Top story: ఆంజనేయులుని అందుకే అరెస్ట్ చేశారా…?
పీఎస్ఆర్ అరెస్ట్ వెనక చాలా పెద్ద కథే ఉంది. జత్వానీ కేసు అన్నది చాలా చిన్నది. ఈ కేసులో అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేవారు. కానీ వాస్తవం అది కాదు.

పీఎస్ఆర్ అరెస్ట్ వెనక చాలా పెద్ద కథే ఉంది. జత్వానీ కేసు అన్నది చాలా చిన్నది. ఈ కేసులో అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేసేవారు. కానీ వాస్తవం అది కాదు. కోర్టు తిట్టినందుకే అరెస్ట్ చేసినట్లు చెబుతున్నా… అసలు కథ వేరే. ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నా వైసీపీతో అంటకాగుతున్నారు. ఓ రకంగా ఆ పార్టీ కార్యకర్తగా మారిపోయారన్నది ఆరోపణ. అంతేకాదు వైసీపీ హయాంలో చక్రం తిప్పిన పలువురు నేతలు ఇప్పుడు స్కామ్‌ల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు. వాళ్లందరినీ కాపాడే పనని తన నెత్తికి ఎత్తుకున్నారన్నది ఆంజనేయులుపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినాష్ రెడ్డి, వల్లభనేని వంశీ వంటి వారు కోర్టుల్లో ఏం చెప్పాలి…? కేసులు వీక్ కావాలంటే ఏం చేయాలి…? వంటి సలహాలు ఆంజనేయులే ఇచ్చారంటున్నారు.
లిక్కర్ స్కామ్‌లో కీలకంగా మారిన రాజ్ కేసిరెడ్డి ఇన్నాళ్లూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరగడానికి కూడా ఆంజనేయులే కారణమని ప్రభుత్వ పెద్దలు నమ్ముతున్నారు. ఎక్కడికి పారిపోవాలి, ఎలా వ్యవహరిస్తే పోలీసులు పట్టుకోలేరు… ఫోన్లు వాడాలా వద్దా వంటి అన్ని సలహాలు ఆయన ఇచ్చినట్లు భావిస్తున్నారు. పోలీస్ బాస్ కావడంతో తమ డిపార్ట్‌మెంట్ ఎలా వ్యవహరిస్తుందో ఆయనకు బాగా తెలుసు. లూప్‌హోల్స్‌ను ఎలా పట్టుకోవాలి, ఎలా తప్పించుకోవాలి అన్నది ఆయనకు బాగా తెలుసు. ఇంటెలిజెన్స్ బాస్‌గా పనిచేయడంతో అక్కడి వారితో మంచి సంబంధాలే ఉన్నాయి. వాటి సాయంతో సమాచారం సేకరించి దాన్ని వైసీపీ పెద్దలకు అప్పగిస్తున్నారన్నది ఆరోపణ. విజయవాడ వదిలి వెళ్లకూడదన్న ఆదేశాలు ఉన్నా దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా హైదరాబాద్‌లో మకాం వేసి చక్రం తిప్పుతున్నారు.
లిక్కర్ స్కామ్ బయటపడితే గత ప్రభుత్వ పెద్ద తలకాయలు ఇరుక్కుపోతాయి. జగన్, మిథున్ రెడ్డి సహా పలువురు పెద్దలకు ఇప్పటికే గుండెదడ మొదలైంది. మిథున్ రెడ్డి సిట్ విచారణకు కూడా హాజరయ్యారు. అరెస్ట్ చేయకుండా కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. వేలకోట్ల కుంభకోణం బయటపడితే అది రాజకీయంగా ఎంత ఎదురుదెబ్బో వారికి తెలుసు. ఈ స్కామ్‌లో కీలకమైన రాజ్ కేసిరెడ్డి విచారణలో ఏం చెబుతారోనన్న టెన్షన్ వారికి ఉంది. ఈ సమయంలో పీఎస్ఆర్ వారికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా అడ్డుకోవడం కోసమే అదుపులోకి తీసుకున్నారా అన్న అనుమానాలున్నాయి. ఇప్పటికే విజయసాయిరెడ్డి వైసీపీకి కంట్లో నలుసులా మారారు. లేటెస్ట్‌గా ఆయన చేసిన ట్వీట్ వైసీపీని కంగారు పెట్టిస్తోంది. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు మిగిలినవి విప్పడానికి హెల్ప్ చేస్తానంటూ విజయసాయి చేసిన కామెంట్ జగన్‌ను ఉద్దేశించేనన్న ప్రచారం సాగుతోంది.
లిక్కర్ స్కామ్ జరిగిందన్నది వాస్తవం. వేలకోట్లు కొట్టేశారన్నది నిజం. కూటమి సర్కార్ చెప్పినంత జరిగిందో లేదో తెలియదు కానీ మందుపేరుతో అడ్డంగా దోచుకున్నారని జనం నమ్ముతున్నారు. ఎంత సరఫరా చేశారో, ఎంత ట్యాక్స్ కట్టారో, ఎంత వసూలు చేశారో లెక్కలే లేవు. రాజ్ కేసిరెడ్డి లిక్కర్ సొమ్మును వసూలు చేసి నాటి ప్రభుత్వ పెద్దలకు చేరవేశాడన్నది ఆరోపణ. ఇందుకోసం ఓ నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వివరాలు ప్రభుత్వం దగ్గరున్నాయి.
ఇప్పుడు ఆ కేసులో జగన్‌ను అరెస్ట్ చేయాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అయితే పొలిటికల్ వ్యవహారం కావడంతో ఇందుకు ఒప్పుకోవాలని కేంద్రాన్ని పలుమార్లు కోరారు కూడా. అయితే బీజేపీ మాత్రం వెయిట్ అండ్ సీ అన్నట్లు వ్యవహరిస్తోంది. రేపు టీడీపీ కాలరెగరేస్తే అప్పుడు జగన్ హెల్ప్ అవుతారన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకే ఏమీ తేల్చడం లేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా దీనిపై కమలం పెద్దలను బతిమాలుతున్నారని చెబుతున్నారు. ఇప్పుడు అన్ని వైపులా ఇరికించి బీజేపీ పెద్దలను కూడా ఒప్పించాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. స్కిల్ కేసులో తనను అరెస్ట్ చేసిన జగన్‌ను ఎలాగైనా మూసేయాలన్నది బాబు ఆలోచనగా కనిపిస్తోంది. ఈ సమయంలో ఆంజనేయులు బయట ఉంటే మంచిది కాదన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచన. ఏ చిన్న సమాచారం బయటకు వెళ్లినా దాన్ని జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటారని తెలుసు. అందుకే అన్ని దారులు మూసేస్తున్నారు.