టాప్ లేపిన బెంగళూరు, మూడో ప్లేస్ లో ముంబై
ఐపీఎల్ 18వ సీజన్ సెకండాఫ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ మాత్రమే కాదు టాప్ 4 జట్ల మధ్య మ్యూజికల్ ఛైర్ తరహాలో పోటీ నడుస్తోంది.

ఐపీఎల్ 18వ సీజన్ సెకండాఫ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ మాత్రమే కాదు టాప్ 4 జట్ల మధ్య మ్యూజికల్ ఛైర్ తరహాలో పోటీ నడుస్తోంది. మ్యాచ్ మ్యాచ్ కూ ఆయా జట్ల స్థానాలు మారిపోతూ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లు మాత్రం టాప్ 5లో చోటు నిలుపుకుంటూ ఉన్నాయి. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పై రివేంజ్ విక్టరీ అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పాయింట్ల పటికలో టాప్ లేపింది. 14 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. ఆ జట్టు మిగిలి ఉన్న నాలుగు మ్యాచ్ లలో కనీసం 2 గెలిచినా కూడా ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకుంటుంది. బయటి గ్రౌండ్స్ లో ఒక్క ఓటమి కూడా లేకుండా సాగుతున్న ఆర్సీబీ గత వారం హోంగ్రౌండ్ లోనూ పరాజయాల పరంపరకు బ్రేక్ వేసింది.
ఇదిలా ఉంటే పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచింది. గుజరాత్ 8 మ్యాచ్ లలో ఆరు విజయాలు, 2 ఓటములతో 12 పాయింట్లు సాధించింది. అటు వరుసగా ఐదు విజయాలతో ప్లే ఆఫ్ రేసులో దూసుకొచ్చిన ముంబై ఇండియన్స్ కూడా 12 పాయింట్లతోనే ఉన్నప్పటకీ రన్ రేట్ లో మాత్రం కాస్త వెనుకబడింది. ఈ కారణంగానే ముంబై మూడో స్థానంలో నిలిచింది. కానీ ఆ జట్టుకు మిగిలిన నాలుగు మ్యాచ్ లలో కనీసం రెండు గెలిచినా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఇక 12 పాయింట్లు సాధించిన మరో టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రన్ రేట్ విషయంలో వెనుకబడి నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు కోల్ కత్తాతో మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత 11 పాయింట్లు ఉన్న పంజాబ్ కింగ్స్ ఐదో ప్లేస్ లో కొనసాగుతోంది.
కాగా ముంబై చేతిలో ఓటమితో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో కిందకి దిగజారింది. 10 పాయింట్లతో లక్నో ఆరో ప్లేస్ లో ఉంది. పది మ్యాచ్‌లలో ఐదింట్లో ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో మూడింట్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆడిన 9 మ్యాచ్ లలో కేవలం మూడు మాత్రమే గెలవగా… ఐదింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ వర్షంతో రద్దవడంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఏడు పాయింట్లతో ఉన్న కోల్ కత్తా ఏడో ప్లేస్ లో ఉండగా.. ప్లే ఆఫ్ చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ లలో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఇక చెన్నై సూపర్ కింగ్స్ పై విజయంతో ప్లే ఆఫ్ అవకాశాలు కాస్త నిలుపుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. సన్ రైజర్స్ తాను ఆడిన 9 మ్యాచ్ లలో మూడు విజయాలు, 6 పరాజయాలతో 6 పాయింట్లే సాధించింది. ఇక ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా తప్పుకున్న రాజస్థాన్ రాయల్స్ , చెన్నై సూపర్ కింగ్స్ తొమ్మిది, పదో స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు జట్లదీ ఒకటే పరిస్థితి. ఈ సీజన్ లో తొమ్మిదేసి మ్యాచ్ లు ఆడిన రెండు జట్లు కేవలం రెండింటిలోనే గెలిచి ఏడు మ్యాచ్ లలో ఓడిపోయాయి. అద్భుతాలు జరిగినా కూడా రాజస్థాన్ , చెన్నై ప్లే ఆఫ్ చేరుకునే పరిస్థితి లేదు.