హోంగ్రౌండ్ లో మరో విక్టరీ ,ముంబై టీమ్ నయా హిస్టరీ

ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ మెల్లిగా పుంజుకుంటోంది. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న వేళ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2025 | 01:39 PMLast Updated on: Apr 18, 2025 | 1:39 PM

Another Victory At Home Mumbai Team Makes New History

ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ మెల్లిగా పుంజుకుంటోంది. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతున్న వేళ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను నిలువరించింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఐపీఎల్‌లో ప్రత్యేక రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. ఒకే మైదానంలో అత్యధిక మ్యాచ్ లు గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను వెనక్కి నెట్టింది.

వాంఖడే స్టేడియంలో ముంబైకి ఇది 47వ మ్యాచ్. వాంఖడే స్టేడియంలో 47 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గతంలో ఈ రికార్డు కోల్‌కతా నైట్ రైడర్స్‌ పేరిట ఉండేది. ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఇప్పటివరకు 28 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కోల్ కత్తా తర్వాత రాజస్థాన్ రాయల్స్ 31 మ్యాచ్ లలో 24 విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చిన్నస్వామీ స్టేడియంలో 41 మ్యాచ్ లు ఆడి 21 మ్యాచ్ లలో గెలిచింది.

అటు సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా 32 మ్యాచ్ లు ఆడి 21 విజయాలను అందుకుంది. తద్వారా హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. కాగా చెన్నై సూపర్ కింగ్స్ తన హోం గ్రౌండ్ లో 31 మ్యాచ్ లు ఆడి 21 సార్లు గెలిచింది. కాగా సన్ రైజర్స్ తో మ్యాచ్ లో ముంబై ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో ముంబై 18.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసి గెలిచింది.