Top Story: ఓరి నీ ఓవరాక్షనో….. కొంప ముంచావు కదరా, గోరంట్ల మాధవ్ ఓవరాక్షన్ తో ఇరుకునపడ్డ వైసిపి

ప్రతి పార్టీలోనూ ఒకరో ఇద్దరో .... ఓవరాక్షన్ గాళ్లు.... అతిగాళ్ళు కచ్చితంగా ఉంటారు. ఎవరు... ఎంత చెప్పినా ... ఎంత అడ్డుకున్న.... వాళ్ల ఓవరాక్షన్ తో పార్టీ కొంప ముంచుతూనే ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 17, 2025 | 03:00 PMLast Updated on: Apr 17, 2025 | 3:00 PM

Ycp In Trouble With Gorantla Madhavs Overreaction

ప్రతి పార్టీలోనూ ఒకరో ఇద్దరో …. ఓవరాక్షన్ గాళ్లు…. అతిగాళ్ళు కచ్చితంగా ఉంటారు. ఎవరు… ఎంత చెప్పినా … ఎంత అడ్డుకున్న…. వాళ్ల ఓవరాక్షన్ తో పార్టీ కొంప ముంచుతూనే ఉంటారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఓవరాక్షన్ ఇప్పుడు వైసీపీకి అలాంటి తలనొప్పే తెచ్చింది. అధినేత జగన్ మెప్పు పొందడానికి అతను స్థాయి మరిచి చేసిన డ్రామా చివరికి పార్టీ పరువు తీసింది. వైసీపీకి రావలసిన సానుభూతిని కూడా పోగొట్టాడు గోరంట్ల మాధవ్. ఇప్పుడు మాధవ్ పేరు ఎత్తితే పార్టీలో తన్నేటట్లు ఉన్నారు.టిడిపి కార్యకర్త, ఐ టి డి పి భాగస్వామి చేబ్రోలు కిరణ్ ,మాజీ ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పై అసహ్యకరమైన కామెంట్స్ చేశాడు. ఏ పార్టీ వాళ్లు…. ఏ వర్గం వాళ్లు జీర్ణించుకోలేని దుర్మార్గమైన కామెంట్స్ అవి.

దీనికి వెంటనే రియాక్ట్ అయిన కూటమి ప్రభుత్వం చేబ్రోలు కిరణ్ నీ అరెస్ట్ చేసింది. అతనిని కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ సినిమా ఫక్కి లో ఒక వాహనంపై వెంబడించి, పోలీసు వాహనాన్ని అడ్డగించి పోలీస్ కస్టడీలో ఉన్న కిరణ్ పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. అది చూసి మొదట పోలీసు వాళ్లే షాక్ అయిపోయారు .పోలీస్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని కొట్టడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. గోరంట్ల మాధవ్ చిన్నపిల్లడేం కాదు. అలాగని అమాయకుడు… కాదు. అతను ఒక మాజీ పోలీస్ అధికారి. ఒక మాజీ ఎంపీ కూడా. అలాంటి వ్యక్తి సినిమా స్టైల్ లో పోలీసు వాహనాన్ని వెంబడించడం, వాళ్ళ వెహికల్ కి తన వెహికల్ ని అడ్డంగా పెట్టడం…. అందులోంచి దూకి చేబ్రోలు కిరణ్ నీ కొట్టడానికి ప్రయత్నించడం ,ఈ డ్రామా అంతా చూస్తే గోరంట్ల మాధవ్ ఎంత పనికిమాలినోడో అర్థమవుతుంది. అసలు పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎటాక్ చేసి కొట్టడం సాధ్యమేనా? ఒక మాజీ ఎంపీ ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ ఒంటి మీద స్పృహ లేకుండా ఇలా వ్యవహరిస్తే దీన్నేమనుకోవాలి?. ఇదంతా పెద్ద డ్రామాగా అనిపించదా.? జనం అంతా అదే అనుకున్నారు. ఇలాంటి డ్రామాలు, వేషాలు గోరంట్ల మాధవ్ కి కొత్త ఏం కాదు.

