TOP STORY: టీడీపీ మంత్రితో రాజీకి రోజా…?
వైసీపీ మాజీ మంత్రులకు అరెస్టు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో.. అర్థం కాక మాజీ మంత్రులు భయం భయంగా బ్రతుకుతున్నారు.

వైసీపీ మాజీ మంత్రులకు అరెస్టు భయం పట్టుకుంది. ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో.. అర్థం కాక మాజీ మంత్రులు భయం భయంగా బ్రతుకుతున్నారు. ఇటీవల విడదల రజిని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల దూకుడు చూసిన తర్వాత మాజీ మంత్రుల్లో భయం మొదలైంది. విడదల రజిని తర్వాత ఒకరిద్దరు మాజీ మంత్రులపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంది అనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో కొడాలి నాని అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
ఇక చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా విషయంలో కూడా ఇదే దూకుడు ఉండే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు రోజా తనను తాను కాపాడుకునేందుకు చాలా కష్టాలు పడుతున్నట్టు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడు టిడిపి తో రాజీ కోసం ఆర్కే రోజా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రాయలసీమకు చెందిన అధికార పార్టీ నేత ఒకరితో ఆమె సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆర్కే రోజాను ఆయన తన ఇంటికి కూడా ఆహ్వానించారట. ఆమెతో రాజకీయ చర్చలే కాకుండా.. ఆమెకు సంబంధించిన పనులు కూడా ఆయన చేసి పెట్టినట్లు సమాచారం. విజయవాడలోని సదరు మంత్రి ఇంటి కి వైకాపాకు చెందిన రోజా వెళ్లడం, ఆ తర్వాత ఆమె పనులు చకచగా జరిగిపోవడం.. రాజకీయ వర్గాల్లో అలాగే అధికారుల్లో చర్చకు దారితీసింది. టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. మంత్రి నారా లోకేష్ పై ఆమె గతంలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అలాంటి రోజాను ఏ విధంగా మంత్రి ఇంటికి రానిచ్చారు అనేదే ఇప్పుడు ప్రధానంగా వినపడుతున్న ప్రశ్న. రోజా మంత్రిగా ఉన్న సమయంలో కూడా లోకేష్ ను ఎంతో అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా.. ఏకవచనంతో లోకేష్ ను వాడు వీడు అంటూ సంబోధించారు. అసెంబ్లీలో కూడా చంద్రబాబు గురించి, ఆయన భార్య గురించి, లోకేష్ భార్య గురించి కూడా రోజా అసహ్యంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.
మరి అలాంటి రోజాను ఏ విధంగా మంత్రి ఇంటికి రానిచ్చారు.. అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. తమ పార్టీ అధికారంలోకి వస్తే రోజా సంగతి చూస్తామని అప్పట్లో టిడిపి నేతలు కీలక వ్యాఖ్యలు చేసేవారు. ఆమెను బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అధికారంలోకి వచ్చి పది మాసాలు అయినా సరే.. ఇప్పటివరకు ఆమెను ఏమీ చేయలేకపోయారు. ఈ బాధ కార్యకర్తల్లో ఎక్కువగా ఉంది. ఒకవైపు కార్యకర్తలు ఈ విధంగా బాధపడుతుంటే మంత్రి.. రోజాను ఇంటికి ఎలా పిలుస్తారు అనేదే టిడిపి కార్యకర్తల్లో ఆగ్రహానికి కారణమవుతోంది.
అయితే రోజా ఇప్పుడు టిడిపి తో రాజీ కోసం చూస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో రోజా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఆమెపై ఫిర్యాదులు కూడా అందడంతో.. కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీనితోనే రోజా సదరు మంత్రితో రాజీ కోసం ప్రయత్నం చేశారని, ఈ సమయంలోనే ఆ మంత్రి కూడా ఆమె విషయంలో సానుకూలంగా వ్యవహరించి ఇంటికి ఆహ్వానించారని అంటున్నారు.