ఈ ఏడాది H1-B వీసాలు కష్టమే
అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న వీసాల్లో హెచ్1బీ వీసా ఒకటి. చాలా మందికి ఇదొక డ్రీమ్. గ్రాడ్యుయేషన్ టైం నుంచే వీసా మీద ఆశలు పెట్టుకుంటారు చాలా మంది విద్యార్థులు.

అమెరికా వీసాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న వీసాల్లో హెచ్1బీ వీసా ఒకటి. చాలా మందికి ఇదొక డ్రీమ్. గ్రాడ్యుయేషన్ టైం నుంచే వీసా మీద ఆశలు పెట్టుకుంటారు చాలా మంది విద్యార్థులు. ఎంత డిమాండ్ ఉందో ఆ వీసా రావడం కూడా అంతే కష్టం. అంత సింపుల్‌గా ప్రతీ ఒక్కరికీ ఈ వీసా దొరకదు. అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్1బీ వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారయ్యింది. అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్1బీ వీసాలు పొందడంలో మల్టీ నేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల జారీపై కఠిన ఆంక్షలు విధించారు. దీంతో వేరే దేశాల నుంచి నైపుణ్యం కలిగిన ఎంప్లాయిస్‌ను అమెరికాకు తీసుకురాలేక మల్టీ నేషనల్ కంపెనీలు అష్ట కష్టాలు పడుతున్నాయి.
ఎన్నడూ లేని విధంగా అమెరికా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 85 వేల మందికి మించి హెచ్1బీ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితిని విధించింది. మార్చి7న ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి 24తో ముగియనుంది. ఈ వీసాల కోసం ఇప్పటికే 4 లక్షల 23 వేల 28 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురి అవుతాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కంపెనీలపై తీవ్ర ప్రభావం ప్రస్తుత నిబంధనల ప్రకారం చూస్తే.. దరఖాస్తు చేసుకున్న వారిలో 20 శాతంకు మించి హెచ్1బీ వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదట. విదేశాల్లో జన్మించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఇతర అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను దీర్ఘకాలం పనిచేసే విధంగా ఈ వీసా ద్వారా కంపెనీలు నియమించుకుంటాయి. రీసెంట్‌గా ట్రంప్ విధించిన కఠిన నిబంధనల వల్ల 3 లక్షలకు పైగా నైపుణ్యం కలిగిన హ్యూమన్ రీసోర్స్‌ను అమెరికా కోల్పోతోందని, ఈ నిర్బంధ నిబంధనలు కంపెనీ యాజమాన్యాలకు తీవ్ర సమస్యలను తీసుకు వస్తున్నాయని ఫోర్బ్స్ తన నివేదికలో వ్యాఖ్యానించింది.
హెచ్1బీ వీసాకంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటోందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2024లో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శకుల కోటాలో జారీ చేసే బీ1/బీ2 వీసాలు 72 శాతం మందికి జారీ అయ్యాయి. వేసవి కార్మికులు, పరిశోధకుల కోటాలో జారీ అయ్యే జే1 వీసాలు 89 శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల ఆమోదముద్ర పడింది. అమెరికాలో హెచ్1బీ వీసాలతో పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీల్లో 9 లక్షల నుంచి 10 లక్షలపైనే వేతనం లభిస్తుంది. అందుకే ప్రతీ భారతీయుడు హెచ్1బీ వీసాపై అమెరికాకు వెళ్లి పనిచేయాలనుకుంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే H1B వీసా రావడం అనేది కష్టంగానే కనిపిస్తోంది. దీంతో అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకునేవాళ్లతో పాటు అక్కడ ఉన్న MNC కంపెనీలకు కూడా తీవ్ర నష్టమే అంటున్నారు నిపుణులు.