Top story: గ్రోక్ ట్రాప్ లో పడకండి.. ఇది మస్క్ మస్కా

మనకు నచ్చనివాడిని.. మనతో పాటు పక్కన ఇంకోడు వచ్చి తిడితే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. మనలను వాడివైపు లాక్కోవడానికి కూడా ఎవడైనా ముందు మన శత్రువును మన ముందే తిడతాడు. అ

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2025 | 10:00 PMLast Updated on: Apr 16, 2025 | 10:00 PM

Dont Fall Into The Grok Trap This Is A Musk Muska

మనకు నచ్చనివాడిని.. మనతో పాటు పక్కన ఇంకోడు వచ్చి తిడితే ఆ ఆనందం వేరే లెవెల్లో ఉంటుంది. మనలను వాడివైపు లాక్కోవడానికి కూడా ఎవడైనా ముందు మన శత్రువును మన ముందే తిడతాడు. అదో ట్రాప్. ఇలాంటి ట్రాప్ లు వేయడంలో గతంలో మార్కెటింగ్ స్ట్రాటజీలుగా వాడేవారు. అయితే దానికి అడ్వర్ టైజ్ మెంట్లు వాడేవారు. కాని ఇప్పుడు అంతా సోషల్ మీడియా, మీడియా మయం. ఏం జరగాలన్నా.. ముందు రచ్చ అక్కడే జరగాలి. అదే స్ట్రాటజీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, లీడర్లు, కంపెనీలు అందరూ ఫాలో అయిపోతున్నారు. ముందు మన పేరు మోగాలి అంటే మంచో చెడో ఒక ఎక్స్ ట్రీమ్ లెవెల్లో ఏదో ఒకటి చేయాలి. అలా చేస్తేనే అందరూ మనవైపు చూస్తారు. అందరూ లైన్లోకి వచ్చాక.. మనం ఏ ఆట అయినా ఆడించొచ్చు.

రిలయెన్స్ జియో మొబైల్ విషయంలో అదే జరిగింది. ఇది అందరికీ తెలుసు. ఇప్పుడు ఎలాన్ మస్క్ అదే స్ట్రాటజీతో వచ్చేశాడు. తన ఎక్స్ ఎఐ టూల్ గ్రోక్ తో ఇండియాను ట్రాప్ చేసేస్తున్నాడు. అందుకు మనోడు సెలెక్ట్ చేసుకున్న మార్గమే ఇప్పుడు ఆశ్చర్యకరం. ఒకవైపు ట్రంప్, మస్క్ వ్యాపార మిత్రులు.. అలాగే తమ టీమ్ లోకి మోదీని కూడా చేర్చేసుకున్నారు. కాని తన గ్రోక్ వ్యాపారం కోసం అదే మోదీని టార్గెట్ చేశాడు మస్క్. ఇండియాలో బిజెపికి, మోదీకి వ్యతిరేకంగా నోరు విప్పాలంటే భయమే. ఆ పని తాను చేస్తే.. అందరూ తన వైపు చూస్తారు. అలాగే బిజెపి, మోదీ వ్యతిరేకులంతా తన పేరు మోగించేస్తారు. అలా ముందు పాపులర్ అయిపోయాక.. తర్వాత అల్గారిథమ్ మార్చొచ్చు.. చాట్ బాట్ కంటెంట్ మార్చొచ్చు… అప్పుటికే హిప్నటైజ్ అయిపోయిన జనాలను.. ఓ ఆట ఆడుకోవచ్చు. అదే ఇఫ్పుడు నడుస్తుందని చెప్పాలి.

ఇండియాలో చాట్ జీపీటీ టూల్ బాగా వెళ్లిపోయింది. గ్రోక్ ఇప్పుడు దాని కాంపిటీషన్ తట్టుకుని జనంలోకి పోవడానికి టార్గెట్ మోదీ ఆపరేషన్ మొదలెట్టింది. మోదీని విమర్శించేవారు, ప్రతిపక్షాలు ఏం చెబుతాయో.. అవే గ్రోక్ చెబుతోంది. దీంతో గ్రోక్ అలా చెప్పింది ఇలా చెప్పింది అంటూ .. వావ్ అంటూ ప్రతిపక్ష పార్టీల వారంతా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. వారు మోదీకి డ్యామేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. కాని గ్రోక్ కు వారు ఫ్రీగా ప్రచారం చేసిపెడుతున్నారని వాళ్లకు కూడా తెలియడం లేదు. పోనీ అలా అని గ్రోక్ ఏమైనా సీక్రెట్స్ బయటపెట్టిందా అదీ లేదు. ప్రతిపక్షాలు ఏ విమర్శలు చేస్తాయో అవే ఫ్యాక్ట్స్ అన్నట్లు రిపోర్ట్ ఇస్తుంటే.. చూశారా గ్రోక్ కూడా అదే చెప్పింది చూడండి అంటూ వీళ్లు గంతులేస్తున్నారు.

డీమానిటైజేషన్ ఫెయిలైందనే వాదన ఉంది. నల్లధనం ఆగలేదు.. టెర్రరిజం ఆగలేదు.. అది ఫెయిల్ అని విమర్శలు ఉన్నాయి. వాటినే గ్రోక్ చెబుతోంది. అలాగే స్విస్ బ్యాంకులో నల్లథనం తెస్తే.. ఒక్కోరికి 15 లక్షలు అకౌంట్లో వేయొచ్చని మోదీ ఎన్నికల ప్రచారంలో అప్పట్లో చెప్పారు. కాని అది జరగలేదు. దాని మీద మళ్లీ మాట్లాడలేదు. అదే విషయం గ్రోక్ చెబుతోంది. ఏడాదికి కోటి ఉద్యోగాలు అని హామీ ఇచ్చారు.. కాని నిరుద్యోగం పెరిగిందని రిపోర్ట్. ఇలా ఇవన్నీ ప్రతిపక్షం ఎప్పుడూ చెప్పేవే.. ఇప్పుడు అవే గ్రోక్ చెప్పినంత మాత్రాన అథెంటిసిటీ వచ్చేస్తుందా? అంటే లేదనే చెప్పాలి.

ఇక గుజరాత్ అల్లర్లు, మతతత్వం.. గోరక్షణ ఇలాంటి వాటి మీద బిజెపి, మోదీ అభిప్రాయాలకు, ఇతర పార్టీలకు చాలా తేడా ఉంది. జరిగినవాటిని జరగలేదని ఎవరూ చెప్పలేదు. కారణాలు, నేపథ్యాలు మార్చుకుని ఎవరికి వారు అనుకూలంగా చెప్పుకుంటారు. రేపు ఇదే గ్రోక్.. ప్రతిపక్షాలన్నీ ముస్లింల ఓట్ల కోసం సిద్ధాంతాలు మార్చుకుని.. మాట్లాడుతున్నారని రిపోర్ట్ ఇస్తే.. దానిని ఎలా ఖండిస్తారు… ఖండించలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేదంతా కరెక్ట్ అని చప్పట్లు కొట్టాక.. ఆ పని మాత్రం చేయలేరు.

రేపు గ్రోక్ చాట్ బాట్ కంటెంట్ మార్చి.. మోదీకి అనుకూలంగా చెప్పడం మొదలెడితే… ఈ డబ్బా కొట్టుకుని సంబరాలు చేసుకునేవారంతా అదంతా తప్పు అని చెప్పగలరా? ఇప్పుడు సపోర్ట్ చేసి.. అప్పుడు ఇది ఫేక్ అని అనగలరా? అందుకే మనకు నచ్చనోడి మీద మనం చెప్పిందే చెబుతున్నారని నెత్తి మీద పెట్టుకుంటే.. ఆ గ్రోక్ ట్రాప్ లో పడినట్లే అవుతుంది. ఆ విషయం వీరికి అర్ధమవుతుందో లేదో చూడాలి మరి. ఖచ్చితంగా ఇదే గ్రోక్ రేపు మోదీకి అనుకూలంగా పని చేస్తుంది.. అప్పుడు ఈ సోకాల్డ్ అపోజిషన్ వారంతా ఇదంతా ట్రాప్, వ్యాపారం, మస్క్ మస్కా అంటూ నెత్తి కొట్టుకుంటారు. అందుకే ఇప్పటికైనా.. గ్రోక్ ను అదే పనిగా ఆకాశానికెత్తడం.. దానిని అడ్డం పెట్టుకుని అంతా కరెక్టే అని ఫీలయిపోవడం తగ్గించుకుంటే మంచిది.