ధోనీ @ 400 తలా సరికొత్త చరిత్ర
భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 400 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.

భారత జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ ఐకాన్ ప్లేయర్ మహేంద్రసింగ్ ధోనీ మరో అరుదైన రికార్డు నెలకొల్పాడు. 400 టీ ట్వంటీ మ్యాచ్ లు ఆడిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ తో మహి ఈ ఘనత అందుకున్నాడు. 400 టీ20 మ్యాచ్‌లు ఆడిన నాలుగో భారత ఆటగాడిగా ఎంఎస్ ధోని చరిత్ర సృష్టించాడు. 400 టీ20లు ఆడిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. 456 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో 412 మ్యాచ్‌లతో దినేష్ కార్తీక్ ఉండగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 407 టీ20 మ్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. వరల్డ్ క్రికెట్‌లో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ రికార్డు విండీస్ మాజీ క్రికెటర్ కీరన్ పొలార్డ్ పేరిట ఉంది. అతను 695 మ్యాచ్‌లు ఆడాడు.
టీ20 ఫార్మాట్‌లో ధోనీకి ఘనమైన రికార్డు ఉంది. 136 స్ట్రైక్‌రేటుతో 7,566 రన్స్ చేశాడు.అందులో 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా వికెట్ కీపర్‌గా 318 ఔట్లలో మిస్టర్ కూల్ భాగమయ్యాడు. మహి 98 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి.. 126.13 స్ట్రైక్ రేట్‌తో 1617 పరుగులు చేశాడు. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని 272 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు.ఈ రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ లో అతను 137.87 స్ట్రైక్ రేట్‌తో 5377 పరుగులు చేశాడు. ఇది కాకుండా ధోని దేశీయ క్రికెట్‌లో, ఛాంపియన్స్ లీగ్‌లో జార్ఖండ్ తరపున మొత్తం 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. దీనిలో ధోని మొత్తం 449 పరుగులు చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే చెపాక్ స్టేడియంలో మరోసారి చెన్నైకి షాక్ తగిలింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 12 ఏళ్ళ తర్వాత ఈ స్టేడియంలో చెన్నైని ఓడించింది. మొదట సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించి సీఎస్కేను 154 పరుగులకే కట్టడి చేశారు. ఛేజింగ్ లో కాస్త తడబడినా… చెన్నై బౌలర్ల పేలవ బౌలింగ్ తో సన్ రైజర్స్ 18.5 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. ఈ సీజన్ లో హైదరబాద్ కు ఇది మూడో విజయం కాగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఏడో పరాజయం. ఈ ఓటమితో 2025 సీజన్ లో చెన్నై కథ ముగిసినట్టయింది.