అది మాయాబజార్ పాటా లేదంటే బజారు పాటా..? శేఖర్ మాస్టర్ మళ్ళీ బుక్ అయ్యేలా ఉన్నాడుగా..!
తల మీద దరిద్ర దేవత డిస్కో డాన్స్ చేస్తున్నప్పుడు.. ఎక్కడ లేని దరిద్రాలన్నీ వచ్చి మన చుట్టూనే ఉంటాయి. కావాలంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ నే తీసుకోండి..!

తల మీద దరిద్ర దేవత డిస్కో డాన్స్ చేస్తున్నప్పుడు.. ఎక్కడ లేని దరిద్రాలన్నీ వచ్చి మన చుట్టూనే ఉంటాయి. కావాలంటే ఇప్పుడు శేఖర్ మాస్టర్ నే తీసుకోండి..! నిన్న మొన్నటి వరకు నెలకు కనీసం 20, 30 పాటలకు కొరియోగ్రఫీ చేసుకుంటూ.. మధ్య మధ్యలో కొన్ని డ్యాన్స్ షోలకు జడ్జిగా వెళ్తూ ఫుల్ బిజీగా ఉండేవాడు శేఖర్ మాస్టర్. ఇప్పుడు కూడా ఆయన స్టార్ కొరియోగ్రాఫర్.. చేతినిండా సినిమాలతో పాటు కావాల్సినన్ని రియాలిటీ షోస్ కూడా ఉన్నాయి. కానీ ఒకప్పటి రెస్పెక్ట్ మాత్రం ఇప్పుడు ఈయన మీద లేదు అనేది కాదనలేని వాస్తవం. తెలుగు సినిమాకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కొత్త కొత్త స్టెప్పులు పరిచయం చేసిన శేఖర్ మాస్టర్.. కొన్ని రోజులుగా క్రియేటివిటీ పేరుతో అసభ్యకరమైన స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడు అంటూ చాలా నెగెటివిటీ మూట కట్టుకున్నాడు ఈయన. దీని మీద రీసెంట్ గా ఒక షోలో అడిగితే బాగా ఎమోషనల్ అయ్యాడు కూడా. తనకు డాన్స్ దైవంతో సమానమని.. అలాంటి డాన్స్ ను తాను ఎప్పుడు తలదించుకునేలా కంపోజ్ చేయను.. అది పాటలను బట్టి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ తాజాగా మరో వివాదంలో శేఖర్ మాస్టర్ ఇరుక్కునేలా కనిపిస్తున్నాడు. ఇక్కడ ఆయన కొరియోగ్రఫీ చేసిన పాట కాదు కానీ.. ఆయన జడ్జిగా ఉన్న ఒక షోకు సంబంధించిన డాన్స్ పర్ఫార్మెన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆహాలో ఓంకార్ యాంకర్ గా డాన్స్ ఐకాన్ అనే ఒక షో వస్తుంది. ఒకప్పటి ఆట నుంచి నిన్న మొన్నటి డాన్స్ షోల వరకు ఒకే ఫార్మేట్ ఫాలో అవుతున్నాడు యాంకర్ ఓంకార్. వాళ్లలో వాళ్లకే పుల్లలు పెట్టి టీఆర్పి రేటింగ్ తెచ్చుకోవాలి అనేది ఈయన ప్లానింగ్. ఒకప్పుడు అది బాగా వర్కవుట్ అయింది కాని ఇప్పుడు పెద్దగా వర్కౌట్ అయ్యేలో కనిపించడం లేదు. అయినా కూడా తన స్టైల్ మార్చడం లేదు ఓంకార్. పైగా క్లాసిక్ సాంగ్స్ ను తీసుకొచ్చి కొత్త కొత్త డాన్స్ స్టెప్పులు అంటూ వాటిని అవమాన పరుస్తున్నారనీ ఒక వర్గం ఆయన మీద రెచ్చిపోతున్నారు. తాజాగా డాన్స్ ఐకాన్ షోలో మాయాబజార్ సినిమాలోని అహనా పెళ్ళంట పాటను పర్ఫార్మ్ చేశారు. ఒంటిమీద కనీసం సగం బట్టలు కూడా లేకుండా అదేదో పాప్ సాంగ్ చేసినట్టు అహనా పెళ్ళంట కొరియోగ్రఫీ చేశారు.
ఈ పాట చూసిన తర్వాత తెలుగు సినిమాను ప్రేమించే ఎవరికైనా కూడా ఒళ్ళు మండిపోవడం ఖాయం. తెలుగు సినిమా చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఒక చిత్ర రాజం మాయాబజార్. అందులో మహానటి సావిత్రి చేసిన అహనా పెళ్ళంట పాట ఎప్పటికీ మర్చిపోలేని ఒక అద్భుతం. అలాంటి ఒక అద్భుతమైన పాటను తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు కొరియోగ్రఫీ చేస్తే.. జడ్జిగా ఉన్న శేఖర్ మాస్టర్ దాన్ని ఖండించడం మానేసి సూపర్ సూపర్ అంటూ ఎంకరేజ్ చేస్తున్నాడు అంటూ ఆయనపై మండిపడుతున్నారు ప్రేక్షకులు. జడ్జ్ హోదా లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక గొప్ప పాటలు తీసుకొచ్చి ఇలా పిచ్చిపిచ్చి గంతులు వేయడం తప్పు అని చెప్పడం మానేసి.. అద్భుతం అంటూ పోవడం ఏంటి అంటూ శేఖర్ మాస్టర్ ను ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ వివాదాస్పద స్టెప్పులు కంపోజ్ చేస్తున్నాడు అంటూ మహిళా సంఘాలు గోల పడుతున్న సమయంలో.. ఆహనా పెళ్ళంట అలాంటి క్లాసిక్ సాంగ్ ని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి డాన్స్ లు వేయించడం ఇప్పుడు శేఖర్ మాస్టర్ మెడకు చుట్టుకునేలా ఉంది. మరి ఈ మొత్తం సీన్ మీద ఆయన ఎలా స్పందిస్తాడో చూడాలి.