Top story: మోడీని కొట్టే సత్తా కాంగ్రెస్‌కు లేదా ? వ్యూహాల్లో పూర్తిగా విఫలమవుతోందా ?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...మరో పదేళ్ల పాటు ఎదురే లేదా ? బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదా ? ఇండియా కూటమితో జట్టు కట్టేందుకు...ప్రాంతీయ పార్టీలు వెనుకంజ వేయడానికి కారణాలేంటి ?

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…మరో పదేళ్ల పాటు ఎదురే లేదా ? బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదా ? ఇండియా కూటమితో జట్టు కట్టేందుకు…ప్రాంతీయ పార్టీలు వెనుకంజ వేయడానికి కారణాలేంటి ? ప్రస్తుతమున్న ఇండి కూటమికి…కాషాయ పార్టీని మట్టి కరిపించడం అంత ఈజీ కాదా ? తన బలంపై కాకుండా ప్రత్యర్థుల బలాన్ని కాంగ్రెస్ నమ్ముకుందా ? ఎన్నాళ్లీలా…నెట్టుకొస్తుంది ?
అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ…రెండు పాటు ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించుకుంది. దీనికి సంబర పడిపోతోంది తప్పా..వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి ? ప్రధాని మోడీ వేవ్‌కు ఎలా అడ్డుకట్ట వేయాలి ? ప్రజల్లోకి ఎలా వెళ్లాలి ? ప్రభుత్వ వైఫల్యాలను ఎలా ఎండగట్టాలి ? అన్న అంశాలపై మాత్రం ఎలాంటి చర్చ జరగలేదు. కాంగ్రెస్ ఇలాగే వ్యవహరిస్తే…2029లోనూ బీజేపీ విజయం నల్లేరు మీద నడకేనన్న ప్రచారం జరుగుతోంది. కాషాయ పార్టీ బలం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారుతూనే ఉంది. ప్రస్తుతం దేశంలో మూడంటే మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో మాత్రమే. ఇవేమీ పెద్ద రాష్ట్రాలు కూడా కాదు. ప్రత్యర్థి వైఫల్యాలపై ఆధారపడి గెలవాలని చూస్తోంది తప్పా…సొంత వ్యూహాలతో గెలుపొందాలనే ఆలోచనే ఆ పార్టీకి లేదు. బీజేపీ, మోడీ విధానాలతో విసిగిపోయి…తమకే ఓటు వేస్తారనే ఆలోచనలో ఉంది హస్తం పార్టీ. సొంతంగా గెలుస్తామనే ఆశలు ఆ పార్టీ నేతలకు ఇసుమంతైనా ఆశ కూడా లేదు.
పార్టీని నడిపించలేకపోతున్న రాహుల్
రాహుల్ గాంధీలో ఎక్కడా నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదు. పరిపక్వత ఉన్న నాయకుడిగా వ్యవహరించడం లేదు. పార్టీ నేతలను నడిపించడంలో విఫలమవుతున్నారు. ఆయన నాయకత్వంలో పోటీ చేసిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో…కాంగ్రెస్ ఘోర పరాభవం ఎదురైంది. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారని భావించినా అది జరగలేదు. కసితో పని చేస్తారని భావిస్తే…కాంగ్రెస్ అధ్యక్ష పదవికే రాజీనామా చేశారు. ఆ స్థానంలో సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేను కూర్చోబెట్టారు. రాహుల్ గాంధీ…లోక్‌సభ కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరిస్తున్నారు.
వ్యూహాల్లో కాంగ్రెస్ విఫలం
బీజేపీ వ్యూహాల ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పోటీ పడలేకపోతోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే…అక్కడ ప్రత్యేక పార్మూలాను అమలు చేస్తోంది. హర్యానాలో ఒక ఫార్ములాతో గెలిస్తే…మహారాష్ట్రలో మరో స్ట్రాటజీని అమలు చేసింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమవుతోంది. కూటమి కట్టినా…ఆశించిన విజయాలు సాధించలేకపోతోంది. దేశవ్యవాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి. కులగణనతో బీజేపీని దెబ్బ కొట్టాలని వ్యూహాలు వేస్తున్నా…దీన్ని బీజేపీ టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటోంది. కులాల మధ్య చిచ్చు పెడుతోందంటూ విమర్శలు చేస్తోంది.
