడా అధికారం మళ్లీ అగ్రవర్ణాలకే దక్కింది. పవర్…. మీ ఫ్యామిలీ చుట్టూ తిరిగింది. మీ పాలనలో రియల్ ఎస్టేట్ బిల్డర్లు…. ఎమ్మెల్యేలు… మంత్రులు వీళ్లే బాగుపడ్డారు.జనం ఎప్పటిలాగే సామాన్య జనం గానే ఉన్నారు. మీరు చేసిన లక్షల కోట్ల అప్పులే ఇప్పటికీ వెక్కిరిస్తున్నాయి. భవిష్యత్తులో మీకు మళ్లీ అధికారం వస్తే రావచ్చు. కెసిరో, మీరో ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావచ్చు. కానీ చరిత్రలో వాస్తవాలు చెరిగిపోవుగా.

మీరు సూటిగా సమాధానం చెప్పండి. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను అని కెసిఆర్ అన్నారా లేదా? ఆయన ఎందుకు చేయలేదు? కనీసం దానిపై కేసీఆర్ ఎన్నడైనా వివరణ ఇచ్చారా?ఇది దళితులకు మీరు చేసిన ద్రోహం కాదా ? అధికారం ఒక అగ్రకులం నుంచి మరొక అగ్రకులానికే మారింది తప్ప….. తెలంగాణలో పెద్ద మార్పు ఏమీ లేదనేది నిజం కాదా? రాష్ట్ర విభజనలో జరిగింది కేవలం రాజకీయ మార్పిడి మాత్రమే? అవునా కాదా? తెలంగాణ ఏర్పడితేనే…. , తెలంగాణ వాడు సీఎం అయితేనే తెలంగాణ బాగుపడుతుందని మీరు వాదించారు. మరి బీసీలు, ఎస్సీలు బాగుపడాలంటే వాళ్ళు ఎందుకు సీఎంలు కాకూడదు? వాళ్లని మీరెందుకు సీఎం లను చేయకూడదు?

పదేళ్లు కెసిఆర్ ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీ చెల్లెలు కవిత ఎంపీ….. ఆమె ఓడిపోతే తిరిగి ఎమ్మెల్సీ, మీ బావ హరీష్ రావు మంత్రి…., మీ చిన్నమ్మ కొడుకు సంతోష్ రావు ఎంపీ…. ఆలోచించండి. మీ కుటుంబంలో పదవులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు పదవులు ఇవ్వడం కోసమే తెలంగాణ ఏర్పడిందా? ఇంత నిస్సిగ్గుగా భారతదేశంలో ఏ కుటుంబమైనా పదవులను పంచుకుందా? దీనిపై ఎప్పుడైనా మీరు ఆత్మ విమర్శ చేసుకున్నారా?

తెలంగాణ ఉద్యమం లో మీరు పాల్గొనక ముందు మీరు, మీ కుటుంబ సభ్యుల ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్……2024 లో మీరు మీ కుటుంబ సభ్యుల ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ తో పోల్చి చూద్దాం.2004లో మీ ఆదాయం, ఆస్తి ఎంత, ? 2024లో మీది మీ కుటుంబ సభ్యుల ఆదాయం ఆస్తి ఎంత? బహిరంగంగా చర్చించగలరా? ఒకవేళ ఆదాయం పెరిగితే ఎందుకు పెరిగింది? మీరేం వ్యాపారాలు చేశారు? రకరకాల కంపెనీల లో మీకు, మీ భార్యకు డైరెక్టర్ షిప్ లు ఎలా వచ్చాయి? 20 ఏళ్లలో ఇన్ని ఆస్తులు ఎలా పెరిగాయి? చెప్పగలరా? వందల వేల ఎకరాలు.. ఫామ్ హౌస్ లు ఎలా కొన్నారు? డబల్ బెడ్ రూమ్ ఇంటికి దిక్కులేని కవిత బంజారాహిల్స్ లో 200 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటికి ఓనర్ ఎలా అయింది? కోటి రూపాయలు విలువైన వాచి ఎలా పెట్టుకోగలుగుతుంది? ఆమెకు దుబాయిలో ఇల్లు ఎలా వచ్చింది? గచ్చిబౌలిలో అంత పెద్ద స్థలం ఎలా సంపాదించింది? రకరకాల కంపెనీ లలో ఆమెకు పెట్టుబడులు ఎవరు పెట్టారు? వీటికి మీరు సమాధానం వెతికితే ,తెలంగాణ సమాజం మీ కుటుంబాన్ని ఎందుకు వెలివేసిందో అర్థమవుతుంది.

