KONDAPI : ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో వైసీపీ హ్యాట్రిక ఖాయామా..?

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టీడీపీ, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.. హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం.... పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.. ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని రంగంలోకి దింపటంతో రాజకీయం మరింత వేడెక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2024 | 10:52 AMLast Updated on: May 08, 2024 | 10:52 AM

Is Ycp Sure Of Hat Trick In Kondepi Constituency In Prakasam District

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టీడీపీ, వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.. హ్యాట్రిక్ సాధించేందుకు తెలుగుదేశం…. పాగా వేసేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.. ఆ నియోజకవర్గంలో గెలుపు కోసం వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ని రంగంలోకి దింపటంతో రాజకీయం మరింత వేడెక్కింది. ఎలాగైనా మరోసారి గెలిచి… తమ పట్టు నిలుపుకునేందుకు టీడీపీ కూడా కసరత్తు చేస్తోంది. ఆ నియోజకవర్గంలో ఇద్దరు నేతల ఫైట్ లో బరిలో నిలిచేదెవరు… కొండేపి పవర్ ఫైట్ లో నెగ్గేదెవరు

ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో మంత్రి వర్సెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోరు రసవత్తరంగా మారింది. అధికార పార్టీ తరపున మంత్రి ఆదిమూలపు సురేష్‌ పోటీ చేస్తుంటే… TDP నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి బరిలోకి దిగారు. మంత్రి నాన్‌లోకల్‌ అయితే…ఎమ్మెల్యే లోకల్. దీంతో ఎన్నికల పోరు లోకల్‌ వర్సెస్‌ నాన్‌ లోకల్‌ అన్నట్లుగా తయారైంది. రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నేతలున్న నియోజకవర్గం కొండేపి. బాలినేని శ్రీనివాస‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు, బుర్రా మధుసూదన్‌ యాదవ్‌, జూపూడి ప్రభాకరరావు, దామచర్ల జనార్థనరావు, పోతుల రామారావు లాంటి నేతలకు సొంత నియోజకవర్గం.

కొండేపి నియోజకవర్గంలో వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఎవరున్నా…గ్రూపుల గోల కామన్‌. ప్రతీ మండలంలో నేతల మధ్య అంతర్గత పోరు అంతకంతకు పెరిగిపోయింది. ఇన్‌చార్జ్‌గా ఎవరున్నా ఓ వర్గమే వాళ్ళతో కలిసి ఉండటం… రెండో పక్షం వాళ్ళకి అపోజిషన్ గా ఉండటం వైసీపీ హైకమాండ్‌కు తలనొప్పులు తెచ్చింది. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాదాసి వెంకయ్య…ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు. ఆ తర్వాత కొంతకాలం వైసీపీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆయన్ని తప్పించిన వైసీపీ అధిష్టానం… వరికూటి అశోక్ బాబుని నియమించింది.

ఈయన బాధ్యతలు చేపట్టాక వర్గ విభేదాలు…మరోస్థాయికి చేరాయి. అశోక్ బాబు స్వయంగా తన వర్గీయులను తీసుకుని… ప్రత్యర్థుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. దాంతో కొండేపి ఇంచార్జ్ గా అశోక్ బాబును మార్చాలంటూ వైసీపీ నేతలు…తాడేపల్లి సీఎం క్యాంపాఫీసుకి వెళ్లి ఫిర్యాదు చేశారు. కొండేపిలో గెలవాలంటే… రెండు వర్గాలను సమన్వయం చేసి.. పార్టీని గాడిలో పెట్టే నేత అయితేనే బెటర్ అని వైసీపీ భావించింది. కొత్త, పాత ఇంఛార్జులు కాకుండా కొత్తగా… మంత్రి ఆదిమూలపు సురేష్‌ ను నిలబెట్టారు జగన్. ఆయన రెండు వర్గాలను సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు.

కొండేపిలో సురేష్‌, సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి పోటాపోటీగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వీళ్ళ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో టీడీపీ కార్యక్రమాలు ఏకపక్షంగా సాగేవి. మంత్రి సురేష్ వచ్చాక వీరాంజనేస్వామిని టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ పథకాలు తమకు కలిసొస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెబుతున్నారు. కొండేపిలో సంస్థాగతంగా తమ ఓటు బ్యాంక్ ఉన్నా…పార్టీ అంతర్గత విభేదాలతో గత రెండు సార్లు ఓడామంటున్నారు. టీడీపీ వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు సురేష్. కార్యకర్తలు కూడా మూడోసారి టీడీపీని గెలవనివ్వకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నారని చెబుతున్నారు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ది తప్ప… కొండేపి నియోజకవర్గంలో…ఎలాంటి డెవలప్‌మెంట్‌ లేదంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి. సొంత నియోజకవర్గం ఎర్రగొండపాలెంలో…ఐదేళ్ల పాటు మంత్రిగా సురేష్ చేసేందేమీ లేదన్నారు. గతంలో పోటీ చేసిన సంతనూతలపాడులో కూడా ఎలాంటి అభివృద్ది జరగలేదు. ప్రతీ ఎన్నికకు ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్ వల్ల ఇక్కడి జనానికి ఉపయోగం లేదంటున్నారు వీరాంజనేయ స్వామి.
కొండేపి నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ 8 సార్లు, తెలుగుదేశం 5 సార్లు, కమ్యూనిస్టు పార్టీ ఒకసారి గెలిచాయి.

2014, 2019 ఎన్నికల్లో డోలా బాలవీరాంజనేయస్వామి గెలిచారు. ముచ్చటగా మూడోసారి గెలుపే లక్ష్యంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. కొండేపిలో ఎమ్మెల్యే స్వామితో పాటు టీడీపీ కీలక నేత దామచర్ల సత్య కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. పార్టీ తరఫున కార్యక్రమాలన్నీ దామచర్ల సత్య కనుసన్నల్లోనే జరుగుతాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్ది ఎమ్మెల్యేగా గెలవటంతో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది.

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంగమేశ్వరం ప్రాజెక్ట్ పూర్తికాలేదు. అభివృద్ది కార్యక్రమాలు పెండింగ్‌ లో ఉండటం ఆ పార్టీకి మైనస్‌గా మారే అవకాశముంది. కొండేపి నియోజకవర్గంలో అభివృద్ది అంతా తమ హయాంలోనే జరిగిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి పార్టీలు జనసేన, బీజేపీకి నామమాత్రపు బలమే ఉంది. పూర్తిగా టీడీపీ తన సొంత బలంపైనే ఆధారపడి ఉంది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉండటం ఈ నియోజకవర్గంలో టీడీపీకి కలిసొచ్చే అంశం. ఈ నియోజకవర్గంలోని ఆయన సన్నిహితులు కూడా వైసీపీని వీడి టీడీపీకి రావటం ఎమ్మెల్యే స్వామికి ప్లస్ పాయింట్.

గత రెండు సార్లు టీడీపీ అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి గెలిచినా… నియోజకవర్గం కోసం చేసిందేమీ లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ హయాంలో వచ్చిన ఫండ్స్ తో మరుగుదొడ్లు కట్టించామని చెప్పకోవటం తప్ప మిగతా అభివృద్ది ఏమీ లేదంటున్నారు. నియోజకవర్గంలో వైసీపీలో అన్ని గ్రూపులు కలసి పనిచేస్తున్నాయని చెబుతున్నారు. ఆదిమూలపు సురేష్ ఇంచార్జ్‌గా వచ్చాక పెండింగ్ పనులు పూర్తి చేశారని అంటున్నారు. నియోజకవర్గంలోని సింగరాయకొండలో నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు సురేష్.

కొండేపి నియోజకవర్గంలో వరుసగా మూడోసారి ఎవరూ గెలవలేదు. వైసీపీలో అంతర్గత విభేదాలను సెట్ చేసుకోవటంలో మంత్రి సురేష్ సఫలం కావటం… టీడీపికి మైనస్‌గా మారనుంది. వేర్వేరు పరిస్థితుల మధ్య సంతనూతలపాడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో గెలిచిన ఆదిమూలపు సురేష్ మంత్రాంగం ఫలిస్తుందా లేదా చూడాలి. మరోవైపు హ్యాట్రిక్‌ విజయాల కోసం టీడీపీ చేస్తున్న కసరత్తులు సత్ఫలితాలను ఇస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది.