Top story: ఉర్సా క్లస్టర్స్… వెనకున్నది వాళ్లేనా…!
ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖలో భూకేటాయింపులు చేసింది. దాన్లో విచిత్రం లేదుకానీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం కొత్త అనుమానాలు రేపింది.

ఏపీ ప్రభుత్వం టీసీఎస్‌కు విశాఖలో భూకేటాయింపులు చేసింది. దాన్లో విచిత్రం లేదుకానీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏకంగా 59 ఎకరాలు కేటాయించడం కొత్త అనుమానాలు రేపింది. టీసీఎస్ క్యాంపస్ పక్కనే ఐటీ కారిడార్‌లో మూడున్నర ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించింది ఏపీ సర్కార్. ఇంత పెద్ద ఎత్తున భూములు కేటాయించడంతో అదో పెద్ద తోపు అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే దాని బండారం బయటపడింది. ఈ కంపెనీ ఎప్పుడు రిజిస్టరైందన్న దానిపై క్లారిటీ లేదు. ఓ సమాచారం ప్రకారం ఈ ఏడాది జనవరిలో రిజిస్టరైంది. గతడాది చివర్లో అయినట్లు కూడా అనుమానాలున్నాయి. కేవలం ఇద్దరు డైరెక్టర్లతో 10లక్షల రూపాయల ఇన్వెస్ట్‌మెంట్‌తో దీన్ని ప్రారంభించారు. ఆ కంపెనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 10వేల కోట్లు పెట్టుబడులు పెట్టబోతోందని కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. అమెరికాలో పనిచేస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు ఈ ఉర్సా క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు.ఈ కంపెనీకి హైదరాబాద్, ఏపీలో ఒక్క ఆఫీస్ కూడా లేదు. ఏదో ఓ ఇంటి అడ్రస్ పెట్టారంతే.
ఉర్సా కంపెనీకి ఏపీ ప్రభుత్వం కేటాయించిన భూముల విలువ వేయికోట్లకు పైనే ఉండొచ్చంటున్నారు. 3వేల కోట్లని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించని ఓ సంస్థకు ఇన్ని భూములు ఎలా కట్టబెట్టారన్నదే బేతాళ ప్రశ్న. ఊరూపేరూ లేని ఈ సంస్థ విశాఖలో AI డేటా సెంటర్ కోసం ఏకంగా 5వేల 728 కోట్ల పెట్టుబడి పెడుతుందట. దాని ద్వారా 2వేల 5వందల మందికి ఉపాధి దక్కుతుందట. ఆఫీస్ కూడా లేని సంస్థ 5వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతానంటే ప్రభుత్వం ఏలా నమ్మిందో మరి…! ఆ కంపెనీ గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.
ఈ కంపెనీ వెనక టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీ ఉన్నారన్నది విపక్షాల ఆరోపణ. ఆయన ఇంజనీరింగ్ క్లాస్‌మెట్ ఈ సంస్థను ఏర్పాటు చేశారని దానికి తన పలుకుబడి ఉపయోగించి భూములు ఇప్పించుకున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ఈ కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని చిన్నికి చాలాకాలంగా అనుచరుడని, గతంలో ప్రజల్ని ముంచేసిన ఓ కంపెనీలో భాగస్వామి అని మాజీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. దీనిపై సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు నాని. అయితే దీనికి కౌంటర్ ఇచ్చింది టీడీపీ. కేశినేని చిన్నీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఎదురుదాడికి దిగారు బుద్దా వెంకన్న. కార్మికులకు జీతాలు, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన నువ్వు ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ ఘాటుగానే కామెంట్లు చేశారు.
ఇక అందివచ్చిన అవకాశాన్ని వైసీపీ వెంటనే అందుకుంది. లోకేష్, చంద్రబాబులు అధికారంలోకి రాగానే ఈ కంపెనీని ఏర్పాటు చేశారని దానివెనక ఉన్నది వారేనంటూ సోషల్ మీడియా వార్ మొదలుపెట్టింది. బీహార్ దాణా కుంభకోణం కంటే ఇది పెద్దదంటూ ప్రచారాన్ని ఉధృతం చేసింది. కంపెనీలకు భూ కేటాయింపుల పేరుతో ఎకరంగా 99పైసలకే తమ బినామీ సంస్థలకు కట్టుబెట్టిందంటూ బహిరంగ ఆరోపణలు చేస్తోంది వైసీపీ.
ఏపీలోనే కాదు తెలంగాణలోనూ 5వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఈ ఉర్సా క్లస్టర్స్ ప్రకటించింది. దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఇక్కడి విపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి. అక్కడ బాబు, ఇక్కడ రేవంత్‌లు ఈ సంస్థతో కుమ్మక్కయ్యారని అంటున్నాయి.రెండు తెలుగు ప్రభుత్వాలు ఇప్పుడు తమపై వచ్చిన ఆరోపణలపై క్లారిటీ ఇవ్వాలసిందే. ఊరూ పేరు లేని సంస్థకు అన్ని వేల కోట్ల భూములు ఎలా ఇచ్చారో కూటమి సర్కార్ జనానికి చెప్పాల్సిందే. లేకపోతే ఏదో జరిగిందని జనం నమ్మడం గ్యారెంటీ. ఇంత వరకు ఏపీ మంత్రుల్లో ఎవరూ దీనిపై స్పందించలేదు.. పార్టీ వర్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎంత లేట్ చేస్తే అంత డ్యామేజ్ జరుగుతుందని గుర్తుంచుకుంటే బెటర్…