ఇవాళ మీ పార్టీ అకౌంట్ లో అధికారికంగా సుమారు 1450 కోట్ల రూపాయలు ఉన్నాయి. భారతదేశంలో ఏ పార్టీకి ఇన్ని వందల కోట్ల రూపాయల నిధులు వచ్చి పడిపోలేదు. మరి మీకు మాత్రమే పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ఫార్మా కంపెనీ ఓనర్లు వందల కోట్ల రూపాయలు నిధులు ఎందుకు ఇచ్చారు?వాళ్లకి ఏమీ బెనిఫిట్స్ లేకుండానే….. మేలు జరగకుండానే మీకు ఇన్ని వందల కోట్లు వైట్ మనీ ఇస్తారా? మీ రాజకీయ విధానాలు, అడ్మినిస్ట్రేటివ్ పాలసీస్ వాళ్లకి అనుకూలంగా ఉంటేనేగా? ఇది పరోక్షంగా అవినీతి సొమ్ము కాదా? మీరు అవినీతిపరులు కాదా?

తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇచ్చిన నినాదాలకు ఆకర్షితులై వందల మంది యువకులు ప్రాణ త్యాగం చేశారు? మరి మీ కుటుంబంలో ఒక్కరు కూడా ఎందుకు ప్రాణత్యాగం చేయలేదు? 14 వందల మంది ప్రాణాలు పోయాయి కానీ… మీ ఫ్యామిలీలో ఎవరికి ఒంటిమీద గీత కూడా పడలేదు. అంటే త్యాగం వాళ్లది. భోగం మీది అన్నమాట. కనీసం ఆ కుటుంబాలకి పదేళ్ల లో ఒక్కసారైనా న్యాయం చేశారా? తెలంగాణ వచ్చేవరకు మాత్రమే మీది ఉద్యమ పార్టీ. ఆ తర్వాత మీది కుటుంబ పార్టీ. తెలంగాణ ఫలితాలను మీ కుటుంబమే అనుభవించింది. దీన్ని ఎప్పటికీ మీరు కాదన లేరు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన వాళ్ల జాబితా ఇప్పటికైనా మీరు బయట పెట్టండి. మీ పార్టీ అకౌంట్ లో ఉన్న 1450 కోట్ల రూపాయలు… బయటకు తీసి అమరవీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇవ్వండి. మీ తెలంగాణ గుండె చప్పుడు ఏపాటిదో తెలుస్తుంది.

పదేళ్లలో మీరు టికెట్లు ఇచ్చింది ఎవరికో తెలుసా..? ఉద్యమం తో సంబంధం లేని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా వ్యాపారులు, మైనింగ్ డాన్ లు, ఫార్మా కంపెనీ ఓనర్లు, ఇన్ఫ్రా కాంట్రాక్టర్ లు. వీళ్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఫలితాలను పదేళ్ల నుంచి అనుభవిస్తున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, హేట్రో పార్థసారథి , పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గ్రానైట్ రవి,…. ఎవరు వీళ్లంతా? ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నారా? తూటాలకు ఎదురెళ్లి నిలబడ్డారా? కానీ తెలంగాణ రాగానే వీళ్లంతా మీ చుట్టూ చేరారు…. కాదు కాదు మీరే పిలిచి చేర్చుకున్నారు. కారణం మీకు వేలకోట్ల డబ్బు కావాలి. అది వీళ్ళు సంపాదించి పెట్టాలి. టిఆర్ఎస్ ఇక ఉద్యమ పార్టీ కాదు. ఫక్తు రాజకీయ పార్టీ. పార్టీ అవసరాల కోసం ఏ నిర్ణయాలైనా తీసుకుంటాం. ఒకప్పుడు కెసిఆర్ చెప్పిన మాటలివి. దానికి తగినట్టుగానే ఉద్యమ నేతలని తన్ని తగిలేసి… ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లకి బ్రహ్మరథం పట్టి తీసుకొచ్చారు మీరు. అవన్నీ గమనించిన జనం మొన్న 2023లో మీకు దెబ్బేశారు.

సెంటిమెంటే ప్రాణంగా టిఆర్ఎస్ పుట్టింది. కానీ కెసిఆర్ కి, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం ఇంత కూడా సెంటిమెంట్ ఉండదు. ఎంతమంది లీడర్ల్ని మీరు తొక్కిపడేసారో గుర్తుందా.? ఉద్యమ తొలి రోజుల్లో తనతో సమాంతరంగా ఎదిగిన గాదె ఇన్నయ్య, ఆలే నరేంద్ర, రేగులపాటి పాపారావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, విజయశాంతి ,రఘునందన్ రావు ,రవీంద్ర నాయక్ ,విజయ రామారావు ఇలాంటి నాయకుల్ని పార్టీ నుంచి నెట్టి పడేసాడు కేసీఆర్.

