LAND TITLING ACT : వైసీపీని ఓడించబోతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

ఏపీలో పోలింగ్ కి ముందు వైసీపీకి పెద్ద షాకే తగిలింది. సిద్ధం సభలతో దూసుకుపోతున్న పార్టీ విజయ అవకాశాలను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూల్చేయబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2024 | 10:13 AMLast Updated on: May 08, 2024 | 10:13 AM

Land Titling Act To Defeat Ycp

 

 

ఏపీలో పోలింగ్ కి ముందు వైసీపీకి పెద్ద షాకే తగిలింది. సిద్ధం సభలతో దూసుకుపోతున్న పార్టీ విజయ అవకాశాలను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూల్చేయబోతోంది. చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎలా ఉంటాయో? తిమ్మిని బమ్మిని చేసి జనం బుర్రలోకి ఏ విషయం అయినా ఎలా ఎక్కించగలుగుతాడో వైసీపీకి మరోసారి తెలిసి వచ్చింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న జగన్ ఆశలపై ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నీళ్లు చల్లబోతోంది.

అందరికన్నా ముందే అభ్యర్థుల్ని ప్రకటించారు. అందరికన్నా ముందే సిద్ధం సభలతో లక్షల మంది జనంతో రాష్ట్రాన్ని ఊపేశారు. అసలు ఆ జనాన్ని చూస్తే… జగన్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. సిద్ధం సభలు పూర్తవగానే మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలు కూడా కానిచ్చేసాడు జగన్. కానీ ఈ ఉత్సాహాన్ని… ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దారుణంగా దెబ్బ కొట్టింది. ఈ యాక్ట్ ద్వారా జగన్ ఏపీలో జనం భూములు లాగేసుకుంటాడని, అందరి భూములు ప్రభుత్వపరమైపోతాయనీ… 200 గజాల స్థలంపై కూడా మీకు హక్కు ఉండదని… అలాగే ఈ స్థలాలన్నీ జగన్ తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చేసుకుంటాడని భయంకరమైన ప్రచారం జరుగుతోంది. మొదట సాదాసీదాగా ఈ విషయాన్ని జనం బుర్రలకి ఎక్కించిన టిడిపి… ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఏపీలో ప్రతి ఒక్కరూ వణికి పోయేలా చేయగలిగింది. టిడిపి సోషల్ మీడియా ప్రతి ఒక్కరిలోనూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ పై విపరీతమైన భయాన్ని సృష్టించగలిగింది. మేనిఫెస్టోలో కూడా దీని గురించి చర్చిస్తూ అధికారంలోకి రాగానే మొట్టమొదట ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.

దీనికితోడు రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండటం, స్థలాలు పొలాలు కొలిచే గుర్తింపు రాళ్లపైనా జగన్ ఫోటోనే పెట్టడంతో జనం భావోద్వేగాలపై పెద్ద దెబ్బ పడింది. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత భయంకరమైనది కాదు. ఆ యాక్ట్ ద్వారా జనం ఆస్తుల్ని, స్థలాల్ని, భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుంది అన్నది శుద్ధ తప్పు. కానీ ఆ చట్టం అమలు విషయంలో కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవం. అన్నిటికంటే ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ వివాదాలు పరిష్కరించడానికి జనం ట్రైబ్యునల్ కి వెళ్ళాలి.

కింది స్థాయిలో సివిల్ కోర్టులనేవి ఉండవు. వాటితో పనిలేదు. లాయర్లు వ్యతిరేకించడానికి ప్రధాన కారణమిదే . భూ వివాదాల పరిష్కారానికి సివిల్ కోర్టు లేకపోతే లాయర్లకు పని లేనట్లే. పట్టణాల్లో, గ్రామాల్లో లాయర్లంతా వేరే పనులు చేసుకోవాల్సిందే. అందుకే ఈ చట్టాన్ని లాయర్లే వ్యతిరేకిస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు అనుకూలంగా ఒక్క న్యాయవాది కూడా ఇప్పుడు వరకు మాట్లాడలేదు. ఈ చట్టంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నా దీనిపైన మాట్లాడటం లేదు. జగన్ సర్కార్ కూడా ప్రజలకు దీనిపై స్పష్టంగా తెలిసేలా చెప్పలేకపోయింది. దీన్ని చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా వాడుకున్నాడు.

