గుంటూరు కారం అదుర్స్ డెబ్యూలోనే అదరగొట్టిన షేక్ రషీద్
గుంటూరు కుర్రాడి సుధీర్ఘ నిరీక్షణ ఫలించింది. గత మూడు సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూసిన ఈ తెలుగు కుర్రాడు ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చాడు.

గుంటూరు కుర్రాడి సుధీర్ఘ నిరీక్షణ ఫలించింది. గత మూడు సీజన్లుగా ఐపీఎల్ అరంగేట్రం కోసం ఎదురు చూసిన ఈ తెలుగు కుర్రాడు ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున షేక్ రషీద్ బరిలోకి దిగాడు. తన అరంగేట్రపు మ్యాచ్‌లోనే అద్భుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు.ఓపెనర్‌గా బరిలోకి దిగి 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అచ్చం రుతురాజ్ గైక్వాడ్ తరహాలోనే బ్యాటింగ్ చేస్తున్న ఈ కుర్రాడి ఆట తీరుకు కెప్టెన్ ధోనీతో పాటు ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు ఫిదా అయ్యారు. అతని అద్భుతమైన ఆరంభం..ధోనీ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. ఐదు వరుస పరాజయాల తర్వాత రెండో విజయాన్ని నమోదు చేసింది. షేక్ రషీద్ జట్టులోకి రాగానే చెన్నై గెలవడంతో ఈ కుర్రాడి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన ఈ 20 ఏళ్ల కుర్రాడు దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి ప్రోఫెషనల్ క్రికెటర్‌గా ఎదిగాడు. మూడేళ్ల క్రితం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ 2022తో షేక్ రషీద్ భారత క్రికెట్‌లోకి దూసుకొచ్చాడు. ఈ మెగా టోర్నీలో షేక్ రషీద్ భారత జట్టుకు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించాడు. సెమీఫైనల్, ఫైనల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి టీమిండియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతని పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దేశవాళీ క్రికెట్‌లో షేక్ రషీద్ ఆంధ్ర తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చాడు.19 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక డబుల్ సెంచరీతో పాటు 7 హాఫ్ సెంచరీలతో 1204 పరుగులు చేశాడు. 17 టీ20ల్లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో 352 పరుగులు చేశాడు. టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరిన షేక్ రషీద్.. ఐపీఎల్ 2024 సీజన్‌లోనూ ఆ జట్టులోనే కొనసాగాడు. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలోకి దిగినా.. అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 30 లక్షల కనీస ధరకు సీఎస్‌కే.. షేక్ రషీద్‌ను తిరిగి కొనుగోలు చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ తెలుగు తేజం ఎట్టకేలకు అవకాశాన్ని అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. రిషభ్ పంత్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఛేజింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ధోనీ 11 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26 రన్స్ తో పాటు శివమ్ దూబే 37 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 రన్స్ తో చెన్నైని గెలిపించారు.