వాళ్ల పట్ల ఎంత అమానవీయంగా మీరు ప్రవర్తించారో మర్చిపోయి ఉండొచ్చు. జనం మర్చిపోలేదు. ఆ తర్వాత కోదండరాం, జితేందర్ రెడ్డి, రాములు నాయక్, ఈటెల రాజేందర్, రాజయ్య యాదవ్, చెరుకు సుధాకర్, జిట్టా బాలకృష్ణారెడ్డి ….వీళ్ళందర్నీ మీ సొంత అవసరాలకు వాడుకొని…. పూర్తిగా నాకేసి అవసరం తీరాక ఎంత దారుణంగా బయటకి గెంటేశారు? జనం మర్చిపోతారా? ఇవన్నీ జనం పదేళ్లు చూశాకే మీరంటే యావగింపు కలిగి 2023 ఎన్నికల్లో లేవకుండా కొట్టారు. నిజానికి రేవంత్ రెడ్డిని ,కాంగ్రెస్ ని చూసి జనం ఓటు వేయలేదు. మీరు పవర్ లో ఉండకూడదు…. మీరు పోవాలి అనే కసితో కాంగ్రెస్ ని గెలిపించారు. కెసిఆర్ మీద జనంలో ఉన్న వ్యతిరేకత వల్లే కాంగ్రెస్ గెలిచింది తప్ప…. కాంగ్రెస్ కి గాని ఆ పార్టీ నాయకులకు గాని అంత సీన్ లేదు.

2014లో సరిపడనంత మెజారిటీతో మీరు గెలిచారు. అయినా కాంగ్రెస్ పార్టీని ముక్కలు చేసి ఆ పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకున్నారు. టి డి ఎల్ పి నైతే ఏకంగా విలీనం చేసుకున్నారు. ప్రతిపక్షం లేకుండా చేశారు. ఇక 2018లో…. అవసరం లేకున్నా కాంగ్రెస్ ని నాశనం చేశారు. మరో పార్టీ లేకుండా చెలరేగిపోయారు. అప్పుడు మీకు విలువలు గుర్తు రాలేదా? ప్రజాస్వామ్యం ఒకటి ఉందని తెలియదా? అధికార మదం ఎంత అహంకారాన్ని సృష్టిస్తుందో ఆ పదేళ్లు మీరు ప్రజలకు ప్రాక్టికల్ గా చూపించారు.కెసిఆర్ జనం సొమ్ముతో ప్రగతి భవన్ కట్టుకున్నాడు. ఏనాడైనా ఎవర్నైనా అడుగుపెట్టనిచ్చారా? ఉంటే ప్రగతి భవన్… లేదంటే ఫామ్ హౌస్. ఏనాడైనా కెసిఆర్ ప్రజల్ని కలిశారా? ఇందు కోసమా తెలంగాణ ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది? పదేళ్ల రాజరిక వ్యవస్థని అప్పుడే మర్చిపోమంటున్నారు మీరు. అది ఎలా సాధ్యం?

జనం ఓట్లతో గెలిచి…. అసెంబ్లీకి రావడానికి కెసిఆర్ కి ఏం రోగం?అసెంబ్లీకి రాలేనప్పుడు రాజీనామా చేసి మరొకరికి అవకాశం ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి తిడతాడు కనుక కెసిఆర్ అసెంబ్లీ రాడంటూ మీరు కవర్ చేసుకురావడం మరీ విడ్డూరం. మీరంతా ఏమైనా శుద్ధపూసలా? అసలు తెలంగాణలో కేసీఆర్ లాగా ఎవడైనా తిట్టగలడా? రేవంత్ రెడ్డి తిడితే ఎదుర్కోవాలి? వాళ్లని మాటలతో చీల్చి చెండాడాలి. అంతేగాని నేను లేస్తే మనిషిని కాదని ఫామ్ హౌస్ లో పడుకుని డైలాగులు చెప్పడం కాదు.

మీ కుటుంబానికి ఉన్న గొప్ప ఆస్తి. మాటకారితనం. బహుశా ఆంధ్ర రూట్స్ ఉండడం వల్లేమో మీకు అంత మాటకారితనం వచ్చింది. ఇప్పటికీ మీరంతా ఆ మాటకారతనంతోనే నెట్టుకొస్తున్నారు. లేకపోతే ఎంత ధైర్యం? లిక్కర్ స్కామ్ లో ఐదు నెలలు తీహారు జైల్లో ఉండొచ్చి మీ సోదరి కవిత తెలంగాణ ప్రజలకు విలువలు గురించి చెబుతున్నారు.వేల కోట్లకు ఎదిగిన మీరు రేవంత్ రెడ్డి అవినీతినీ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల్ని ఇంకా మీరు ఫూల్స్ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ జాతి రెండు విషయాల్ని భరించలేదు. నయవంచనని. నిరంకుశత్వాన్ని. అందుకే ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మీ 25 ఏళ్ల రజితోత్సవ సభ చారిత్రాత్మక సందర్భం ఏమీ కాదు. అది కేవలం పార్టీ మీటింగ్ మాత్రమే. అప్పుడే అధికారంలోకి వచ్చేసాం అనే భ్రమల్లో మీరు ఉంటే…. అంతకన్నా అమాయకత్వం మరొకటి లేదు.

ఇట్లు మీ సామాన్యుడు