భూమి గుర్తింపు రాళ్లపై, అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేయించుకోవడం నిజంగానే దుర్మార్గం. అది రాజరిక వ్యవస్థకు చిహ్నం. తాతలు తండ్రులు ఇచ్చిన పొలాలు, సొంతంగా కష్టపడి సంపాదించిన స్థలాలకు జగన్ ఫోటో వేసి పాస్ బుక్ ఇవ్వడం అంటే అంతకన్నా నీచం ఇంకోటి ఉండదు. అయితే ఎప్పుడో 1907 భూ సర్వే జరిగితే మళ్లీ ఇన్నేళ్ళకి తన హయాంలోనే సమగ్ర భూ సర్వే జరిగింది కాబట్టి… పాస్ పుస్తకాలపై, గుర్తింపురాళ్లపై తన బొమ్మ ఉండాలని జగన్ ఆశించినట్లు ఉన్నాడు. ఇప్పుడు అదే పెద్ద దెబ్బ అయిపోయింది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కి ఎవరు సలహా ఇచ్చారో గాని అడ్డంగా ముంచిపారేశారు.
సమగ్ర భూసర్వేకి, పాస్ బుక్ లోకి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం లేదు. కానీ ఈ మూడింటికి లింకు పెట్టి జనానికి చెమటలు పట్టించి నమ్మించగలిగింది తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్.

జగన్ కూడా చాలా ప్రభుత్వ ఆస్తులు ఇప్పటికే తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు కనుక భవిష్యత్తులో అప్పుల కోసం తమ భూముల్ని కూడా తాకట్టు పెట్టేస్తాడు అని జనం నమ్మారు. తెలుగుదేశం ఆరోపణలకి, విమర్శలకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చుకోవడంలో వైసీపీ నేతలు దారుణంగా విఫలమయ్యారు. నిజానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను టిడిపి ఆమోదించింది. పయ్యావుల కేశవులు దీనిపై సమగ్రంగా మాట్లాడారు కూడా. ఆ విషయం కూడా వైసీపీ వాళ్ళకి గుర్తులేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అంతా అయిపోయాక పయ్యావుల కేశవ్ వీడియో బయటపెట్టి… టిడిపి కూడా ఈ చట్టానికి ఆమోదం తెలిపింది బాబోయ్ అని నెత్తి నోరూ కొట్టుకున్నారు.

జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా తమ ఆస్తులు కొట్టడానికి ఏపీ సర్కార్ తెచ్చిన చట్టం అని జనం నమ్మేశారు. ఈ చట్టం మాది కాదు… ఇది కేంద్రం తెచ్చిన చట్టం అని ఎంత చెప్పాలని ప్రయత్నించినా అది జనంలోకి వెళ్ళలేదు. ఏపీ బీజేపీ నాయకులు కూడా ఎక్కడా నోరు మెదపడం లేదు. అప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముప్పు అంటూ జనంలోకి తీసుకెళ్ళారు. చంద్రబాబు అయితే ఏకంగా అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని ప్రకటన కూడా చేసారు. మా భూములపై నీ ఆధిపత్యం ఏంటి..? ఇవి మీ తాత ఇచ్చాడా? నీ అమ్మ మొగుడిచ్చాడా? అని జగన్ ని ప్రశ్నిస్తూ జనాన్ని తెలివిగా రెచ్చగొట్టారు చంద్రబాబు. జనసేన నాయకుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి వ్యతిరేకంగా రెండు, మూడు వీడియోలు కూడా విడుదల చేసేసింది ఆ పార్టీ.

డామేజ్ కంట్రోల్ కోసం వైసీపీపీ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జనానికి అవగాహన లేదు. చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు. చివరి ప్రయత్నం గా ముఖ్యమంత్రి కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రచార సభలో మాట్లాడుతున్నారు. అయినా లాభం లేదు. జరగాల్సిందంతా జరిగిపోయింది. గడిచిన 5 ఏళ్లలో భూములు తాకట్టు పెట్టి జగన్ వేల కోట్లు సమీకరించారు. రేపు అవసరమైతే తమ భూములు కూడా జగన్ తాకట్టు పెట్టేస్తాడని జనం నమ్ముతున్నారు. ఏడాదికి ఆ ఫించన్… ఈ ఫించన్ పేరుతో ఇచ్చే 30, 40 వేల రూపాయల కన్నా ముందు తమ భూములు రక్షించుకోవడం ముఖ్యమని జనం అనుకుంటున్నారు. ఇవన్నీ కలిసి వైసీపీకి కోలుకోలేనంత దెబ్బ వేయబోతున్నాయి. వైసిపి ఓడిపోతే అందుకు కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి కావడం పక్కా.