టచ్ లోకి వచ్చిన హిట్ మ్యాన్, రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డ్
ఐపీఎల్ 2025సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కాసేపు బ్యాట్ ఝళిపించాడు.

ఐపీఎల్ 2025సీజన్ లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై కాసేపు బ్యాట్ ఝళిపించాడు. తక్కువ సేపే క్రీజులో ఉన్నా.. ఉన్నంత సేపు అదిరిపోయే షాట్లు ఆడి తన అభిమానులను అలరించాడు. తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ ఆడిన ఐదు మ్యాచుల్లో 11.20 సగటుతో కేవలం 56 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో ఒకప్పటి హిట్ మ్యాన్ బ్యాటింగ్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఎదురుచూస్తున్నారు..
ఈ క్రమంలోనే ఈ సీజన్ లో తన ఆరో మ్యాచులో కాసేపు ధాటిగా ఆడాడు . 16 బంతుల్లో 3 సిక్సుల సాయంతో 162.50 స్ట్రైక్రేటుతో 26 పరుగులు చేశాడు. తన ఐదో బంతికి తన ట్రేడ్ మార్క్ ఫుల్ షాట్ ఆడి సిక్స్ బాదడం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కమిన్స్ బౌలింగ్ లో 3.1 ఓవర్ దగ్గర అద్భుతమైన సిక్స్ బాదాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనత సాధించాడు. సిక్సుల విషయంలో ఓ అదిరిపోయే రికార్డును సొంతం చేసుకున్నాడు. వాంఖెడె స్టేడియంలో 100 సిక్సులు బాదిన తొలి బ్యాటర్ గా నిలిచాడు. అలానే ఓవరాల్ గా ఓకే వేదికగా 100 సిక్సులు బాదిన నాలుగో బ్యాటర్ గానూ నిలిచాడు.
ఇదిలా ఉంటే రోహిత్ బ్యాటింగ్ పై నెట్టింట ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ మొత్తం మీద కలిపి కూడా 81 పరుగులే చేశాడు. అయితే మ్యాచ్ మ్యాచ్‌కి తన పర్సనల్ స్కోర్ పెంచుకుంటూ పోతున్నాడు. దీనిపైనే నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన హిట్ మ్యాన్, రెండో మ్యాచ్‌లో నాలుగు బంతుల్లో 8 పరుగులు చేశాడు. మూడో మ్యాచ్‌లో 13 బంతుల్లో 12, నాలుగో మ్యాచ్‌లో 9 బంతుల్లో 17, ఐదో మ్యాచ్‌లో 12 బంతుల్లో 18, ఆరో మ్యాచ్‌లో 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు.