KCR-KTR: కేసీఆర్ ఫ్యామిలీలో టికెట్ల చిచ్చు..? అభ్యర్థుల ఎంపికపై కేటీఆర్ అలిగారా..?
కేసీఆర్ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించారు. అయితే గులాబి తోటలో ఆ లిస్టుపై అసమ్మతి స్వరాలు రేగాయి. ఆ జాబితాపై కొందరు పార్టీ నేతలకే కాదు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కే అభ్యంతరాలున్నాయని చెబుతున్నారు.
KCR-KTR: కేసీఆర్-కేటీఆర్ మధ్య దూరం పెరిగిందా..? తండ్రీ కొడుకుల మధ్య కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరలేదా..? అందుకే ఆయన అమెరికా వెళ్లారా…? ఇంతకీ కేటీఆర్ అభ్యంతరాలేంటి..? ఆ జాబితాలో ఎవరి పేర్లు కేటీఆర్‌కు నచ్చలేదు..?
సీటు ఫైటుతో బీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలేమో కానీ కేసీఆర్ ఫ్యామిలీలో మాత్రం చిచ్చు రేపినట్లే కనిపిస్తోంది. కేసీఆర్, కేటీఆర్ మధ్య టికెట్ల వ్యవహారం కాస్త దూరం పెంచినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో లేటెస్ట్ టాక్. కేటీఆర్ అందుకే అమెరికా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు.
కేటీఆర్ అభ్యంతరాలేంటి..?
కేసీఆర్ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల శంఖారావం పూరించారు. అయితే గులాబి తోటలో ఆ లిస్టుపై అసమ్మతి స్వరాలు రేగాయి. ఆ జాబితాపై కొందరు పార్టీ నేతలకే కాదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌కే అభ్యంతరాలున్నాయని చెబుతున్నారు. అది నచ్చకే కేటీఆర్.. జాబితా ప్రకటనకు ముందే అమెరికా వెళ్లిపోయినట్లు చెబుతున్నారు. లిస్టులో 20 నుంచి 30 మంది పేర్లపై కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వారి పేర్లు తొలగించాలని కేసీఆర్‌ను కోరినా ఆయన వినలేదంటున్నారు. కేసీఆర్ లెక్కలు కేసీఆర్‌వి. కేటీఆర్ లెక్కలు కేటీఆర్‌వి. గెలవని వారిని నిలబెట్టి అధికారాన్ని వదులుకుంటామా అన్నది కొడుకు మాట. కానీ టికెట్లు ఇవ్వకపోతే మొదటికే మోసం వస్తుందన్నది తండ్రి మాట.
వీళ్లు గెలవరా..?
ఓడిపోయేవారికి టికెట్లు ఇవ్వడం కేటీఆర్‌కు ఇష్టం లేదంటున్నారు. సర్వే నివేదికల ప్రకారం కొంతమంది ఖచ్చితంగా గెలవరని తెలిసినా టికెట్లు ఇవ్వడాన్ని కేటీఆర్ వ్యతిరేకించారు. మెదక్‌లో పద్మాదేవేందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, చెన్నూరు నుంచి బాల్క సుమన్, మహబూబాబాద్‌లో శంకర్ నాయక్, ముషీరాబాద్‌లో ముఠా గోపాల్, బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి గెలవరని సర్వే నివేదికలు చెప్పాయంటున్నారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ పరిస్థితి కూడా అంత సక్కగా ఏం లేదు. ఇంకా మరికొందరు కూడా కచ్చితంగా ఓడిపోతారని నమ్ముతున్నారు. వారిలో కొందరు కేటీఆర్ సన్నిహితులు కూడా ఉన్నారు. అయినా సరే గెలవరనే నమ్మకం లేనివారికి సీట్లు ఇవ్వొద్దని ఆయన పట్టుబట్టారు. అవసరమైతే తర్వాత ఏదో ఓ పోస్టు ఇస్తే సరిపోతుందని సూచిస్తున్నారు. కానీ, కేసీఆర్ వినలేదు. తన మాట నెగ్గకపోవడంతో కేటీఆర్ కాస్త అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది.
వారిని దూరం చేసుకోవడం ఇష్టం లేదా..?
కొంతమంది నేతలను పార్టీ దూరం చేసుకోవడం వర్కింగ్ ప్రెసిడెంట్‌కు ఇష్టం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తుమ్మలకు టికెట్ ఇవ్వాలన్నది కేటీఆర్ ప్రతిపాదన. సీనియర్ నేత తుమ్మలతో పార్టీకి లాభమే కానీ నష్టం ఉండబోదని భావించారు. ఖమ్మం జిల్లాలోనే కాకుండా తెలంగాణలో ఐదారు సీట్లలో సామాజికవర్గాన్ని ప్రభావితం చేయగలరు. గతంలో ఓసారి కేటీఆర్ ఖమ్మం వెళ్లి మరీ తుమ్మలతో మాట్లాడి వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం టికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలాగే ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటిపైనా కేటీఆర్ పాజిటివ్‌గానే ఉన్నారు. కానీ పెద్దాయనకు మాత్రం అది ఇష్టం లేదు. దీంతో కేటీఆర్ అయిష్టంగానే పొంగులేటిని వదులుకోవాల్సి వచ్చింది.
ఎవరి వాదనేంటి..?
తెలిసి తెలిసీ ఓడిపోయే వారిని జాబితాలో పెట్టడం ఎంత వరకు సమంజసమన్నది కేటీఆర్ ప్రశ్న. తర్వాత వారిలో కొందరిని మారుద్దామని కూడా కేసీఆర్ చెప్పారంటున్నారు. అయితే అలా చేయడం వల్ల గందరగోళం పెరుగుతుంది కానీ తగ్గదన్నది కేటీఆర్ వాదన. ఒకటి, రెండు సీట్లు అయితే ఓకే కానీ అంతమందిని ఆ సమయంలో మార్చడం ద్వారా దెబ్బతింటామన్నది ఆయన భయం. కానీ కేసీఆర్ ఆలోచన వేరుగా ఉంది. దీంతో పార్టీ అధినేతతో విభేదించలేకే కేటీఆర్ సైలెంటైపోయారంటున్నారు. వారం రోజుల్లో తిరిగి వస్తారని భావించినా ఇంకా ఎక్కువ సమయమే ఆయన అమెరికాలో ఉండటానికి కారణం అసంతృప్తేనంటున్నారు. నిజానికి కేటీఆరే అభ్యర్థులను ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఆయన మాత్రం సమయానికి అందుబాటులో లేకుండా పోయారు. కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో చాలామంది నేతలు కవిత చుట్టూ, హరీష్ చుట్టూ తిరిగారు. కేటీఆర్ ఫోన్‌లోనూ అందుబాటులోకి రాలేదని సమాచారం. మరి టికెట్ల విషయంలో కేటీఆర్ రైటా లేక కేసీఆర్ రైటా..? ఎవరి వాదన కరెక్ట్..? తెలియాలంటే ఎన్నికలయ్యే వరకు ఆగాల్సిందే మరి.