కశ్మీర్‌పై విషంచిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్, పీవోకేలో యాక్షన్ మార్చాల్సిందేనా?
13 లక్షల మంది ఉన్న భారత సైన్యం పాకిస్తాన్‌ను ఏమీ చేయలేదు'. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదంతో తగలబడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యాఖ్య ఇది.

13 లక్షల మంది ఉన్న భారత సైన్యం పాకిస్తాన్‌ను ఏమీ చేయలేదు’. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదంతో తగలబడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యాఖ్య ఇది. అక్కడితో ఆగలేదు, కశ్మీర్ లక్ష్యంగా విషం చిమ్మాడు. హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేసి పాకిస్తానీల్లో జాతీయ వాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలూ చేశాడు. బలూచిస్తాన్‌ను తమ నుంచి ఎవరూ వేరు చేయలేరని పరోక్షంగా మోడీ సర్కార్‌ను టార్గెట్ చేశాడు. ఆసిమ్ మునీర్ చేసిన ఈ వ్యాఖ్యలే పీవోకే విలీనం డిమాండును ఉధృతం చేస్తున్నాయి. 13 లక్షల సైన్యం డిసైడ్ అయితే రిజల్ట్ ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు చూపించాల్సిన టైం వచ్చిందంటున్నారు నెటిజన్లు. ఇంతకూ, కశ్మీర్ కేరాఫ్‌గా పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చిపోడానికి రీజనేంటి? పీవోకే విలీనం దిశగా వ్యూహం మార్చాల్సిన సమయం వచ్చిందా? టాప్ స్టోరీలో చూద్దాం..
ఇస్లామాబాద్‌లో ఓవర్సీస్ పాకిస్తానీస్ కన్వెన్షన్‌లో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కన్నింగ్ కామెంట్స్ ఇవి. “ప్రతి విషయంలో మనం హిందువులకంటే విభిన్నవారిమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం. మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనం రెండు విభిన్న దేశాలు, ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్తాన్ చరిత్రను మరిపోవద్దని మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మరిచిపోవద్దని ప్రతిఒక్కరినీ కోరుతున్నాను” అని ఆవేశపూరిత ప్రసంగం చేశాడు. అక్కడితో ఆగలేదు.. కశ్మీర్‌పైనా కారుకూతలు కూశాడు.
‘మన వైఖరి స్పష్టంగా ఉంది.. కశ్మీర్ మన జీవనాడి. అది మన జీవనాడిగానే ఉంటుంది. మేము కశ్మీర్‌ని మర్చిపోం. కశ్మీరీ సోదరుల పోరాటానికి బాసటగా నిలుస్తాం’ అని హద్దులు దాటాడు. అక్కడితో కూడా ఆగని మునీర్.. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ భారత్ సైన్యాన్ని టార్గెట్ చేశాడు. పాకిస్తాన్‌లో ఉగ్రవాదం కారణంగా పెట్టుబడులు రావని కొంతమంది భయపడుతున్నారని పేర్కొన్నా డు. ‘ఉగ్రవాదులు దేశ భవితవ్యాన్ని చెరిపేయగలరా? 13 లక్షల మంది ఉన్న భారత సైన్యం కూడా మమ్మల్ని భయపెట్టలేదు.. అలాంటిది ఈ ఉగ్రవాదులు మన సైన్యాన్ని ఏమీ చేయ లేరు’ అని వ్యాఖ్యానించాడు. బలూచిస్తాన్ వేర్పాటువాదంపై కూడా మునీర్ రియాక్ట్ అయ్యాడు. ‘బలూచిస్తాన్ పాకిస్తాన్‌కు గర్వం. మీరు దానిని వేరు చేయలేరు.. పదిహేను తరాలైనా దాన్ని సాధించలేరు.. మేము ఈ ఉగ్రవాదులను తొందరలోనే ఓడిస్తాం. పాకిస్తాన్ ఎప్పటికీ పడిపోదన్నాడు. బలూచిస్తాన్ అంశంలో మునీర్ వ్యాఖ్యలు భారత్‌ను ఉద్దేశించి చేసినవే. ఎందుకంటే, బలూచిస్తాన్ వేర్పాటువాదులకు భారత్ మద్దతిస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది.
