సమంతకు శుభం జరుగుతుందా.. ట్రైలర్ టాక్ ఏంటి.. నిర్మాతగా సక్సెస్ అవుతుందా..?

ఇన్నాళ్లు కేవలం హీరోయిన్ గా మాత్రమే ఉన్న సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక బ్యానర్ స్థాపించి అందులో చిన్న సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయింది సమంత.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2025 | 01:17 PMLast Updated on: Apr 27, 2025 | 1:17 PM

Subham Movie Trailer Release

ఇన్నాళ్లు కేవలం హీరోయిన్ గా మాత్రమే ఉన్న సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక బ్యానర్ స్థాపించి అందులో చిన్న సినిమాలు నిర్మించాలని ఫిక్స్ అయింది సమంత. మనసుకు నచ్చిన కథలు ఉంటే నిర్మిస్తానని ఇప్పటికే చెప్పింది ఈ భామ. అందులో భాగంగానే మొదటి ప్రయత్నంగా సొంత బ్యానర్ పై సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ చిత్రానికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మే 9న విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ ఇలా అన్నీ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో శుభం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. బడ్జెట్ తక్కువే అయినా నటీనటుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది సమంత. నాచురల్ యాక్టర్స్ అందరూ సినిమాలో కనిపిస్తున్నారు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. చూస్తుంటే మొదటి ప్రయత్నంలోనే మంచి విజయం అందుకునేలా కనిపిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

శుభం ట్రైలర్‌ను గమనిస్తే.. ఊర్లోని మహిళలంతా కూడా సీరియల్‌ను చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ఊర్లో మగాళ్లు కూడా అష్టకష్టాలు పడుతుంటారు. అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్‌ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. సీరియల్స్ అనేవి కాంటెంపరరీ ఇష్యూ. ముఖ్యంగా లేడీస్ బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్టు ఇది. అందుకే తన సినిమా కోసం ఇలాంటి సబ్జెక్టు ఎంచుకుంది సమంత. పైగా ఆమె కూడా నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. శుభం ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రంలో హాస్యం, హర్రర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని ఉన్నట్లు అర్థమవుతుంది. మే 9న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది శుభం. వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఈ సినిమాకు.. క్లింటన్ సెరెజో సంగీత దర్శకుడు. మరి తన మొదటి ప్రయత్నంలో సమంత విజయం అందుకుంటుందా లేదా అనేది చూడాలి.