అనంతపురంలో సీఐ గా ఉన్న రోజుల్లో జేసీ దివాకర్ రెడ్డి కుటుంబీకులను వ్యతిరేకిస్తూ పోలీసుల ప్రతినిధిగా వాళ్ల ముందే మీసం తిప్పి అప్పట్లో పెద్ద హీరో అయిపోయాడు మాధవ్. జెసికి వ్యతిరేకంగా మీసం తిప్పాడు కనుక టికెట్ ఇస్తే వర్కౌట్ అవుతుంది, పైగా బీసీ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి అని ఆలోచించి జగన్ ….మాధవ్ కి టికెట్ ఇచ్చాడు. జగన్ వేవ్ లో మాధవ్ ఎంపీ అయిపోయాడు. అయితే ఓ రోజు వీడియో కాల్ లో ఓ మహిళతో మాట్లాడుతూ మాధవ్ చేసిన అంగాంగ ప్రదర్శన వైసీపీ పరువు తీసింది. ఛీ పార్లమెంటేరియన్లంటే ఇంత నీచంగా ఉంటారా అనేంతగా ప్రవర్తించాడు మాధవ్. ఆ దెబ్బకి మాధవ్ కి ఎన్నికల్లో టికెట్ కూడా నిరాకరించారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా జగన్ వెనకే తిరుగుతున్నాడు మాధవ్. అనంతపురం జిల్లా రాప్తాడు టికెట్టు వచ్చే ఎన్నికల్లో తనకు ఇవ్వాలంటూ జగన్నీ కోరాడు గోరంట్ల. రాప్తాడు టికెట్టు తోపుదుర్తి కి కేటాయించినందువలన…. మరొకరికి అవకాశం లేదని పార్టీ కోసం పనిచేయాల్సిందని, వీలు చూసుకుని భవిష్యత్తులో ఎమ్మెల్సీ ఇస్తానని గోరంట్ల మాధవ్ కి జగన్ హామీ ఇచ్చాడు. అయినా మాధవ్ ఎక్కడ తగ్గడం లేదు. ఆశ చంపుకోవడం లేదు. ఎప్పుడు వీలైతే అప్పుడు అధినేత దృష్టిలో పడాలని ,ఎలా వీలైతే అలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్య వైసీపీ ఆఫీస్ లోనే ప్రెస్ మీట్ పెట్టి తన స్థాయిని మించిన మాటలు మాట్లాడాడు.

అంతటితో ఆగిపోలేదు ఎవడో చేబ్రోలు కిరణ్,వైయస్ భారతిని కామెంట్ చేశాడని ఏకంగా పోలీసుల సమక్షంలో అతని కొట్టడానికి వెళ్లాడు గోరంట్ల. గోరంట్ల చేసిన ఈ ఓవరాక్షన్ చివరికి అతని అరెస్టుకు దారితీసింది. అంతవరకు అయితే పర్వాలేదు…. భారతీపై ఐ టి డి పి కిరణ్ చేసిన కామెంట్లు వైసీపీకి మొదట్లో సానుభూతిని తెచ్చిపెట్టాయి.వైయస్ భారతి గురించి అంత అసభ్యంగా మాట్లాడటం దారుణమైన తప్పని అందరూ అంగీకరించారు. అలాంటి వాతావరణాన్ని బ్రేక్ చేస్తూ గోరంట్ల మాధవ్ ,కిరణ్ పై అటాక్ చేయడంతో….. వైసీపీకి వచ్చిన సానుభూతి కాస్త పోయింది. వ్యవహారం మొత్తం డైవర్ట్ అయిపోయింది. దీంతో వైసీపీ నేతలు చాలామంది గోరంట్ల మాధవ అంటే మండిపడుతున్నారు. మాధవ్, కిరణ్ పై అటాక్ చేయడాన్ని పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం కూడా అడ్వాంటేజ్ చేసుకున్నాయి. వ్యవహారాన్ని పూర్తిగా మాధవ వైపు మళ్లించాయి. మాధవ్ పై కేసు పెట్టాయి. అలాగే మాధవ్ లోకేష్ ను చెప్పుకోలేని పదాలతో దూషించాడని మరో కేసు పెట్టారు పోలీసులు. మాధవ్ చేసిన పనికిమాలిన పనితో మొత్తం పార్టీ డైరెక్షన్ మారిపోయింది. తమకు అనుకూలంగా సానుభూతి వస్తుంది అనుకున్న తరుణంలో మాధవ్ చేసిన ఓవరాక్షన్ మొత్తం వ్యవహారాన్ని పక్కదారి పట్టించింది. మాధవ్ లాంటివాళ్ళు పార్టీకి ఎప్పటికైనా నష్టమేనని ఇలాంటి వాళ్లని వదిలించుకుంటే మంచిదని వైసీపీ సీనియర్లే చెప్తున్నారు.