ఇప్పటివరకూ పాకిస్తాన్‌లో ఆవేశం స్టార్ అంటే షహబాజ్ షరీఫ్ పేరే వినిపించేది. ఆసిమ్ మునీర్ ఆవేశం చూశాక.. ఇతడు షరీఫ్‌ను కూడా మించిపోయాడనిపిస్తోంది. ప్రగల్భాలు పలకడంలో పాకిస్తాన్ పాలకులను మించిపోయాడు మునీర్. ఈ మొత్తం వ్యవహారంలో విదేశాల్లో పాకిస్తాన్ పౌరుల్ని ఉత్సాహపరచాలన్న ఉద్దేశం కంటే భారత్‌పై విషం చిమ్మాలన్న లక్ష్యమే ఎక్కువ కనిపించింది. దీనికి కారణం లేకపోలేదు.. ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికగా శాంతి పరిరక్షక సంస్కరణల అంశంపై జరిగిన డిబేట్లో పాకిస్తాన్ కశ్మీర్‌పై చేస్తున్న విష ప్రచారాన్ని భారత్ ఎండగట్టింది. తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అక్రమంగా ఆక్రమించిన పీవోకేను ఖాళీ చేయాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అది మనసులో పెట్టుకునే ఆసిమ్ మునీర్ ఇప్పుడు ఇంతగా ఆవేశంతో ఊగిపోయాడు.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆ దేశ సైన్యమే నడిపిస్తోందనేది ఓపెన్ సీక్రెట్. మునీర్ వ్యాఖ్యలు కూడా పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు దిశానిర్దేశం చేసేవిగానే కనిపిస్తున్నాయి. భారత్ పట్ల వారి కుటిల వైఖరి ఎప్పటికీ మారదని పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు మరోసారి రుజువు చేశాయి. రెండు జాతుల సిద్ధాంతాన్ని పునరుద్ఘాటిస్తూ పాకిస్తాన్ ప్రజలలో జాతీయ భావనను మరింత బలపరచాలనేది ఆసిమ్ మునీర్ ఉద్దేశం. దశాబ్దాలుగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్ వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో పాక్ బుద్ది మారలేదని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తాయి. మరి ఏంచేస్తే పాకిస్తాన్ బుద్ధి మారుతుంది? పాకిస్తాన్ దారికి రావాలంటే ఒకే ఒక్క ఆప్షన్ ఉంది. అది పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడమే. లండన్ వేదికగా జైశంకర్ ఆ మాటే చెప్పారు. పీవోకే విలీనంతో కశ్మీర్ వివాదానికి ఎండ్‌కార్డ్ పడటం ఖాయం అన్నారు. అది త్వరలోనే జరుగుతుందనీ చెప్పారు. ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు భారత విదేశాంగ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ సైతం అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌తో పాకిస్తాన్‌కి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పారు.
జమ్మూకశ్మీర్‌ను వేగంగా అభివృద్ధి చేయడంపై ఫోకస్ చేసిన మోడీ సర్కార్.. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయంలోనూ రీసెంట్‌గా గేమ్ ఛేంజ్ చేస్తోంది. పాకిస్తాన్ నిండా మునిగిన ఈ టైం.. పీవోకే విలీనానికి సరైందిగా భావిస్తోంది. అందుకే, ఐక్యరాజ్యసమితి వంటి వేదికలపై పాకిస్తాన్ పని పడుతోంది. పరోక్షంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనానికి వేళైందని పశ్చిమ దేశాలకు హింట్స్ ఇస్తోంది. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే కశ్మీర్ వివాదాన్ని రాజేసిన వాళ్లు పీవోకే విలీనం విషయంలో వేలు పెట్టొద్దని ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇస్తోంది. అదిమాత్రమే కాదు.. కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో బాహుబలి యుద్ధ విమానాల్ని మోహరించింది. చైనాతో ఉద్రిక్తతలు తగ్గడంతో అక్కడి సైన్యాన్ని కూడా పాక్ బోర్డర్‌లోనే మోహరిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే ఎనీటైం యాక్షన్‌లోకి దిగిపోయేలా ఏర్పాట్లు చకచకా జరు గుతున్నాయి. సో.. త్వరలోనే పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనం విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో 13 లక్షల మంది ఉన్న భారత సైన్యం తమనేమీ చేయలేదు వంటి వ్యాఖ్యలు చేస్తే.. రిజల్ట్ ఇస్లామాబాద్ ఊహకందని రేంజ్‌లో ఉండటం ఖాయం.