5 మ్యాచ్ లలో ఓటమి, ప్లే ఆఫ్ ఛాన్స్ ఉందా ?
ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడ లేని ప్రదర్శన కొనసాగుతోంది. హోంగ్రౌండ్ లో పంజాబ్ పై భారీ టార్గెట్ ను ఛేజ్ చేసిన సన్ రైజర్స్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ పై చేతులెత్తేసింది.

ఐపీఎల్ 18వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడ లేని ప్రదర్శన కొనసాగుతోంది. హోంగ్రౌండ్ లో పంజాబ్ పై భారీ టార్గెట్ ను ఛేజ్ చేసిన సన్ రైజర్స్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ పై చేతులెత్తేసింది. కనీసం 200 ప్లస్ స్కోరు కూడా కొట్టలేకపోవడంతో ముంబై చేతిలో ఓటమి తప్పలేదు. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. స్లో వికెట్‌పై ముంబై బౌలర్ల ముందు తేలిపోయింది. సగం సీజన్ ముగిసే సరికి 7 మ్యాచ్‌లు ఆడి 5 పరాజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై భారీ విజయంతో ఈ సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ చేతిలో ఘోర పరాజయాలను చవిచూసింది. పంజాబ్ పై గెలుపుతో గాడిన పడిందనుకుంటే మళ్ళీ ముంబైకి తలవంచింది.
లీగ్ దశలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరాలంటే సన్‌రైజర్స్ ఏడింటికి 7 గెలవాలి. అప్పుడే మొత్తం 9 విజయాలు 18 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. ఈ 7 మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్ ఓడినా.. ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్‌రైజర్స్ నెట్ రన్‌రేట్ కూడా దారుణంగా ఉంది. కాబట్టి తదుపరి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించడమే కాకుండా నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపర్చుకోవాలి. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
బ్యాటింగ్ వైఫల్యమే ఈ ఐదు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమిని శాసించింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్‌ల ఘోర వైఫల్యం సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. పరిస్థితులతో సంబంధం లేకుండా బ్యాట్‌ను ఊపుతూ సన్‌రైజర్స్ బ్యాటర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. పేలవ బ్యాటింగ్‌కు తోడు చెత్త బౌలింగ్ మరో మైనస్. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం.. అనుభవం కలిగిన మహమ్మద్ షమీ తేలిపోతుండటం.. సిమర్జిత్ సింగ్, ఉనాద్కత్, ఇషాన్ మలింగా వంటి బౌలర్లపై పూర్తి నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఉండడంతో వరుస ఓటములు తప్పడం లేదు.