బెంగళూరులో న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా...ఘోరంగా ఓడిపోయింది. తొలి ఇన్నింగ్స్ లో అయితే...మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. పిచ్ ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారా ? లేదంటే బిజీ షెడ్యూల్...ప్లేయర్ల ఆటతీరుపై ప్రభావం చూపుతోందా ? విరామం లేకపోవడంతోనే...ఆటగాళ్లకు ఆటపై ఏకాగ్రత తగ్గుతోందా ? బెంగళూరు టెస్టులో ఓటమికి ఇది కూడా ఒక కారణమా ? భారత క్రికెట్ జట్టు ప్రతి ఏడాది విరామం లేకుండా మ్యాచ్ ఆడుతోంది. వన్డేలు, టెస్టులు, టీ20లు, ఇండియన్ ప్రీమియర్ లీగ్..వీటికి అదనంగా వన్డే ప్రపంచ కప్ లేదా టీ 20 ప్రపంచ కప్, టెస్టు ఛాంపియన్ ఫైనల్ వంటి ఆడుతోంది. బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్...దాదాపు రెండు నెలలు జరుగుతోంది. ఏప్రిల్ నెలలో మొదలైతే...జూన్ నెలలో ముగుస్తోంది. టీ20 మాయలో పడిన తర్వాత...ప్లేయర్లకు వన్డేలు, టెస్టు మ్యాచ్ లపై ఇంట్రెస్ట్ తగ్గుతోంది. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి బాదడానికి మొగ్గు చూపుతున్నారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలి...వీలయినన్ని పరుగులు రాబట్టాలనే కాన్సెప్ట్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ జనరేషన్ మొత్తం టీ20లకే అలవాటు పడిపోయారు. టెస్టులు, వన్డేలపై ఏమాత్రం ఏకాగ్రత పెట్టడం లేదు. పొట్టి ఫార్మాట్ రాకముందు...టెస్టులు, వన్డేలు ఆడటానికి ప్లేయర్లు విపరీతంగా కష్టపడేవారు. టెస్టు జట్టులో చోటు కోసం విపరీతంగా పోటీ ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. మూడు ఫార్మాట్లకు మూడు జట్లను బోర్డులు ఎంపిక చేస్తున్నాయి. వచ్చే 70 రోజుల్లో టీమిండియా న్యూజిలాండ్ మరో రెండు టెస్టులు, సౌతాఫ్రికాతో నాలుగు టీ20లు ఆడాల్సి ఉంది. ఇది ముగిసిన వెంటనే ఆస్ట్రేలియాతో సిరీస్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడనుంది. మొత్తంగా 7 టెస్టులు, నాలుగు టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది. అంటే టెస్టులకు 35 రోజులు, టీ20లకు నాలుగు రోజులు పోతుంది. మిగిలింది 31 రోజులు...ఇందులో ప్లేయర్లు ఎప్పుడు ప్రాక్టీసు చేసుకోవాలి. టెస్టు మ్యాచ్ లకు అయితే నాలుగైదు రోజులు విరామం దొరుకుతోంది. అందులోనే ఒక రోజు మ్యాచ్ జరిగే ప్లేస్ కు చేరడం...మరో రోజు ఇంకో ప్రాంతానికి జర్నీ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే హోటల్ నుంచి స్టేడియంకు రావాల్సి ఉంటుంది. ఇందు కోసం గంటల కొద్దీ ప్రయాణించాల్సి ఉంటుంది. వరుస జర్నీలతో ప్లేయర్లు తీవ్రంగా అలసి పోతున్నారు. పొట్టి ఫార్మాట్ కు అయితే..మరీ దారుణం ఒక రోజే గ్యాప్ ఉంటోంది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి...విరామం తీసుకోవడానికి ఛాన్సే దొరకడం లేదు. ఆదాయంలో పడిన బీసీసీఐ....ఆటగాళ్ల ఫిట్ నెస్ గురించి పట్టించుకోవడం లేదు. బిజీ షెడ్యూల్ తో కుటుంబాలకు దూరమవుతున్నారు. 24 గంటలూ ప్రాక్టీస్ చేయడం లేదంటే మ్యాచ్ లు ఆడటం జరుగుతోంది. పర్సనల్ లైఫ్ అన్నదే ఉండటం లేదు. బిజీ షెడ్యూల్ ను ఆడలేని క్రికెటర్లు...బీసీసీఐని ప్రత్యేకంగా రిక్వెస్టు చేసుకుంటున్నారు. ఫలానా సీరిస్ కు అందుబాటులో ఉండటం లేదని సెలక్షన్ కమిటీకి చెప్పేస్తున్నారు. దీంతో మరో ఆటగాడిని ఎంపిక చేయాల్సి వస్తోంది. ధనాధన్ ఇన్నింగ్స్ వచ్చిన తర్వాత ప్లేయర్లలో క్వాలిటీ దెబ్బతింటోంది. ఆఫ్ సైడ్ బంతులను లెగ్ సైడ్ కొడుతున్నారు. బౌలర్ లైన్ అండ్ లెంత్ వేస్తే...వికెట్ల ముందు దొరికిపోతున్నారు. ఏ బంతిని ఎలా ఆడాలో...ఏ బంతిని వదిలేయాలో...యార్కర్ ను ఎలా డిఫెన్స్ చేయాలో ప్రస్తుత క్రికెటర్లకు తెలియడం లేదు. ఐపీఎల్ ఫుణ్యంతో క్రికెటర్లకు కాసుల వర్షం కురుస్తుండటంతో...అందరు వాటికే అలవాటు పడిపోయారు. నాణ్యమైన ఆట గురించి పట్టించుకోవడం మానేశారు. దీనికి తోడు బీసీసీఐ ప్లేయర్లు ఏ మాత్రం విరామం లేకుండా షెడ్యూల్ ఖరారు చేస్తోంది. ఏ దేశంలో పర్యటించినా..గతంలో టెస్టుల సిరీస్ తో పాటు వన్డే సిరీస్ ఆడేది. ప్రస్తుతం టెస్టులు లేదంటే టీ20లు, వన్డేలు లేదంటే టీ20లు ఆడుతోంది. ఆ సిరీస్ ముగించుకొని వచ్చిన వెంటనే...మరో జట్టు ఇండియాలో పర్యటిస్తోంది. ఇలా వరుసగా షెడ్యూళ్లు ఉండటంతో ఆటగాళ్లు అలసిపోతున్నారు. ఒక టెస్టు మ్యాచ్ ఆడాలంటే... ఏ ప్లేయర్ అయినా...లాంగ్ జర్నీలు చేయాల్సి వస్తోంది. ఎంత ఫ్లైట్ లో ప్రయాణం అయినా...ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు...హోటల్ నుంచి స్టేడియంకు...మళ్లీ మ్యాచ్ ముగియగానే కొన్ని గంటల కూడా సమయం ఉండటం లేదు. వెంటనే మళ్లీ కిట్లు సర్దు కోవాలి...మళ్లీ బస్సెక్కాలి...ఎయిర్ పోర్టుకు వెళ్లాలి...మ్యాచ్ జరిగే నగరానికి చేరుకోవాలి. క్రికెటర్ల లైఫ్ స్టేడియంలు లేదంటే...జర్నీలకే సరిపోతోంది. రెస్ట్ తీసుకోవడానికి సమయం ఎక్కడుంది. ఇదే ఇపుడు క్రికెటర్ల కొంపముంచుతోంది. బిజీ షెడ్యూల్ తో మ్యాచ్ లు ఆడి...సరైన ప్రదర్శన చేయడం లేదు. 10 నుంచి 15 ఏళ్లు క్రికెట్ ఆడాల్సిన వాళ్లు...కనీసం నాలుగైదేళ్లు కూడా కెరీర్ ఆడటం లేదు.