మూడు రాష్ట్రాల్లో అధికారం
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ..తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలో ఉంది. ఇవన్నీ కూడా చిన్న రాష్ట్రాలే. 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో..ఈ రాష్ట్రాల్లో కూడా గెలుస్తామన్న గ్యారెంటీ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటే…కాంగ్రెస్ చేతిలో ఉన్నవి కూడా పోయే ప్రమాదం లేకపోలేదు.
కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మం లేదా ?
ఇండి కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలు…కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు. కూటమి కట్టే విషయంలోనూ…ఏకతాటికిపై రాలేకపోతున్నారు. ఆర్జేడీ, డీఎంకే, శివసేన ఉద్దవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ వర్గాలు మాత్రమే…కాంగ్రెస్‌తో నడిచేందుకు ముందుకు వస్తున్నాయి. ఆప్, టీఎంసీ లాంటి పార్టీలు కాంగ్రెస్ అంటేనే విరుచుకుపడుతున్నారు. బిజేపీకి వ్యతిరేకంగా వెళ్లడానికి ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నాయి.
హిందూత్వ జెండాతో బీజేపీ
కాషాయ పార్టీ…హిందూత్వ ఎజెండాతో ముందుకు వెళ్తోంది. అసలు సిసలైన హిందుత్వవాద పార్టీ తమదేనని ప్రజల్లో ప్రొజెక్టు చేసుకుంటోంది. ఈ ఫార్ములాతోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వరుసగా విజయం సాధిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా ముస్లింలకు సీట్లు ఇవ్వడం లేదు. అసలు ముస్లింల ఓట్లే వద్దని బల్లగుద్ది చెబుతోంది.
బీజేపీకి కనెక్ట్ అవుతున్న యూత్
దేశంలో ప్రస్తుత జనరేషన్…కమలం పార్టీ బాగా కనెక్ట్ అవుతున్నారు. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతోందని నమ్ముతున్నారు. అవినీతి లేని పాలన సాగుతోందని…అన్ని రంగాల్లో దేశం అగ్రగామిగా నిలుస్తోందనే నమ్మకాన్ని మోడీ కల్పించారు. బీజేపీ పట్ల యూత్ అట్రాక్ట్ కావడానికి ఇదే ప్రధాన కారణం.
బలం లేకపోతే ప్రాంతీయ పార్టీలతో జట్టు
ఏ రాష్ట్రాల్లో బీజేపీకి బలం లేదో…అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనతో పొత్తులతో వెళ్లి విజయం సాధించింది. అంతకముందు మహారాష్ట్ర ఎన్నికల్లోనూ…ఏక్‌నాథ్ సిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో తిరుగులేని విజయాలు సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. ఎక్కడ నెగ్గాలో కాదు…ఎక్కడ తగ్గాల్లో తెలిసిన పార్టీ బీజేపీ. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ…అన్నాడీఎంకే, పీఎంకేతో పొత్తు పెట్టుకుంది.
ఇంతింతై వటుడింతై…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బలం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కానీ…విదేశాల్లో కానీ…మోడీ మ్యానియా మాములుగా ఉండటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా దేశాన్ని ప్రమోట్ విభిన్న స్టైల్‌ను అనుకరిస్తున్నారు. హిందూత్వ బ్రాండ్‌ను నెత్తిన పెట్టుకున్నారు. దేశంలో అయినా…విదేశాల్లో అయినా…హిందూ దేవాలయాలను సందర్శిస్తున్నారు. మోడీ అంటే ఇండియా…ఇండియా అంటే మోడీ అనేలా పేరు సంపాదించుకున్నారు.
ఆర్థికంగా బలపడుతున్న బీజేపీ
వరుసగా మూడుసార్లు అధికారాన్ని కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ వచ్చే విరాళాలు, ఎన్నికల బాండ్లు భారీగా తగ్గిపోయాయి. అదే సమయంలో బీజేపీకి రెండు మూడింతలు పెరుగుతున్నాయి. ఇదంత కేవలం మోడీ మ్యాజిక్ మాత్రమే. ఏఐసీసీ కార్యాలయంలో పని చేసే వారికి జీతాలు ఇవ్వడం కూడా కాంగ్రెస్ పార్టీకి కష్టంగా మారింది. బడా పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీలు, వ్యాపారవేత్తలు…బీజేపీకి వందల కోట్లు విరాళాలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ను మాత్రం పట్టించుకోవడం లేదు. బీజేపీకి వంద కోట్లు ఇస్తున్నవారు…కాంగ్రెస్‌కు పది కోట్లు ఇవ్వడం లేదు.