సజ్జలకు బిగ్ షాక్.. సతీష్ రెడ్డికి జగన్ కీలక పదవి
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి శకం ముగిసిందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒకవైపు పార్టీలో మరోవైపు ప్రభుత్వంలో సజ్జల కీలకంగా వ్యవహరించారు.

వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి శకం ముగిసిందా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఒకవైపు పార్టీలో మరోవైపు ప్రభుత్వంలో సజ్జల కీలకంగా వ్యవహరించారు. జగన్ కంటే కూడా పార్టీ నేతలు ఆయనకే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డి సాధించిన సందర్భాలు ఉన్నాయి. కీలక నాయకులను పార్టీకి దూరం చేసిన వారిలో సజ్జల ముందు వరుసలో ఉంటారు.
వైసీపీలో అత్యంత కీలక నేతగా చెప్పే విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడానికి రామకృష్ణారెడ్డి కారణమనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. అయితే ఇప్పుడు జగన్ పార్టీని దృష్టిలో పెట్టుకుని రామకృష్ణారెడ్డిని పార్టీకి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొంతమంది కీలక నేతల ఫిర్యాదులు కూడా జగన్ వద్దకు రావడంతో అనవసరంగా రిస్క్ చేయవద్దని, ఇప్పటివరకు జరిగిన నష్టం చాలని జగన్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వంలో ఉన్న సమయంలో కూడా ఆయనపై జగన్ కు ఎన్నో ఫిర్యాదులు అందాయి.
పార్టీ నేతలు అందరూ తన మాటే వినాలి అనే పట్టుదలలో కూడా సజ్జల ఉండేవారు. పలు శాఖల సమీక్ష సమావేశాలు కూడా ఆయన నిర్వహించడం పట్ల పార్టీ కీలక నేతల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. ఇక వైసిపి నుంచి కొంత మంది నాయకులు బయటికి వెళ్లిపోవడానికి కూడా ఆయనే కారణమనే భావన సైతం ఉంది.. అయితే ఇప్పుడు పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న జగన్.. సజ్జల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రామకృష్ణారెడ్డి వైసీపీలో సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
ఆ బాధ్యతలనుంచి ఆయనను పక్కన పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్ రెడ్డి కూడా పార్టీలో సోషల్ మీడియా వ్యవహారాలను చూస్తున్నారు. ఆయన కారణంగా కూడా పార్టీలో ఎక్కువ నష్టమే జరిగింది అనే భావన ఉంది. దీనితో తండ్రీ కొడుకులను పక్కన పెట్టేందుకు జగన్ రెడీ అయిపోయారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సమన్వయ బాధ్యతలను పులివెందుల నియోజకవర్గానికి చెందిన సతీష్ రెడ్డికి అప్పగించాలని జగన్ భావిస్తున్నట్లు వైసీపీలో ప్రచారం మొదలైంది.
ఆయనకు సౌమ్యుడుగా గుర్తింపు ఉంది. ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గం బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. గతంలో టిడిపిలో ఉన్న సతీష్ రెడ్డి.. జగన్ పై పోటీ కూడా చేశారు. 2019లో టిడిపి ఓటమి తర్వాత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సతీష్ రెడ్డి పార్టీ మారారు. జగన్ కూడా అప్పటినుంచి సతీష్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యతిస్తూ వచ్చారు.. ఇక పార్టీకి విధేయుడుగా ఆయనకు పులివెందుల నియోజకవర్గంలో పేరు ఉంది. దీంతో పులివెందుల నియోజకవర్గానికి ఆయనను పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ సమన్వయ బాధ్యతలను అప్పగించాలని జగన్ నిర్ణయించారు.
పార్టీ కీలక నేతలతో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉండటంతో ఇది భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి ఉపయోగపడుతుందని కూడా జగన్ భావిస్తున్నట్లు సమాచారం. అలాగే పార్టీకి దూరంగా ఉన్న నేతలను కూడా దగ్గర చేయగలిగే సామర్థ్యం సతీష్ రెడ్డి ఉందని జగన్ బలంగా నమ్ముతున్నారట. అందుకే ఆయనకు సమన్వయ బాధ్యతలను అప్పగించి పార్టీని గాడిలో పెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తుంది.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. అందుకే సతీష్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ పట్టదలగా ఉన్నారట. వైసీపీ అధికారం కోల్పోయిన సరే సతీష్ రెడ్డి మీడియాలో కనబడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆయన దూకుడుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి తోడు ఆయనపై ఎటువంటి కేసులు లేవు. ప్రస్తుతం సజ్జల కేసుల భయంతో బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే సతీష్ రెడ్డిని పార్టీలో ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.